సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై గురువారం ఉదయం ఆదాయపు పన్ను శాఖ దాడులు నిర్వహిస్తోంది. జూబ్లీహిల్స్ కో–ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ అక్రమాల కేసు, ఓటుకు కోట్లు కేసు ఆరోపణల నేపథ్యంలో ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన రెండు ఐటీ బృందాలు హైదరాబాద్‌లోని రేవంత్ రెడ్డి ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రేవంత్ రెడ్డితో పాటు ఆయన బంధువులు, సన్నిహితులైన 15మంది ఇళ్లు, కార్యాలయాలపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నట్టు సమాచారం. అయితే ప్రస్తుతం ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఉండగా.. కుటుంబ సభ్యులు తిరుపతిలో ఉండటంతో ఆయా చోట్ల అక్కడ ఉన్న సిబ్బందికి నోటీసులు ఇచ్చి దాడులు చేసినట్టు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి, ఆయన సోదరుడికి సంబంధించిన పలు కంపెనీ లావాదేవీలపై కూడా ఐటీ అధికారులు ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. లెక్కా పత్రం లేని అక్రమ ఆర్థిక లావాదేవీలపై వారు ఫోకస్ చేసినట్టు సమాచారం.
గతవారం ఈడీ, ఇన్‌కంట్యాక్స్, సీబీఐలతో తనపై కక్ష సాధింపునకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రయత్నాలు చేయిస్తున్నారని, తనకు, తన కుటుంబానికి ఏం జరిగినా కేసీఆర్‌తోపాటు డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ డీఐజీ ప్రభాకర్‌రావులే బాధ్యత వహించాలని రేవంత్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ఐటీ దాడులు జరగడం గమనార్హం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అకస్మాత్తుగా రేవంత్ రెడ్డి లక్ష్యంగా ఈడీ దాడులు జరగటం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇటీవలే ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరిపిన సంగతి తెలిసిందే.
ఓటుకు కోట్లు కేసులో ముద్దాయి..
గతంలో రాజకీయాల్లో కలకలం రేపిన ఓటుకు కోట్లు కేసులో అప్పటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి ముద్దాయి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్‌కు 50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబు ఆడియో టేపు(బ్రీఫ్డ్ మీ) బహర్గతం అయింది. అయితే గత కొంత కాలంగా ఓటుకు కోట్లు కేసు నత్తనడకన నడుస్తోందని, కేసు నీరుగారుతుందంటూ పలువురు రాజకీయ విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment