స్పష్టత వచ్చేదెన్నడు..! | Who Will Got Mp Tickets In Warangal | Sakshi
Sakshi News home page

స్పష్టత వచ్చేదెన్నడు..!

Published Sat, Mar 9 2019 11:07 AM | Last Updated on Sat, Mar 9 2019 11:07 AM

Who Will Got Mp Tickets In Warangal - Sakshi

వరంగల్‌: పసునూరి దయాకర్, కడియం శ్రీహరి, కడియం కావ్య

సాక్షిప్రతినిధి, వరంగల్‌: లోక్‌సభ ఎన్నికలకు వేళైంది. త్వరలోనే షెడ్యూల్‌ విడుదలపై ఊహాగానాలు జోరందుకున్నాయి. కేంద్ర ఎన్నికల చీఫ్‌ కమిషనర్‌ సునీల్‌ అరోర కూడా ఎన్నికల ప్రక్రియ పూర్తయినట్లు ఇటీవల ప్రకటించారు. వారం, పది రోజుల్లో షెడ్యూల్‌ విడుదల కావచ్చన్న చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలు సైతం క్యాడర్‌ త్వరలోనే నోటిఫికేషన్‌ వస్తుందన్న సంకేతాలు ఇస్తున్నాయి.

ఓవైపు సీఎం కుమారుడు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎన్నికల సన్నాహక సమావేశాలకు శ్రీకారం చుట్టారు. ఈనెల 6న కరీంనగర్‌ నుంచి ఎన్నికల శంఖం పూరించారు. మరోవైపు ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే అభ్యర్థులను ప్రకటనపై టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ కసరత్తు చేస్తుండటం పార్టీ వర్గాల్లో ఉత్కంఠత రేపుతోంది. 

రెండు స్థానాల నుంచి రోజుకో పేరు...

టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ గత కొంతకాలంగా జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వరంగల్‌(ఎస్సీ), మహబూబాబాద్‌(ఎస్టీ) లోక్‌సభ స్థానాల నుంచి సీనియర్లు, ఫెడరల్‌ ఫ్రంట్‌కు ఉపకరించే నేతలకు ఈసారి అవకాశం కల్పిస్తారన్న చర్చ కొన్ని రోజులుగా సాగుతోంది. దీంతో వరంగల్, మహబూబాద్‌ల నుంచి ఎంపీలుగా ఉన్న పసునూరి దయాకర్, ప్రొఫెసర్‌ సీతారాంనాయక్‌లకు మళ్లీ టికెట్లు దక్కుతాయా? అన్న చర్చ పార్టీలో జరుగుతోంది.

పసునూరి దయాకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్‌ లోక్‌సభ స్థానం నుంచి ఈసారి మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఎంపీ అభ్యర్థిగా ప్రకటించవచ్చంటున్నారు. అయితే ఆయన అందుకు సుముఖత వ్యక్తం చేస్తారా? లేదా? అన్న విషయాలను పక్కనబెడితే పార్టీ అవసరాల రీత్యా ఆయననే ఎంపీ అభ్యర్థిగా ఖరారు చేయవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఆయన మాత్రం తన కూతురు కడియం కావ్య పేరును సూచిస్తున్నారన్న చర్చ కూడా జరుగుతోంది.

ఇదే సమయంలో జనగామ ప్రాంతానికి చెందిన డాక్టర్‌ పగిడిపాటి సుగుణాకర్‌రాజుతో పాటు మాజీ ఎంపీపీ, సీనియర్‌ నాయకుడు రామగళ్ల పరమేశ్వర్‌ తదితరులు వరంగల్‌ టికెట్‌ కావాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇక మహబూబాబాద్‌ స్థానం నుంచి ప్రొఫెసర్‌ సీతారాంనాయక్‌ ఎంపీగా ఉండగా.. ఇక్కడినుంచి అవకాశం ఇస్తే పోటీ చేసేందుకు పలువురు ప్రయత్నాలు చేస్తున్నారు.

ఇందులో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి రామచంద్రనాయక్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తుండగా, మాజీ మంత్రి రెడ్యానాయక్‌ కూతురు, మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత పేరు కూడా ప్రచారంలో ఉంది. కాంగ్రెస్‌ పార్టీలో బలమైన నాయకుడు, మాజీ ఎంపీ ఒకరు సైతం టికెట్‌ ఇస్తే అధికార పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

17 తర్వాత స్పష్టత ఇచ్చే అవకాశం...

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను వీలైనంత తొందరలో ప్రకటించనుందని టీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నేత ఒకరు తెలిపారు. ఇందుకోసం పార్టీ అధినేత కేసీఆర్‌ కసరత్తు కూడా చేస్తున్నారని సమాచారం. వరంగల్, మహబూబాబాద్‌ స్థానాలపై ఆ పార్టీ అధినేత త్వరలోనే స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.

ఈ నెల 6నుంచి ఎన్నికల సన్నాహక సమావేశాలకు కరీంనగర్‌ నుంచి శ్రీకారం చుట్టిన వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ 17ను ఈ సమావేశాలను ముగించనున్నారు. సన్నాహక సమావేశాల సందర్భంగా జిల్లాలు పర్యటిస్తున్న ఆయన అభ్యర్థుల ఎంపికపై ఆయా జిల్లాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, సీనియర్ల అభిప్రాయాలు కూడా సేకరిస్తున్నారు.

ఓవైపు సమావేశాలు.. మరోవైపు అభిప్రాయ సేకరణ అభ్యర్థుల ఎంపికకు ప్రామాణికంగా కూడా భావిస్తున్నారు. ఇదిలా వుంటే కరీంనగర్‌లో సన్నాహక సమావేశంలో శంఖారావం పూరించిన కేటీఆర్‌ ఎంపీగా వినోద్‌కుమార్‌ను ఐదు లక్షల మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆ మరుసటి రోజు వరంగల్‌ ఓ సిటీలో జరిగిన సమావేశంలో మాత్రం రెండు స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను ఐదు లక్షల చొప్పున మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఇక్కడ సిట్టింగ్‌ ఎంపీల పేర్లు ప్రస్తావించకుండా అభ్యర్థులను గెలిపించాలని పిలువునివ్వడం ద్వారా ఈసారి సిట్టింగ్‌లకు సీట్లు కష్టమేనన్న చర్చ జరుగుతోంది. సన్నాహక సమావేశాలు 17న ముగియనుండగా.. ఆ తర్వాత పార్టీలో చర్చించిన పిదప అభ్యర్థులపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని ఉందంటున్నారు. దీంతో వరంగల్, మహబూబాబాద్‌ల నుంచి సిట్టింగ్‌లా? కొత్త వారా? అన్న సస్పెన్స్‌కు తెరపడనుంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement