
సాక్షి, బెంగళూరు : అది సోమవారం ఉదయం 7గంటల ప్రాంతం. గుజరాత్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభానికి ముందు సమయం. అప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆయన అనుచరులతో కాంగ్రెస్ పార్టీ గుజరాత్‌లో 80 సీట్ల వరకు సాధించుకుంటే మాత్రం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి కాంగ్రెస్ విజయం ఖాయం అన్నారు. ఆయన చెప్పినట్లుగానే దాదాపు 80 సీట్లకు దగ్గరగా 79 సీట్లను కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలతో గెలుచుకుంది. వెంటనే సిద్దరామయ్య ముఖం ఒక నవ్వుతో వెలిగిపోయింది.
వెంటనే పార్టీ ముఖ్యనేతలను, కార్యకర్తలను పిలిచి మరోసారి మనం కర్ణాటకలో గెలుస్తున్నాం అని చెప్పేశారు. సొంత రాష్ట్రం గుజరాత్‌లో మోదీ మ్యాజిక్ పెద్దగా అంతగా ప్రభావం చూపలేకపోయిందని, ఇక కర్ణాటకలో విజయం మళ్లీ కాంగ్రెస్‌దేనని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం మీడియా వద్దకు వచ్చిన ఆయన..
'మేం కోల్పోయాం. కానీ, రాహుల్ గాంధీ చాలా గొప్పగా పోరాడారు. దాదాపు ప్రధాని మోదీని ఆయన సొంత రాష్ట్రంలోనే ఓడించినంత పనిచేశారు. బీజేపీ ధనబలం, కండబలం, అధికారబలం మొత్తాన్ని గుజరాత్‌లో గెలిచేందుకు ఉపయోగించింది. ఈ ఫలితాల ఆధారంగా మా రాష్ట్రం (కర్ణాటక)లో ఏం జరగబోతుందో స్పష్టమవుతోంది. మేం మరోసారి గెలుస్తాం. గుజరాత్‌లో ఒకప్పుడు మాకు(కాంగ్రెస్) 44 సీట్లు ఉండేవి. ఇప్పుడు 80వరకు ఉన్నాయి. ఎక్కడ కర్ణాటక ఎన్నికలపై ఆ ప్రభావం పడుతుందో అని ఇప్పుడే మా రాష్ట్రంలోని బీజేపీ నేతలు అదొక పెద్ద విజయం అయినట్లు చెప్పుకుంటున్నారు. గుజరాత్ మాదిరిగా కర్ణాటక కాదు. ఇక్కడ బలమైన కాంగ్రెస్ నేతలు డజన్లలో ఉన్నారు' అని ఆయన చెప్పారు.