
సాక్షి, హైదరాబాద్ : సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ‘అప్రహిత రాజకీయ యాత్ర’ను చేయబోతున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సమస్యలను అధ్యయనం చేసి, అవగాహన పెంచుకోవడం కోసమే యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు అంజన్న దేవాలయం నుంచి ప్రారంభంకానునట్లు పేర్కొన్నారు. యాత్ర తేదీలు ఇంకా ఖరారుకాలేదని, త్వరలోనే వివరాలు చెబుతానన్నారు. ఈ మేరకు శనివారం పవన్ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా ప్రకటన చేశారు.
కొండగట్టే ఎందుకు? : 2009లో తన సోదరుడు, మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పవన్ కల్యాణ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ‘2009 ఎన్నికల ప్రచారంలో జరిగిన పెను ప్రమాదం నుంచి నేను బయటపడింది కొండగట్టులోనే. పైగా, ఆంజనేయుడు మా ఇంటి ఇలవేల్పు కూడా. అందుకే ఇక్కడి నుంచి యాత్రను ప్రారంభిస్తా’ అని పవన్ రాసుకొచ్చారు.
కేసీఆర్‌తో కలయిక తర్వాత.. : ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన పవన్.. ఆ పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కావడంతో కొన్నాళ్లు మిన్నకుండిపోవడం, 2014 ఎన్నికలకు ముందు సొంతగా జనసేన పార్టీని ఏర్పాటుచేసి బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతు ఇవ్వడం తెలిసిందే. కాగా, గడిచిన నాలుగేళ్లుగా తన కార్యకలాపాలను ఏపీకే పరిమితం చేసిన పవన్.. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావును కలుసుకుని, పాలనకు కితాబిచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో పవన్ తెలంగాణ నుంచే యాత్రను ప్రారంభించనుండటం ఆసక్తికర పరిణామంగా మారింది.
— Pawan Kalyan (@PawanKalyan) January 20, 2018
Comments
Please login to add a commentAdd a comment