విలేకరులతో మాట్లాడుతున్న డాక్టర్ దుట్టా, యార్లగడ్డ వెంకట్రావు
హనుమాన్‌జంక్షన్ రూరల్: రాజకీయంలో 40 ఏళ్ల అనుభవం ఉందని గొప్పలు చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 40 ఏళ్ల వయస్సు ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ప్రకటించిన హామీలను కాపీ కొట్టడం సిగ్గుచేటని వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు ఎద్దేవా చేశారు. హనుమాన్‌జంక్షన్‌లోని డాక్టర్ దుట్టా నివాసంలో ఆదివారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. డాక్టర్ దుట్టా మాట్లాడుతూ ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబుకు ఏనాడూ ప్రజా సంక్షేమం పట్టలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాయిలాలు ప్రకటిస్తున్నాడని దుయ్యబట్టారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ప్రకటించిన వృద్ధాప్య, వింతతు పింఛన్లు రూ. 2 వేలకు పెంపు, ఆటో, ట్రాక్టర్ల ట్యాక్స్ రద్దు, డ్వాక్రా మహిళలకు ఆర్థిక చేయూత వంటి పథకాలు ఎన్నికలకు ముందు చంద్రబాబు అమలుచేయడం టీడీపీ ఓటమి భయాన్ని బహిర్గతం చేస్తోందని చెప్పారు. వైఎస్ జగన్ వల్లే తమకు మంచి జరిగిందని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్న విషయం ముమ్మాటికి వాస్తవమన్నారు.
హోదాకోసం ఐదేళ్లుగా పోరాటం
ప్రత్యేకహోదా సాధనకు వైఎస్సార్ సీపీ చిత్తశుద్ధితో ఐదేళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తోందని చెప్పారు. రాష్ట్రానికి హోదా కోసం మంగళగిరిలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరాహారదీక్ష చేశారని, వైఎస్సార్ సీపీ ఎంపీలు తృణప్రాయంగా పదవులకు రాజీనామా చేసి ఢిల్లీలో దీక్షలు చేశారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదాపై ఆందోళనలు, ధర్నాలు, బంద్‌లు చేసినందుకు రాష్ట్రంలో లక్షలాది మందిపై కేసులు పెట్టిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని దుయ్యబట్టారు. ఆనాడు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోది ఇంటి ముందు ప్రత్యేకహోదా ఆందోళన చేపట్టాలని విపక్షాలకు ఉచిత సలహాలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఢిల్లీలో కాకుండా రాష్ట్రంలో ధర్మపోరాట దీక్షల పేరుతో దొంగ నాటకాలు ఆడుతున్నారన్నారు.
ప్రజాధనం దుర్వినియోగం
ధర్మపోరాట దీక్ష, పోలవరం, అమరావతి సందర్శనకు ప్రజలను ఆర్టీసీ బస్సుల్లో తెలుగుదేశం జెండాలు కట్టి తరలిస్తూ ప్రభుత్వ ధనాన్ని దుర్వి నియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మట్టి దోపిడీ కనిపించలేదా?
యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరంలో జరిగిన సభలో ఎమ్మెల్యే వంశీమోహన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశంసించటం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని స్థాయిలో అవినీతి, అక్రమాలు గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంశీమోహన్ హయాంలో జరిగాయని యార్లగడ్డ విమర్శించారు. బ్రహ్మయ్యలింగం చెరువులో మట్టి త్రవ్వకాలు, గ్రామగ్రామాన అక్రమ మట్టి దోపిడీ, అజ్జంపూడి, విమానాశ్రయ విస్తరణ భూసేకరణలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ చంద్రబాబుకు కనిపించలేదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాటను బట్టి చూస్తే ఈ అవినీతి భాగోతం ఆయన కనుసన్నల్లోనే జరిగిందనే అనుమానం కలుగుతోందని యార్లగడ్డ చెప్పారు. నియోజకవర్గంలోని నూరుశాతం సిమెంట్‌రోడ్లు వేశామని, కనీసం వాకింగ్‌కైనా మట్టిరోడ్లు లేవని సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బండారుగూడెం ప్రధాన రహదారి దుస్థితి చూస్తే ఎమ్మెల్యే పనితీరు ఏమిటో అర్ధమవుతుందని యార్లగడ్డ ఎద్దేవా చేశారు. స్వయంగా సీఎం చంద్రబాబే ఆటోలు, ట్రాక్టర్లపై తెలుగుదేశం జెండా కట్టుకోండి లేదా నా ఫొటో పెట్టి ధ్యాంక్యూ సీఎం సార్ అని రాయండి అని డ్రైవర్లును వేడుకోవడం సిగ్గుచేటన్నారు.
వాళ్లంతా డబ్బుకు అమ్ముడుపోయారు..
ఇటీవల వైఎస్సార్ సీపీకి రాజీనామా చేసిన వాళ్లంతా ఎమ్మెల్యే వంశీమోహన్ వద్ద డబ్బుకు అమ్ముడుపోయారని డాక్టర్ దుట్టా, యార్లగడ్డ ఆరోపించారు. పార్టీపై నిరాధారమైన నిందలు మోపడం సరికాదన్నారు. నాలుగేళ్లుగా తోట వెంకయ్య అనే వ్యక్తికి కాపులు గుర్తుకు రాలేదా అని దుట్టా ప్రశ్నించారు. గత ఎన్నికల్లో జిల్లాలో ఆరుగురు కాపు అభ్యర్థులకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిదేనన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగిరి ప్రసాద్, జిల్లా కార్యదర్శి నక్కా గాంధీ, జిల్లా అధికార ప్రతి నిధి వేగిరెడ్డి సూర్యనారాయణ, బాపులపాడు, ఉంగుటూరు మండలాల అధ్యక్షులు దుట్టా శివ నారాయణ, వింతా శంకర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ప్రమీలారాణి, రామకోటయ్య, కమలకుమారి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment