సాక్షి, న్యూఢిల్లీ : సొంత పార్టీపైనే తరచూ విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా మరోసారి మీడియా ముందుకు వచ్చారు. కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. బీజేపీని ఎట్టిపరిస్థితుల్లో వీడే ప్రసక్తే లేదని ఆయన కుండబద్ధలు కొట్టేశారు.
కాగా, ఈ మధ్యే ఆయన ‘రాష్ట్ర మంచ్’ అనే రాజకీయ వేదికను ప్రారంభించి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి ఆయన బయటకు వచ్చేస్తున్నారంటూ కథనాలు వెలువడ్డాయి. దీనిపై మీడియా ఆయన్ని ప్రశ్నించింది. ‘‘బీజేపీ సభ్యుడిగా కంటే.. ఒక పౌరుడిగానే నాకు బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి. రాష్ట్ర మంచ్ అనేది నిరుద్యోగులు, రైతుల హక్కుల కోసం పోరాటం చేసేందుకు ఏర్పాటు చేసిన ఓ వేదిక మాత్రమే. అంతేగానీ పార్టీల పేరుతో రాజకీయాలను వెలగబెట్టడానికి కాదు. నేను బీజేపీలోనే ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో నేను పార్టీని వీడను’’ అని ఆయన స్పష్టం చేశారు.
అయితే తన వ్యవహారం నచ్చక ఒకవేళ బీజేపీ అధిష్ఠానం వేటు వేస్తే సంతోషంగా అంగీకరిస్తానని ఆయన చెప్పారు. అంతేగానీ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ప్రశ్నించటం మాత్రం ఆపనని యశ్వంత్ సిన్హా స్పష్టం చేశారు. ‘ఐ నీడ్ టూ స్పీక్ అప్ నౌ’ పేరిట ఓ జాతీయ పత్రికలో బీజేపీ పాలనకు వ్యతిరేకంగా ఆయన రాసిన వ్యాసంతో మొదలైన దుమారం.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రైతులకు మద్ధతుగా ఆయన పోరాటానికి దిగటంతో తారాస్థాయికి చేరుకుంది. మరో సీనియర్ నేత, నటుడు శతృఘ్న సిన్హా.. యశ్వంత్‌కు బహిరంగంగానే మద్ధతు ప్రకటిస్తూ వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment