
పలమనేరు: రాష్ట్రాన్ని అభివృద్దిలో కాకుండా అవినీతిలో నంబర్ 1 చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో సోమవారం వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రోజా మాటాడారు. ఇక్కడ నారా లోకేశ్ దండుకున్న అవినీతి సొమ్మును దాచేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి అమరనాథరెడ్డి ఇటీవల కొరియాకు వెళ్లారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధిలో మన రాష్ట్రం స్థాయి దారుణంగా దిగజారిందన్నారు.
దేశంలోనే అత్యధిక హెచ్‌ఐవీ కేసుల్లో, మహిళల అక్రమ రవాణాల్లో, అప్పుల్లో రాష్ట్రాన్ని నంబర్ 1 చేశారని పత్రికలే చెబుతున్నాయని గుర్తుచేశారు. ఉంగరం, వాచీ కూడా లేదంటూనే దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు ఎలా ఎదిగారని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయించి మంత్రి అయిన అమరనాథరెడ్డి టీవీల్లో మీసాలు తిప్పడం కాదు సొంత జిల్లాలో ఓ పరిశ్రమనైనా నెలకొల్పారా? అని నిలదీశారు. ఈ ప్రభుత్వంలో అన్నివర్గాలకు బాధలు తప్పడం లేదని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉందన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... రాజకీయాల్లోకి రాకముందు మిద్దె లేని చంద్రబాబు ఇన్ని రూ.వేల కోట్లను ఎలా సంపాదించారని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ సీఎం అయితేనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా.సునీల్‌కుమార్, పార్టీ నేత జె.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment