బెంగళూరు: కర్ణాటకలో బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్పకు తీవ్ర నిరాశే ఎదురైంది. కుమారుడు విజయేంద్రతోపాటు, సన్నిహితురాలు శోభా కరాంద్లజే (యశ్వంత్‌పూర్ కోసం) లకు సోమవారం విడుదల చేసిన నాలుగో జాబితాలోనూ చోటు దక్కలేదు. మైసూరు జిల్లా వరుణ నియోజకవర్గం నుంచి తన కొడుకు విజయేంద్ర పోటీ చేయడంలేదని నంజనగుడులో ఏర్పాటుచేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో యడ్యూరప్ప చెప్పారు.
దీంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదికతోపాటు.. అక్కడున్న ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. అటు, రెండ్రోజుల క్రితం బీజేపీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి రేవణ్ణ సిద్దయ్య (లింగాయత్ వర్గం బలమైన నాయకుడు)కు వరుణ నుంచి బీ–ఫామ్ ఇచ్చే అవకాశముంది. రేవణ్ణకు ఆరెస్సెస్‌నుంచి బలమైన మద్దతుంది. వరుణ, యశ్వంత్‌పూర్ సహా మరో రెండు నియోజకవర్గాలకు మంగళవారం అభ్యర్థులను ప్రటించే అవకాశం ఉంది.
బళ్లారిలో రెడ్డి సోదరులపైనే ఆధారం
తూర్పు కర్ణాటక ప్రాంతంలో గాలి జనార్దనరెడ్డి సోదరులపైనే బీజేపీ నమ్మకం పెట్టుకుంది. అందుకే శ్రీరాములు, రెడ్డి సోదరుల కుటుంబసభ్యులు, అనుచరులకు ఏడు టికెట్లు ఇచ్చింది. గాలి మేనల్లుడు, రియల్టర్ లల్లేశ్ రెడ్డిని కన్నడ హోం మంత్రి ఆర్ రామలింగారెడ్డిపై (బీటీఎం లేఔట్ నుంచి) పోటీకి దించనుంది. ఈ ప్రాంతంలోని రెడ్డి ఓట్లను బీజేపీ వైపుకు తీసుకురావటంలో గాలి పాత్ర కీలకం కానుంది. బీజేపీ దీనిపైనే విశ్వాసం ఉంచింది.
Comments
Please login to add a commentAdd a comment