ఘజియాబాద్/హౌరా: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దేశ సైనిక బలగాలను ఆయన ప్రధాని మోదీ సైన్యంగా పేర్కొనడంపై విపక్షాలు మండిపడ్డాయి. రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. ఘజియాబాద్‌లో కేంద్ర మంత్రి వీకే సింగ్ తరఫున ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడారు. ‘కాంగ్రెస్ నేతలు ఉగ్రవాదులకు బిర్యానీ తినిపించారు. ఉగ్రనేత మసూద్ అజార్‌ను జీ(గారు) అంటూ ప్రోత్సహిస్తున్నారు. కానీ, మోదీ సైన్యం (దేశ సైనిక బలగాలు) వారికి బుల్లెట్లు, బాంబులతో బదులిచ్చింది. ఉగ్ర శిబిరాలపై దాడులు జరిపి ముష్కరులతోపాటు పాక్ వెన్ను విరిచింది. కాంగ్రెస్ అసాధ్యమనుకున్నదాన్ని బీజేపీ సాధ్యం చేసి చూపింది. మోదీ ఉంటే అసాధ్యమైంది ప్రతిదీ సాధ్యమే’ అని అన్నారు.
భద్రతా బలగాలకు అవమానం: మమతా
యోగి తన వ్యాఖ్యలతో భద్రతా బలగాలను అవమానించారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. ‘యూపీ సీఎం వ్యాఖ్యలపై షాక్‌కు గురయ్యా. మన సైన్యాన్ని ఏ ఒక్క వ్యక్తికో సొంత అన్నట్లుగా మాట్లాడటం తీవ్ర అవమానకరం. సైన్యం ఏ ఒక్కరిదో కాదు, ప్రజలందరి సొత్తు. యూపీ సీఎం వ్యాఖ్యలను ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలి’ అని పిలుపునిచ్చారు. ‘యోగి వ్యాఖ్యలు సైన్యాన్ని అవమానించినట్లే. భారత సైన్యం ప్రచార మంత్రి(ప్రధాని) సైన్యం కాదు. యోగి క్షమాపణ చెప్పి తీరాలి’ కాంగ్రెస్ నేత ప్రియాంక చతుర్వేది అన్నారు. ‘సైనిక బలగాలు ఏ ఒక్కరి ప్రైవేట్ సైన్యం కాదనే ప్రాథమిక అంశాన్ని రాజకీయ నేతలు తెల్సుకోవాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకే సైన్యం పనిచేస్తుంది తప్ప, ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కాదు’ అని మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ శంకర్ రాయ్ చౌదరి అన్నారు.
యోగిపై ఈసీ చర్య తీసుకోవాలి: సీపీఐ
భద్రతా బలగాలను మోదీ సైన్యం అంటూ యూపీ సీఎం చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఓటర్లను ప్రభావితం చేసేందుకే యోగి అలా మాట్లాడారంది. ‘ప్రజల్లో అభద్రతాభావం పెంచి, వారిని ప్రభావితం చేసేందుకే యోగి అలా మాట్లాడారు. రైతుల సమస్యలను మర్చిపోయిన బీజేపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో సాధించింది ఏమీ లేదు. అందుకే రాజకీయ ప్రయోజనం పొందేందుకు సైన్యాన్ని వాడుకోవాలని చూస్తోంది’ అని సీపీఐ నేత డి.రాజా పేర్కొన్నారు.
నివేదిక కోరిన ఈసీ
ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని ఘజియాబాద్ జిల్లా మేజిస్ట్రేట్‌ను ఈసీ ఆదేశించింది. ఈ నివేదికను యూపీ చీఫ్ ఎలక్టోరల్ అధికారికి సమర్పించాలని కోరింది. రాజకీయ నేతలు ఎన్నికల ప్రచారం సమయంలో సైన్యం ప్రస్తావన తేవడం, భద్రతా బలగాల ఫొటోలను వాడుకోవడం నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని ఈసీ మార్చి 17వ తేదీన స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
భారత సైన్యం ‘మోదీ సేన’..!
Published Tue, Apr 2 2019 3:45 AM | Last Updated on Tue, Apr 2 2019 3:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment