
అఖిలేష్ యాదవ్
లక్నో: బీజేపీ నాయకులు జాతీయ పౌర రిజిస్టర్ (ఎన్నార్సీ) ని రాజకీయంగా ప్రతిపక్షాలను భయపెట్టేందుకు వాడుతున్నారని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. ఒకవేళ ఎన్నార్సీ ఉత్తర్‌ప్రదేశ్‌లో అమలైతే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాష్ట్రాన్ని వీడాల్సి వస్తుందన్నారు. శుక్రవారం అఖిలేష్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో పాలకులు విభజించి పాలించేవారని, ఇప్పుడు భయపెట్టి పాలిస్తున్నారని మండిపడ్డారు.
విభజన శక్తులను దేశం నుంచి తరిమికొట్టామని, ఇప్పుడు ప్రజలను చైతన్యపరుస్తూ బీజేపీని గద్దె దించుతామని పేర్కొన్నారు. జమ్మూ–కశ్మీర్ పరిస్థితుల గురించి మాట్లాడుతూ అక్కడ ప్రజలు జబ్బు పడుతున్నారా, చికిత్స పొందుతున్నారా, పిల్లలు పాఠశాలలకు వెళుతున్నారా అనేవి ప్రశ్నలుగానే మిగిలాయన్నారు. అక్కడి పరిస్థితులు సాధారణంగానే ఉన్నాయని కేంద్రం చెబుతున్నప్పుడు ఇంకా అక్కడ ఆంక్షలు ఎందుకని ప్రశ్నించారు. పాకిస్తాన్ పేరుతో ఓట్లు దండుకుందామని బీజేపీ చూస్తోందన్నారు.