పోలీసులతో మాట్లాడుతున్న ఎంపీ
చింతకొమ్మదిన్నె : రౌడీలకు మంత్రి పదవులు ఇచ్చి ఊర్ల మీదకు ఉసికొల్పుతున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఆదివారం రాత్రి చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ ఆవరణంలో ఎంపీ విలేకరులతో మాట్లాడారు. పెద్ద దండ్లూరు గ్రామంలో సోదరుడు సంపత్ ఇటీవల వివాహం చేసుకున్నారని అతను తమ ఇంటికి తేనీటి విందుకు రావాలని ఆహ్వానించారన్నారు. ఢిల్లీలో ఉన్నప్పుడు వివాహానికి హాజరు కాలేకపోయానని ఇప్పుడు సంపత్ ఆహ్వానం మేరకు గ్రామానికి వెళుతుంటే పోలీసులు గ్రామంలోకి రాకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. తాము, మేయర్ సురేష్‌బాబు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రెడ్డి వెళుతుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అంటూ పోలీసులు నిలువరించారన్నారు. అప్పటికే మంత్రి ఆదినారాయణరెడ్డి అనుచరులు గ్రామంలోకి ప్రవేశించి సోదరుడు సంపత్, అతని కుటుంబీకుల ఇళ్లపై దాడులు చేసి ఇళ్లలోని వస్తువులను ధ్వంసం చేశారని చెబుతుంటే ఎంతో బాధకలిగించిందన్నారు.
రౌడీలకు మంత్రి పదవులు ఇస్తే ఇలాగే ఉంటుందని అన్నారు. నియోజకవర్గంలో వ్యతిరేకత రావడంతో గ్రామాల్లో చిచ్చు పెట్టి వర్గాలను ఏర్పరచుకుని పబ్బం గడుపుకోవాలని మంత్రి చూస్తున్నారన్నారు. ఈ ఆటలు సాగనివ్వమని అన్నారు. గ్రామ స్థాయి నాయకునిగా ఉన్న ఆదినారాయణ రెడ్డిని వైఎస్ రాజారెడ్డి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వైఎస్ వివేకానంద రెడ్డి రాజకీయ భిక్ష పెట్టి ఎమ్మేల్యేను చేస్తే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి టీటీపీ పంచన చేరి మంత్రి పదవి పొంది రాజకీయ వ్యభిచారానికి పాల్పడ్డారన్నారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలోకి వెళ్లకుండా అడ్డుకోవడం దారుణం అన్నారు. మా కార్యకర్త ఇంటికి తప్పకుండా మేం వెళ్లి తీరతాం అన్నారు. ఒకవేల అడ్డుకుంటే సీఎం పర్యటనను భారీ జనంతో అడ్డుకుంటామని హెచ్చరించారు. సీకె దిన్నె పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఎంపీ, మేయర్, సమన్వయకర్తలను కమలాపురం ఎమ్మెల్యే పి. రవింధ్రనాధరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, కమలాపురం సమన్వయకర్త దుగ్గాయపల్లి మల్లిఖార్జునరెడ్డిలు జరిగిన సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment