24న రాష్ట్ర బంద్‌ | YS Jagan calls for AP bandh on July 24th | Sakshi
Sakshi News home page

24న ఏపీ బంద్‌

Published Sun, Jul 22 2018 2:50 AM | Last Updated on Sun, Jul 22 2018 7:01 AM

YS Jagan calls for AP bandh on July 24th - Sakshi

శనివారం మీడియాతో మాట్లాడుతున్న వైఎస్‌ జగన్‌

తిరుపతిలో ఎన్నికల సభలో ఐదు కాదు, పది సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానన్న మాటలు మోదీకి గుర్తుకు రాలేదు. బీజేపీ ఎన్నికల ప్రణాళికలో (బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ప్రతిని చూపుతూ) వారిచ్చిన హామీలు ప్రధానమంత్రికి గుర్తుకు రాలేదు. ఇవేవీ ప్రధానికి గుర్తుకు రాకపోగా, ఆయన చెప్పిన మాటల్లో ఇంకా బాధ కలిగించిన అంశం ఏమిటంటే.. చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత చంద్రబాబు ఆమోదంతోనే హోదాకు బదులుగా ప్యాకేజీని ఇచ్చామని చెప్పడం.  

రాహుల్‌ గాంధీ అర నిమిషం కూడా ఏపీ గురించి మాట్లాడలేదు. తన మాటల్లో ఎక్కడా కూడా.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన ధర్మముంది.. మేం ఇస్తామని చెప్పాము.. మీరెందుకు ఇవ్వలేదు.. అన్న మాట ఆయన నోటి నుంచి రాలేదు. నిజంగా వీరి ప్రసంగాలు ఇంత బాధ కలిగించేవిగా ఉంటే.. మరో వైపు చంద్రబాబు ప్రవర్తించిన తీరు ఇంకా బాధ కలిగిస్తుంది. 

ప్రత్యేక హోదాకు బదులు ప్యాకేజీ చాలు అని చెప్పడానికి చంద్రబాబు ఎవరండీ? అసలు చంద్రబాబుకు ఆ హక్కు ఎవరిచ్చారు? ఐదు కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశం ఇది. ఇవాళ చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు దొరక్క, చదువు పూర్తయిన తర్వాత ఎక్కడికి పోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేక వలస బాట పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీకి ప్రత్యేక హోదా వస్తేనే మేలు జరుగుతుందని.. పరిశ్రమలు, హోటళ్లు, హాస్పిటళ్లు పెట్టడానికి ఎవరైనా ముందుకు వస్తారని, ఆదాయపు పన్ను, జీఎస్టీ కట్టాల్సిన పనిలేదన్నపుడే మన రాష్ట్రంలోకి వీళ్లంతా వచ్చి పెట్టుబడులు పెడతారని, అలా పెట్టుబడులు వస్తేనే ఉద్యోగాలు వస్తాయనీ బాబుకు తెలుసు. ఈ విషయం తెలిసి కూడా చంద్రబాబు ప్రత్యేక హోదాపై ఎందుకు రాజీపడ్డారు? అసలు అలా రాజీ పడటానికి ఆయన ఎవరు? కేంద్రం చేసిన ప్యాకేజీ ప్రతిపాదనతో హోదాను పక్కన బెట్టి రాష్ట్ర ప్రజల హక్కును తాకట్టు పెట్టే అధికారం ఎవరిచ్చారు? ఇప్పుడు అవిశ్వాసం జరిగిన తీరు చూశాం. అవిశ్వాసం వీగిపోయింది. ఇప్పుడు మీ ఎంపీలు మొత్తం రాజీనామాలు చేయండి. మా ఐదు మంది ఎంపీలు ఇప్పటికే రాజీనామాలు చేశారు. వారిని కూడా పంపిస్తాను. 25కు 25 మంది మరొక్కసారి నిరాహార దీక్షకు కూర్చుందాం. కేంద్రం దిగిరాదేమో చూద్దాం. దేశం మొత్తం మనవైపు చూస్తుందో లేదో చూద్దాం. యుద్ధం అంటే ఇది. యుద్ధం అంటే ఇలా చేయాలని చెప్పి సామాన్యుడు మనవైపు చూస్తాడు. ఇలా చేయండని అడుగుతాడు. ఇలా చేస్తేనే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందన్న సంగతి నా దగ్గరి నుంచి సామాన్యుడి వరకు తెలిసిన విషయమే. కానీ చంద్రబాబు మాత్రం ఇది చేయడు. ఇది చేసేట్టుగా, చంద్రబాబుపై ఒత్తిడి వచ్చేట్టుగా, బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మంగళవారం నాడు బంద్‌కు పిలుపునిస్తున్నాం. 

నిన్న చంద్రబాబు తరఫున ఆయన ఎంపీ గల్లా జయదేవ్‌ మాట్లాడిన మాటలన్నీ గత నాలుగేళ్లుగా మేం చెబుతూ వస్తున్న మాటలు కాదా? అసెంబ్లీలో చూసుకోండి.. ఆ రికార్డులను తిరగేయండి. యువభేరీల్లో మేం మాట్లాడిన మాటలు వినండి. ఢిల్లీ పెద్దలను కలిసి మేమిచ్చిన విజ్ఞాపనలు చూడండి. మేం చేసిన ప్రసంగాలను వినండి. ఢిల్లీ నుంచి గల్లీ దాకా మేం చేసిన పోరాటాలు చూడండి. ఢిల్లీ ధర్నాల్లో మేం మాట్లాడిన మాటలు, నిరాహార దీక్షలు చేసినపుడు మేం (వైఎస్సార్‌ కాంగ్రెస్‌) మాట్లాడిన మాటలు.., ఏ విషయమైనా తీసుకోండి. గత నాలుగున్నర సంవత్సరాలుగా మేం చెబుతున్న మాటలు చూసుకోండి. మేం చెప్పిన అంశాలనే జయదేవ్‌ పార్లమెంటులో మాట్లాడారు.  

ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి.. 
25కు 25 మంది ఎంపీలను ఒక్క తాటిపై నిలబెడదాం. మీరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గట్టిగా నిలబడండి. కేంద్రంలో ఎవరైతే ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు సంతకం పెడతారో వారికి మద్దతు తెలుపుదాం. ఎల్లయ్యా.. పుల్లయ్యా.. ఎవరన్నది మనకు సంబంధంలేదు. మన చేతిలో ఎంపీలను పెట్టుకుందాం. మద్దతివ్వడానికి ఇష్టపడని పరిస్థితుల్లో అవసరమైతే మొత్తం 25కి 25 మంది ఎంపీలు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చునే పరిస్థితికైనా సిద్ధపడదాం. ఆ వెసులుబాటు మన చేతుల్లో పెట్టుకుందాం. దాన్ని పోరాటమంటారు. ఆంధ్ర రాష్ట్రల ప్రజలకు నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. వీళ్లందరి మోసాలు చూసి చూసి నిజంగా రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం పోయే పరిస్థితి చూస్తున్నాం. ఈ పరిస్థితిని అధిగమించమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.  

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన విషయంలో యూటర్న్‌ తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు జ్ఞానోదయం కలగాలని, ఆయనలో నిజాయతీ రావాలని, వారి ఎంపీలతో ఆయన రాజీనామాలు చేయించేలా ఒత్తిడి తెచ్చేందుకు, కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 24న (మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ పాటించాలని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. హోదా విషయంలో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై బంద్‌కు పిలుపునివ్వాలని తమ పార్టీ నిర్ణయించిందని చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న జగన్‌ శనివారం ఉదయం తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని జేఎన్‌టీయూ సెంటర్‌ వద్ద తన శిబిరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఈ బంద్‌కు సహకరించాలని ప్రతి పార్టీకి, ప్రతి సంఘానికి విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తమ షాపులను స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌ రోజున సహకరించాలని కోరారు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంపై శుక్రవారం పెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన నేపథ్యంలో ప్రత్యేక హోదాపై చంద్రబాబు చేస్తున్న మోసాలను ఆయన ఎండగట్టారు. కాంగ్రెస్‌ పార్టీ విభజన సమయంలో చట్టంలో కచ్చితమైన పదాలను చేర్చకుండా దారుణంగా మోసం చేస్తే, ఇప్పుడు బీజేపీ మోసం చేస్తోందని మండిపడ్డారు. చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరును, హోదా విషయంలో ఆయన వైఖరిని జగన్‌ తీవ్రంగా దుయ్యబట్టారు. అవిశ్వాసం సందర్భంగా ఏ రాజకీయ పార్టీ కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అడగకుండా వారి వారి ఎజెండాల ప్రస్తావనకు వాడుకున్నారని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల అనంతరం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎవరు గట్టిగా చెబితే వారికే కేంద్రంలో తమ మద్దతు ఉంటుందని ఆయన స్పష్టీకరించారు. పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ సమావేశంలో జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..  

తానన్న మాటలే మోదీకి గుర్తుకు రాలేదు 
‘‘అవిశ్వాసం సందర్భంగా లోక్‌సభలో చోటు చేసుకున్న సన్నివేశాలు మనమంతా చూశాం. నేను ప్రత్యక్షంగా చూడలేకపోయినా అక్కడ జరిగిన అన్ని విషయాలూ తెలుసుకున్నాను. నిన్న (శుక్రవారం) పార్లమెంట్‌లో జరిగిన చర్చ సందర్భంగా మన రాష్ట్రం మీద పెద్దలకున్న ప్రేమ చూసినప్పుడు చాలా బాధనిపించింది. కారణమేమిటంటే.. ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గరి నుంచి మొదలు పెడితే బీజేపీ నుంచి కాంగ్రెస్‌ దాకా.. మిగిలిన ఏ ఇతర పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కావాలనే అంశానికి మద్దతిస్తూ మాట్లాడలేదు. ఏ ఒక్కరి నోట్లో నుంచి కూడా ఆ మాటలు రాలేదు. నిజంగా ఇది బాధాకరం. పార్లమెంట్‌ సాక్షిగా.. ప్రీకండిషన్‌గా (ముందస్తు షరతుగా) రాష్ట్రాన్ని విడగొట్టినందున ఏపీ నష్టపోయింది కనుక విభజన చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని ఆ రోజున అధికార, ప్రతిపక్షాలన్నీ చంద్రబాబుతో సహా చెప్పాయి. ఈ నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన హామీలను నాలుగేళ్లకుపైగా గడిచిపోయినప్పటికీ నెరవేర్చకపోగా, నిన్న అవిశ్వాసం మీద చర్చ జరిగినప్పుడు ఎవరూ మాట్లాడలేదు. నరేంద్ర మోదీ గారు మాట్లాడిన అంశాలను తొలుత పరిశీలిస్తే.. ప్రత్యేక హోడదాను ఇస్తానని, హోదా ఇవ్వాల్సిన బాధ్యత మాది అనే మాట మాత్రం ఆయన నోట్లో నుంచి రాలేదు.  

ఆ రోజు మమ్మల్ని వెక్కిరించారు.. 
ఆ రోజుల్లో టీడీపీ వారు మమ్మల్ని వెక్కిరించారు. ఎంతటి దారుణంగా వెక్కిరించారంటే.. ప్రత్యేక హోదా అనేది వేస్ట్‌ (వృథా) అన్నారు. కోడలు మగపిల్లాడిని కంటానంటే అత్త వద్దంటుందా? అన్నారు. ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా? అని వెటకారం చేశారు. అసెంబ్లీలో వీరు (టీడీపీ) మాట్లాడిన మాటలు చూసి నిజంగా విస్తుపోయే పరిస్థితి. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబునాయుడు అధికారికంగా ‘ప్రజా ప్రతినిధులకు ఓ అవగాహన’ అంటూ అచ్చు వేసిన పుస్తకాన్ని (చేతిలో పుస్తకాన్ని చూపుతూ) అక్కడ పంపిణీ చేశారు. అంతటితో ఆగకుండా 2017 మహానాడులో ఒక తీర్మానం కూడా చేశారు. హోదా ఉన్న రాష్ట్రాలకు హోదా లేని రాష్ట్రాలకూ ఉన్న తేడా ఏముంది? హోదా ఉన్న, హోదా లేని రాష్ట్రాలకు తేడా లేదు అని ఆ తీర్మానంలో పేర్కొన్నారు.

ప్రత్యేక హోదాకు రాయితీలకు సంబంధం లేదు. హోదా ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి నామమాత్రమే.. ఉనికి కోసం ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయి., అని మహానాడు తీర్మానంలో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో ఇంకా.. 14వ ఆర్థిక సంఘంచేసిన సిఫార్సులు ఏంటో కూడా తెలిపారు. ఇంత లావు బుక్కు ఇచ్చారు. ఇందులో ఆయన చెప్పిన ప్రతి అంశం, మహానాడులో ఆయన చేసిన తీర్మానాలు ఉన్నాయి. వాస్తవానికి 2014 మార్చి 2వ తేదీన కేంద్ర మంత్రివర్గం అప్పట్లో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి ప్రణాళికా సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయింది 2014 జూన్‌లో. ఈయన ముఖ్యమంత్రి అయ్యాక కూడా ప్రణాళికా సంఘం 2014 డిసెంబర్‌ 31 వరకు మనుగడలో ఉంది. మరి ఏడు నెలల పాటు చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఎందుకు పట్టించుకోలేదు? 

ఆ రోజు మనమే ఎక్కువ సాధించామన్నారుగా.. 
ఏ కేబినెట్‌తో, ఏ ప్రధానితో పని లేదు. అప్పటికే అది ఇవ్వాలని ధృవీకరణ జరిగిపోయింది. ఆదేశాలు అమలు చేయండని ప్రణాళికా సంఘానికి ఉత్తర్వులు కూడా వెళ్లాయి. కేవలం ఇక ప్రణాళికా సంఘంతో పని చేయించుకోవడమే తరువాయి. మరి చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదు. ఇలా పట్టించుకోకపోవడం అన్యాయమని చంద్రబాబుకు అనిపించలేదా? ఇదే పెద్దమనిషి చంద్రబాబు 2016 సెప్టెంబర్‌ 7న అరుణ్‌ జైట్లీ ప్యాకేజీ అని చెప్పి మన చెవుల్లో క్యాలీఫ్లవర్‌ పెట్టే కార్యక్రమం చేసినప్పుడు ఆయన పక్కన ఆయన గారి కేంద్ర మంత్రులు లేరా? జైట్లీ గారి ప్రకటన గురించి చంద్రబాబుతో చర్చించి, ఆయన ఆమోదంతోనే వారు ఈ ప్రకటనను విడుదల చేస్తున్నట్లుగా చెప్పారు.

వాళ్లు చెప్పడం, ఆ రోజు అర్ధరాత్రే జైట్లీ గారికి చంద్రబాబు కృతజ్ఞతలు తెలపడం.. ఆ తర్వాత అదే చంద్రబాబు మరుసటి రోజో, ఆ తర్వాతి రోజో అసెంబ్లీలో తీర్మానం చేసి జైట్లీకి కృతజ్ఞతలు తెలపడం జరిగిపోయింది. చంద్రబాబూ ఇది ధర్మమేనా? (శాసనసభలో చేసిన తీర్మానాన్ని చూపుతూ) ఇది చాలదన్నట్లుగా నాలుగు నెలల తర్వాత 2017 జనవరి 26న చంద్రబాబు ఏకంగా ప్రెస్‌మీట్‌ పెట్టి బీజేపీ ప్రభుత్వాన్ని విపరీతంగా పొగిడారు. ఇది ఈనాడు పత్రిక (చూపిస్తూ..)లోనే వచ్చింది. వేరే పత్రిక చూపితే మళ్లీ అదేదో తప్పన్నట్లుగా చిత్రీకరిస్తారు కాబట్టి ఆయనకు నచ్చిన పత్రికనే చూపిస్తున్నా. 2017 జనవరి 27న నాలుగు నెలల తర్వాత మనమే ఎక్కువగా సాధించాం. ఏ రాష్ట్రానికైనా ఇంతకంటే ఎక్కువగా వచ్చాయా? ఆధారాలుంటే రండి.. చెప్పండి.. ప్రతిపక్షాలకు సవాల్‌.. అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇలా చెప్పడం ధర్మమేనా ముఖ్యమంత్రి గారూ?   

ఓవైపు బీజేపీతో యుద్ధం.. మరో వైపు..  
ఓ వైపు బీజేపీతో యుద్ధం అంటారు. మరో వైపున ఈ పెద్దమనిషి నిజంగా యుద్ధం చేస్తున్నాడా అని సామాన్యుడికి కూడా సందేహాలు వచ్చే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నారు. స్వప్న మున్‌గంటి వార్‌.. ఈమె మహారాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి భార్య. ఈమెను టీటీడీ బోర్డు సభ్యురాలిగా నియమించాడు. బీజేపీతో యుద్ధం అంటూనే బీజేపీ ఆర్థిక మంత్రి భార్యను ఈ పదవిలో నియమిస్తాడు. ఇక ఎన్టీఆర్‌ బయోపిక్‌ అని బాలకృష్ణ సినిమా తీస్తాడు. పక్కన కుర్చీలో షూటింగ్‌ సెట్లో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కనిపిస్తారు. బీజేపీతో యుద్ధం అంటూ ఇలాంటివి చేస్తాడు. పరకాల ప్రభాకర్‌ నిన్నటి దాకా చంద్రబాబు గారి కొలువులో ఉన్నారు. అక్కడేమో (కేంద్రంలో) ఆయన భార్య నిర్మలా సీతారామన్‌ గారు మంత్రిగా ఉన్నారు.  

బాబూ మీ ఎంపీలతో రాజీనామా చేయించండి 
చంద్రబాబు గారి ఎంపీల మీద ఒత్తిడి రావాలి, చంద్రబాబు గారి మీద ఒత్తిడి రావాలి. తన ఎంపీలతో రాజీనామా చేయించాలి. మొత్తం 25కి 25 మంది ఎంపీలు రాజీనామా చేసి ప్రత్యేక హోదా కోసం ఒక తాటిపైకి వచ్చి నిరాహార దీక్షకు కూర్చోవాలి. ఇది జరిగితేనే ప్రత్యేక హోదా వస్తుంది. ఈ దిశగా చంద్రబాబు మీద ఒత్తిడి రావాలి. ఈ బంద్‌ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తమ మీద నిరసన తెలుపుతున్నారని కేంద్ర ప్రభుత్వానికి అర్థం కావాలి. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రత్యేక హోదా అన్న డిమాండ్‌ ఎంత బలంగా ఉన్నదనేది మిగిలిన పార్టీలకు అర్థం కావాలి. చంద్రబాబు ఢిల్లీకి పోతాడట.. మిగిలిన పార్టీలకు కృతజ్ఞతలు తెలుపుతాడట.

నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాడని. ఏ ఒక్కరైనా కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలి అని మాట్లాడారా? ఎవరెవరు వాళ్ల వాళ్ల ఎజెండాలకు  అవిశ్వాసాన్ని వాడుకున్నారు. ఫ్రాన్స్‌కు సంబంధించిన విమానాల కొనుగోలు స్కాముల గురించి అవిశ్వాసంలో ప్రస్తావన. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా రాక, ఉద్యోగాలు దొరక్క అవస్థలు పడుతున్నారన్న బాధ ఎక్కడా కనిపించలేదు. చంద్రబాబూ.. మీ ఎంపీలతో రాజీనామా చేయించండి.. రాజీనామా చేసిన మా ఎంపీలు కూడా మీకు సహకరిస్తారు. మొత్తం 25 మందిని నిరాహార దీక్షకు కూర్చోబెడదాం. అప్పుడు నేషనల్‌ మీడియా మీ దగ్గరకు వస్తుంది.  నువ్వు ఎక్కడికీ పోవాల్సిన పనిలేదు. ఎవరికీ కృతజ్ఞతలు తెలపాల్సిన పనిలేదు’’ అని జగన్‌ అన్నారు. 

వారిది ఫెవికాల్‌ బంధమట! 
ఇవి చాలదన్నట్లు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ చంద్రబాబు మాకు మంచి మిత్రులన్నారు. ఈ బంధం ఎన్నటికీ విడిపోదన్నారు. ‘ఏ ఫెవికాల్‌గా జోడ్‌ హై.. టూటేగా నహీ’ (ఇది ఫెవికాల్‌ బంధం ఎప్పటికీ తెగిపోదు) అని అన్నారు. ఓ వైపు యుద్ధం అంటారు. మరో వైపు ఆయన చేసే ప్రతి చర్య యుద్ధం కాదని, లోపాయికారీగా వేరేవి జరుగుతున్నాయని స్పష్టమవుతోంది. ఆయన ప్రతి చర్య ఆ దిశగానే ఉంటోంది. ‘నాలుగేళ్ల వరకూ బీజేపీతో సంసారం చేశాడు. సంసారం చేసినప్పుడు ప్రత్యేక హోదాకు దగ్గరుండి తూట్లు పొడిచాడు. ఎన్నికలకు ఆరు నెలల ముందు, విడాకులు తీసుకుని ప్రత్యేక హోదా కోసం తానే పోరాటం చేస్తున్నట్లుగా బిల్డప్‌ ఇస్తున్నాడు. ఆ బిల్డప్‌ ఇస్తున్నప్పుడైనా కనీసం నిజాయతీగా అయినా చేస్తున్నాడా అంటే అదీ లేదు.

ఇవాళ ఒక్కటే అడుగుతున్నా ఈ పెద్దమనిషిని. అయ్యా.. చంద్రబాబు గారూ.. నిన్న పార్లమెంట్‌లో మీ ఎంపీ గల్లా జయదేవ్‌గారు చూపించిన ప్రతి పేపరు, అభిజిత్‌సింగ్‌ గారి లెటర్‌.. ఇవన్నీ మేము ఎన్నోసార్లు చూపించాం. ప్రత్యేక హోదా అంశం మీద ఫైనాన్స్‌ కమిషన్‌కు సంబంధం లేదని చెప్పిన లేఖ.. అభిజిత్‌ సింగ్‌ గారి పేరు చెప్పాం.. వైవీరెడ్డి గారి పేరు చెప్పాం.. గోపాలరావుగారి పేరు చెప్పాం.. జీఎస్టీలో ఆర్టికల్‌ 379ఏ 4 జీ ప్రకారం ‘స్పెషల్‌ ప్రొవిజన్‌ ఫర్‌ స్పెషల్‌ స్టేటస్‌ స్టేట్స్‌’ అని ఎన్నోసార్లు చూపించాం.  2014 మార్చి 2న అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాను ఏపీకి ఇస్తూ ప్లానింగ్‌ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేసిన కేబినేట్‌ తీర్మానం ఎన్నో సందర్భాల్లో చంద్రబాబుకు చూపించాం. వైవీ సుబ్బారెడ్డిగారు.. 2015 జూలై 31న కేంద్ర ప్రభుత్వానికి లోక్‌సభలో వేసిన అన్‌ స్టార్డ్‌ ప్రశ్నపై ‘దేర్‌ ఈజ్‌ నో ప్రపోజల్‌ టు విత్‌డ్రా టు ది స్పెషల్‌ క్యాటగిరీ స్టేటస్‌ టు ది నార్త్‌ ఈస్ట్రన్‌ స్టేట్స్‌’ అని ఇచ్చిన సమాధానం చూపాం. ప్రత్యేక హోదా కొనసాగుతుందని వైవీ సుబ్బారెడ్డి అడిగిన అన్‌ స్టార్డ్‌ ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానం చూపించాం. ఇవన్నీ నాలుగేళ్లుగా మేం చూపిస్తూ వచ్చినపుడు మీరెవ్వరూ (టీడీపీ) కూడా దాని గురించి పట్టించుకోలేదు.

నాలుగేళ్లుగా ఇవన్నీ చెబుతున్నాం..
యువభేరి సభల్లో ప్రతి అంశంపైన ఈ రకంగా కరపత్రాలు వేసి పంచాం. పార్టీ వెబ్‌సైట్లలో పెట్టి గత నాలుగు సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నాం. నిన్న మీరు పార్లమెంట్‌లో చెప్పిన ప్రతి అంశం, పేపరు ఈ పాంప్లెట్‌లో (కరపత్రం చూపుతూ) కనిపిస్తాయి. వెబ్‌సైట్‌ లింక్స్‌తో సహా కనిపిస్తాయి. ప్రత్యేక హోదా కోసం మేము ఎన్నెన్ని పోరాటాలు చేశామనేది ఈ కరపత్రంలో  మొదటి నుంచి చివరి వరకు తేదీలతో సహా ఉంది. ఇవన్నీ చేసినప్పుడు పట్టించుకోలేదు. నాలుగు సంవత్సరాలుగా మోసాలు చేశారు. మళ్లీ నిన్న కూడా ఆ మోసాలకు కొనసాగింపుగా మళ్లీ డ్రామాలాడుతున్నారు.

మేము చంద్రబాబును అడిగేది సూటిగా ఒక్కటే.. అవిశ్వాసం పెట్టారు. మేము అవిశ్వాసం పెట్టినప్పుడు మీకు బీజేపీతో ఉన్న పరిచయాల దృష్ట్యా చర్చకు రాకుండా చేయగలిగారు. పోనీలే దాని తర్వాత మీరు అవిశ్వాసం పెట్టగానే వారు వెంటనే ఆమోదించడం, మొట్టమొదటి స్పీకర్‌గా మీకే అవకాశం ఇవ్వడం, మీకు 13 నిమిషాలు సమయం కేటాయించడం, దాన్ని మీరు గంటసేపు మాట్లాడినా కొనసాగించడం.. అన్నీ మంచివే.  

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తోంది.. 
టీడీపీ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ట్రాక్‌లో పడిపోయిందంటే (నవ్వుతూ) నాలుగున్నర సంవత్సరాలుగా (డాక్యుమెంట్లు చూపిస్తూ) అభిజిత్‌ సింగ్‌ గారు రాసిన లేఖ, వైవీ సుబ్బారెడ్డి గారికి ఇచ్చిన సమా«ధానం, జీఎస్టీలో స్పెషల్‌ ప్రొవిజన్స్‌.. చూపిస్తూ.. చూపిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసింది. చంద్రబాబు గారికి ఇప్పుడు ప్రజల వద్ద నుంచి తీవ్రమైన ఒత్తిడి వచ్చే సరికి, ఎన్నికలు దగ్గర పడడంతో టీడీపీ కూడా ట్రాక్‌ మార్చింది అని ప్రధాని అన్నారు. దానినే వైఎస్సార్‌సీపీ ట్రాప్‌లో పడింది అన్నారు. ట్రాప్‌ కాదు.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తశుద్ధితో పని చేస్తోందని చెబుతున్నా.

నిజాయతీగా మాకు రావాల్సిన డిమాండ్‌ను అడుగుతున్నాం. నిజాయతీగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏదైతే అడుగుతోందో ఆ డిమాండ్‌ను చంద్రబాబు గారు తప్పని సరి పరిస్థితిలో తాను కూడా మోయక తప్పలేదు. అది వాళ్లకు ఒక ట్రాప్‌ మాదిరిగా కనిపిస్తోంది. అదే ప్రస్తావన వాళ్లు చేశారు. చంద్రబాబు గారి కుమ్మక్కు రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయంటే.. రాజ్‌నాథ్‌ గారి ప్రసంగంలోనే మనందరికి తేటతెల్లమైపోయింది. పార్టీ ఫిరాయించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ (బుట్టా రేణుక) చేత మాట్లాడించడం ఏమిటి?  డిస్‌క్వాలిఫికేషన్‌ లా ను అవహేళన చేశారు.

ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి..
25కు 25 మంది ఎంపీలను ఒక్క తాటిపై నిలబెడదాం. మీరు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున గట్టిగా నిలబడండి. కేంద్రంలో ఎవరైతే ఆ రోజు ప్రత్యేక హోదా ఇస్తున్నట్లు సంతకం పెడతారో వారికి మద్దతు తెలుపుదాం. ఎల్లయ్యా..పుల్లయ్యా.. ఎవరన్నది మనకు సంబంధంలేదు. మన చేతిలో ఎంపీలను పెట్టుకుందాం. మద్దతివ్వడానికి ఇష్టపడని పరిస్థితుల్లో అవసరమైతే మొత్తం 25కి 25 మంది ఎంపీలు ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా రాజీనామాలు చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చునే పరిస్థితికైనా సిద్ధపడదాం. ఆ వెసులుబాటు మన చేతుల్లో పెట్టుకుందాం. దాన్ని పోరాటమంటారు. ఆంధ్ర రాష్ట్రల ప్రజలకు నేను ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. వీళ్లందరి మోసాలు చూసి చూసి నిజంగా రాజకీయ వ్యవస్థ మీద నమ్మకం పోయే పరిస్థితి చూస్తున్నాం. ఈ పరిస్థితిని అధిగమించమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.  

చంద్రబాబూ.. ఇది ధర్మమేనా? 
హోదా వద్దు.. ప్యాకేజీ కావాలని మీరు అడిగారని నిన్న పార్లమెంట్‌ సాక్షిగా ప్రధాని చెప్పారు. అసలు హోదా వద్దనడానికి మీరు ఎవరండీ? ఐదు కోట్ల ప్రజల ఆకాంక్షలను, రాష్ట్ర ప్రజల హక్కును తాకట్టు పెట్టే అధికారం మీకు ఎవరు ఇచ్చారు? ఆ రోజు మేము హోదా అడిగితే వెక్కిరించారు. ప్రత్యేక హోదా వేస్ట్‌ అన్నారు.. హోదా సంజీవనా అని రకరకాలుగా మాట్లాడారు. సాక్షాత్తు అసెంబ్లీలో ఎమ్మెల్యేలందరికీ పుస్తకాన్ని ఇచ్చి మరీ ప్యాకేజీపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ప్యాకేజీకి అనుకూలంగా మహానాడులో తీర్మానం చేశారు. హోదా ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి ఎక్కడ.. అని ప్రశ్నించావు. ఉనికి కోసం ప్రతిపక్షాలు ఆరాటపడుతున్నాయని ఎదురుదాడి చేశారు.  
 
2016 సెప్టెంబర్‌7న అరుణ్‌జైట్లీ మన చెవుల్లో క్యాలీఫ్లవర్‌ పెట్టినప్పుడు మీ పార్టీకి చెందిన మంత్రులు ఆయన పక్కను కూర్చున్నారు. అప్పుడు అర్ధరాత్రి ప్రెస్‌మీట్‌ పెట్టి మీరు ఎందుకు స్వాగతించారు? అసెంబ్లీలో తీర్మానం చేసి జైట్లీకి కృతజ్ఞతలు తెలుపడం ధర్మమేనా? మనమే ఎక్కువ సాధించాం.. ఏ రాష్ట్రానికైనా ఇంతకంటే ఎక్కువ వచ్చాయా? అని మీరు అనలేదా? 
 
ఓ వైపు బీజేపీతో యుద్ధం అంటావు.. మరోవైపు కాళ్లబేరానికి దిగుతావు.. మహారాష్ట్ర ఆర్థిక మంత్రి భార్యను టీటీడీ బోర్డు మెంబర్‌గా నియమిస్తావు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ భర్త పరకాల ప్రభాకర్‌ను నీ పక్కన పెట్టుకుంటావు.. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్వయంగా.. చంద్రబాబుతో మా బంధం ఎన్నటికీ వీడిపోదు అన్నారు. దీనికేం సమాధానం చెబుతావు బాబూ?  

మాది ట్రాప్‌ కాదు.. చిత్తశుద్ధి 
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి చిత్తశుద్ధితో పనిచేస్తోంది. నాలుగేళ్లుగా నిజాయితీతో మేము చేస్తున్న డిమాండ్‌ను ఈ రోజు చంద్రబాబు తప్పనిసరి పరిస్థితిలో తాను కూడా మోయక తప్పలేదు.  

ఎవరినీ నమ్మొద్దండి... 
నేను రాష్ట్ర ప్రజలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎవరినీ నమ్మొద్దండి. నమ్మి నమ్మి నిజంగా సాలైపోయింది. కాంగ్రెస్‌ పార్టీని నమ్మాం. అన్యాయంగా రాష్ట్రాన్ని విడగొట్టద్దండీ అని బతిమిలాడాం. కానీ వినలేదు. వాళ్లు ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టి ఉన్నట్లయితే సుప్రీంకోర్టుకు వెళ్లి అయినా సరే తెచ్చుకునే పరిస్థితి ఉండేది. కానీ పెట్టలేదు. వాళ్లు 13 షెడ్యూలులో పెట్టినవన్నీ రైల్వే జోన్‌.. కడప స్టీల్‌ ఫ్యాక్టరీ.. క్రూడాయిల్‌ రిఫైనరీ.. ఇండస్ట్రియల్‌ కారిడార్‌.. తదితరాలన్నీ.. దుగరాజపట్నం పోర్టును పక్కన పెడితే ఏది తీసుకున్నా చట్టంలో ‘మే.. మే.. మే’ అంటూ పెట్టారు. ‘షల్‌.. షల్‌.. షల్‌ ’ అని ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్‌ పార్టీని అడుగుతున్నా. ఆ రోజు చట్టంలో ‘షల్‌’ అని పెట్టకుండా కాంగ్రెస్‌ మోసం చేసింది. ఖచ్చితంగా చేయాలని షల్‌.. షల్‌.. షల్‌ అని పెట్టి ఉంటే ఈ రోజు బీజేపీకి ఈ వెసులుబాటు ఉండేది కాదు.

ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టడంలో బీజేపీ వాళ్లు కూడా భాగస్వాములయ్యారు. ఆ రోజు పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. తిరుపతిలో హామీ ఇచ్చారు. ఐదేళ్లు కాదు పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. నాలుగున్నర సంవత్సరాలుగా అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్‌కు హోదా ఇవ్వకపోవడం బీజేపీ చేసిన మోసం. వాళ్లనూ నమ్మకూడదు. ఇక ఈ పెద్దమనిషి చంద్రబాబు గారు ఎన్నికలప్పడు చెప్పిన మాటలేమిటి? ప్రత్యేక హోదా పదికాదు 15 ఏళ్లు తెస్తామన్నారు. ప్రత్యేక హోదా సంజీవని అన్నారు. పరిశ్రమలు పెట్టడానికే మూడేళ్లు పడుతుంది కాబట్టి 15 ఏళ్లు కావాలన్నారు. తెస్తామన్నారు. ఎన్నికలయ్యాక.. ఈ నాలుగేళ్లుగా ఏ రకంగా చంద్రబాబు ప్రత్యేక హోదాకి తూట్లు పొడుస్తూ, కాలరాస్తూ, నాశనం చేస్తూ వచ్చాడో మనం చూస్తున్నాం. ప్రత్యేక హోదా సంజీవనా? అన్నాడు. కోడలు మగపిల్లాడిని కంటే అత్త వద్దంటుందా అని ఎగతాళి చేశాడు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రజలతో పని పడుతుందని మళ్లీ కొత్త డ్రామా. ఈయన్నూ నమ్మొద్దు. వాళ్లందరిని నమ్మీ నమ్మీ అలసిపోయిన పరిస్థితి.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement