ఎస్సీ, ఎస్టీలకుద్రోహం చేయలేదా? | YS Jagan Fires On Chandrababu During Debate On SC ST Commissions | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీలకుద్రోహం చేయలేదా?

Published Tue, Dec 17 2019 2:57 AM | Last Updated on Tue, Dec 17 2019 11:28 AM

YS Jagan Fires On Chandrababu During Debate On SC ST Commissions - Sakshi

మా ప్రభుత్వం వచ్చిన ఈ ఆరు నెలల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల జీవితాలను మార్చాలని ప్రతి అడుగూ ఆ దిశగా వేశాం. మేము అధికారంలోకి రావడం ఇదే మొదటిసారి. ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్లు నేర్చుకోవాలి. 

సాక్షి, అమరావతి : ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎస్సీ, ఎస్టీల ద్రోహి అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దుయ్యబట్టారు. దళితులనే పదాన్ని ఉచ్ఛరించే అర్హత కూడా ఆయనకు లేదని, వారిపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్నారని సోమవారం అసెంబ్లీ సాక్షిగా నిప్పులు చెరిగారు. ఎస్సీలకు ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటు చేసేందుకు వీలుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌ ప్రతిపాదించిన బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం జోక్యం చేసుకుంటూ చంద్రబాబు మోసపూరిత వైఖరిని ఎండగట్టారు. ఈ సందర్భంగా సీఎం ఇంకా ఏమన్నారంటే.. 

దళితులను దారుణంగా అవమానించారు.. 
ఆయన (బాబు) సుదీర్ఘంగా మాట్లాడుతున్నప్పుడు మా వాళ్లు ఓపిగ్గా విన్నారు. నేను తుది మాటలు మాట్లాడడానికి లేచి నిలుచుంటే.. నా మాటలు బయటి ప్రపంచానికి ఎక్కడ వినిపిస్తాయోనని ఏకంగా గొడవకు దిగారంటే వీళ్లకు ఎస్సీలు, ఎస్టీలపై ఏ స్థాయిలో ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ఎస్సీ, ఎస్టీల ద్రోహి బహుశా ప్రపంచంలోనే ఎవరూ ఉండరు ఒక్క చంద్రబాబు తప్ప. ఈ వ్యక్తి (బాబు) ఏపీ స్టేట్‌ కమిషన్‌ గురించి మాట్లాడుతూ 2003లో తెచ్చామంటున్నారు. ఇంతకన్నా దిక్కుమాలిన దుస్థితి ఉంటుందా? ఎస్సీ, ఎస్టీల జాతీయ కమిషన్‌ 1992లో వస్తే 1994–95లో ఈ పెద్దమనిషి ముఖ్యమంత్రి అయినా ఎన్నడూ పట్టించుకోలేదు. తీరా 2004 ఎన్నికలకు ముందు రాజకీయ ఆలోచనతో 2003లో ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేశారు.

చదవండి: మరో అల్లూరి.. సీఎం జగన్‌

ఎన్నికలకు ముందు వరకు ఇటువంటి కమిషన్‌ను ఏర్పాటు చేయాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తి ఇతనే.  గతంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు దళితుల గురించి ఎంతో చులకనగా మాట్లాడారు. ఎవరైనా ఎస్సీ, ఎస్టీలలో పుట్టాలనుకుంటారా? అని వ్యాఖ్యానించారు. సీఎం స్థాయిలో చంద్రబాబే అలా అంటే కింది స్థాయి నాయకులు ఇంకెంత దారుణంగా మాట్లాడతారో.. దళితులను ఎంత అవమానకరంగా చూస్తారో అర్థం చేసుకోవచ్చు. బాబు కేబినెట్‌లోని మంత్రే  లోకువగా మాట్లాడారు. దళితులు స్నానం చేయరు.. వారి వద్ద వాసనొస్తుందని చులకనగా మాట్లాడిన పరిస్థితి. అటువంటి మాటలు మాట్లాడినా చంద్రబాబు ఎటువంటి చర్యా తీసుకోలేదు.  

36 సీట్లకు గాను ఒక్కటా? 
రాష్ట్రం మొత్తం మీద అసెంబ్లీ స్థానాల్లో ఎస్సీలకు 29, ఎస్టీలకు 7 సీట్లు ఉంటే ఈ పెద్దమనిషి పార్టీకి వచ్చింది ఒకే ఒక్క సీటంటే ఏ స్థాయిలో ఈ మనిషి ఉన్నాడో ఇంతకన్నా నిదర్శనం అక్కర్లేదు. ఇటువంటి మనుషుల వల్ల దేశం ఎంతగా భ్రష్టుపట్టిపోతుందో వందేళ్ల కిందటే ప్రముఖ కవి గురజాడ అప్పారావు ఓ మాట చెప్పారు. అదేమిటంటే.. ‘ఎంచి చూడగ మనుషులందున మంచి చెడులు రెండే కులములు. మంచి అన్నది మాల అయితే నేను ఆ మాల అవుతాను’ అని చెప్పారు. వందేళ్ల కిందటే ఆ మహాకవి ఆ మాట చెబితే.. ఇప్పుడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు.. దళితులుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని మాట్లాడతాడు’ అని సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు.

ఈ వ్యక్తి ప్రతిపక్ష స్థానంలో ఉండడమూ నేరమే..  
అధ్యక్షా.. చూశారా.. ఎస్సీలు, ఎస్టీల గురించి మాట్లాడుతుంటే వాళ్లు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారో. (సీఎం మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు పోడియం ముందు గుమికూడి గొడవకు దిగి పెద్దపెట్టున నినాదాలు చేశారు) నేను మాట్లాడే మాటలు ఎక్కడ బయటికి పోతాయోనని అల్లరికి దిగారు. ఇంతటి దిక్కుమాలిన దుర్భద్ధితో అరుస్తున్నారంటే వీళ్లసలు ఎమ్మెల్యేలు, నాయకులేనా? ఇటువంటి వాళ్లా పాలకులు కావాల్సింది? ఒక్కసారి ఆలోచించాలని ప్రజలను కోరుతున్నా. ఇటువంటి వాళ్లను ముందు పెట్టి వెనకాల ఉన్న చంద్రబాబు నిస్సిగ్గుగా నవ్వుతున్నారు. ఇలాంటి వ్యక్తిని నాయకుడంటారా? ఎస్సీలు, ఎస్టీలపై ప్రేమ ఇదేనా? ప్రజలు చూస్తున్నారు. ఇటువంటి వ్యక్తి ప్రతిపక్ష స్థానంలో ఉండడం కూడా ఎంత ప్రమాదమో ఆలోచించాలని కోరుతున్నా. 

60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మాదే 
► ఐదుగురు డెప్యూటీ ముఖ్యమంత్రులను నియమిస్తే వారిలో నలుగురు ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలని గర్వంగా చెబుతున్నా.  
 దళిత మహిళ ఈ రాష్ట్ర హోం మంత్రి.  
► ఒక్క ఎస్టీకి కూడా ఎన్నికలు వచ్చేదాకా మంత్రి పదవి ఇవ్వని ఘనత చంద్రబాబుదైతే ఒక ఎస్టీని ఉప ముఖ్యమంత్రిని చేసిన ఘనత మాది.  
► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు దేశంలోనే కాకుండా రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి 50 శాతం రిజర్వేషన్లు కల్పించాం. నామినేటెడ్‌ పదవులు మొదలు నామినేటెడ్‌ కాంట్రాక్టుల వరకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్‌ మాత్రమే. అదీ మన ప్రభుత్వమే.  
► ఇదే కృష్ణా జిల్లాలో 19 మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పదవులు ఉంటే అందులో పదింటిని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చాం. ఈ వర్గాల వారికి గతంలో ఇటువంటి పదవులు రావాలంటే ఎన్నెన్నో పైరవీలు, రాజకీయ పలుకుబడి కావాల్సి వచ్చేది. దానికి భిన్నంగా మా ప్రభుత్వం ఆ వర్గాలకు పదవులను ఇచ్చింది.  
► నారావారిపల్లెలో దళితుల్ని గుడిలోకి రానివ్వని పరిస్థితి గురించి మా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి వివరించారు. ఆ పల్లె సాక్షాత్తు మన ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం. ఇప్పుడు నేను చెబుతున్నా.. గుళ్లలో చైర్మన్లుగా 50 శాతం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలే ఉన్నారు. పేదవాడి ప్రభుత్వం అంటే ఏమిటో చెప్పడానికి ఇంతకన్నా రుజువు అక్కర్లేదు. 
► గ్రామ సెక్రటేరియట్‌లలో లక్షా 28 వేలకు పైగా శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తే అందులో 82.5 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఉద్యోగులే ఉన్నారు.  
► మేము వేసే ప్రతి అడుగూ విప్లవాత్మకమే. ప్రతి పేదవాడికి తోడుగా ఉండేందుకే ఈ అడుగులన్నీ. ఈ సమయంలో టీడీపీ సభ్యులు దిక్కుమాలిన రీతిలో, నిస్సిగ్గుగా ప్రవర్తిస్తున్నారు. వారిని సస్పెండ్‌ చేసినా తప్పులేదని ఈ వేదిక మీద నుంచి సూచిస్తున్నా.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement