సాక్షి, గుంటూరు : ‘బహుశా దేశ చరిత్రలో ఎప్పుడు ఇలా జరిగి ఉండకపోవచ్చు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిరాహార దీక్షకు దిగటం నిజంగా ఒక చరిత్ర. ఆ అయిదుమంది ఎంపీలు అయిదుకోట్ల ప్రజల కోసం చేసిన త్యాగం. రాష్ట్రం కోసం ఐదుగురు ఎంపీలు పదవులు త్యాగం చేశారు. దేశంలో ఇలా ఎక్కడా జరిగి ఉండదు. ఏపీకి జరిగిన అన్యాయం దేశం మొత్తం తెలియాలని, వీరు చేసిన ప్రయత్నం. ప్రత్యేక హోదా రావాలని, కేంద్రం దిగి రావాలని, వీరు చేసిన ఆరాటం, పోరాటం...ఈ ప్రయత్నం హర్షించదగ్గ ప్రయత్నం. హోదా కోసం నాలుగేళ్లుగా వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అన్నిరకాల పోరాటాలు చేసింది. ఆఖరి అస్త్రంగా ఎంపీల చేత రాజీనామాలు చేయించడం జరుగుతుందని.. గతంలో చెప్పిన మాటకు కట్టుబడి ఆఖరి అస్త్రంగా ఎంపీలతో రాజీనామాలు చేయించాం.’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు.
గుంటూరు జిల్లా సంగంజాగర్లమూడిలో వైఎస్ జగన్ శుక్రవారం ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ... పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఇక న్యాయం జరగని పరిస్థితి కనిపించినప్పుడు... ఆఖరి అస్త్రం కూడా ప్రయోగించాం. ఈ ఆఖరి అస్త్రంలో చంద్రబాబు నాయుడు కూడా భాగస్వామ్యులు అయ్యి ఉంటే ప్రత్యేక హోదా వచ్చి ఉండేదని గట్టి నమ్మకం. మా ఎంపీలకు తోడు చంద్రబాబు పార్టీకి చెందిన ఎంపీలు కూడా రాజీనామా చేసి అటునుంచి ఏపీ భవన్‌కి వెళ్లి వాళ్లంతా నిరాహార దీక్షకు కూర్చుని ఉంటే దేశం మొత్తం చూసేది. దేశం మొత్తం చర్చనీయాంశమై అయ్యేది. కేంద్రం కూడా ప్రత్యేక హోదా ఇవ్వకతప్పని పరిస్థితి ఉండేది.
కానీ చంద్రబాబు నాయుడు మళ్లీ మోసం చేశారు. తాను మోసం చేసినా కూడా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు తోడుగా నిలిచేందుకు ఎవరు వచ్చినా, రాకపోయినా అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగడుతూ అన్ని పార్టీలను మా ఎంపీలు కలిశారు. వారందరిని ఒప్పించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు కూడగట్టారు. నరేంద్ర మోదీ ప్రభుత్వంపై మొట్ట మొదటిసారి అవిశ్వాస తీర్మానం పెట్టింది వైఎస్సార్ సీపీనే. చరిత్రలో నిలిచిపోయే ఘటన. ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడు యూటర్న్ తీసుకున్నారు. పోనీ అలా చేసినా చిత్తశుద్ధి కరువైంది. చంద్రబాబు తన ఎంపీల చేత రాజీనామా చేయించకపోవడం, వారు ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొనేలా చేయకపోవడం అన్నింటికన్నా బాధాకరమైన విషయం.
ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు రెండోసారి అఖిపక్షానికి ఆహ్వానం పలుకుతూ లేఖ రాశారు. అంటే ఈయన గారు అఖిలపక్షాన్ని ఎందుకు పిలిచారంటే... ఆయన ఢిల్లీ యాత్ర గురించి చర్చించడానికి అట. బీజేపీ ఎంపీ హేమమాలినిని కలిసి ఏం మాట్లాడారో చెప్పడానికా?. చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో రెండు గంటల పాటు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. ఎక‍్కడా ప్రత్యేక హోదా హోదా గురించి కానీ ఎంపీల రాజీనామాల గురించి ఊసే లేదు. రాష్ట్రానికి మోసం చేసిన చంద్రబాబు అఖిలపక్షానికి వెళ్లాలా?.
ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఢిల్లీ వెళితే ముఖ్య నేతలెవరూ కలవడానికి రాలేదు. చంద్రబాబు వెన్నుపోటు పొడవని పార్టీలు, నేతలు ఎవరూ లేరు. ఆయనను ఎవరూ నమ్మని పరిస్థితి ఏర్పడింది. హోదా కోసం వచ్చిన అవకాశాన్ని చంద్రబాబు జారవిడిచారు. తన అవినీతిపై కేంద్రం విచారణ జరిపిస్తుందేమోనన్న భయంతో చంద్రబాబు తన ఎంపీలతో రాజీనామాలు చేయించలేదు. మరోసారి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారు. విశ్వసనీయత అనేది రాజకీయాల్లో ప్రధాన అంశం. స్వార్థం, సొంత లాభం కోసం చంద్రబాబు ఏదైనా చేస్తాడేమో. ఆయన పుట్టిన గ్రహబలం అలాంటిదేనేమో. హిట్లర్ కూడా ఇలాగే చేశాడు. ఇంచుమించు ఇద్దరి మనస్థత్వాలు ఒకటే. చేసేవన్నీ అన్యాయాలు. వాటిని కవర్ చేసుకోవాడానికి మీడియాను వాడుకోవడం చంద్రబాబుకు అలవాటే. ఆయన చరిత్ర హీనుడుగా మిగిలిపోతాడు’ అని వైఎస్ జగన్ విమర్శించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన సూటిగా ఏడు ప్రశ్నలు సంధించారు. అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ...చంద్రబాబుకు అవసరం ఉన్నప్పుడల్లా బయటకు వస్తారని ఎద్దేవా చేశారు. నాలుగేళ్లుగా హోదా కోసం పవన్ ఏం చేశారని వైఎస్ జగన్ ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment