చంద్రబాబుకు జగన్‌ సంధించిన ఏడు ప్రశ్నలు | YS Jagan Seven Questions to Chandrababu Over Special Status | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 6 2018 8:38 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YS Jagan Seven Questions to Chandrababu Over Special Status - Sakshi

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఏడు ప్రశ్నలు సంధించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్టీ ఎంపీలు రాజీనామాలు చేసి, అనంతరం ఆమరణ నిరాహారదీక్ష కు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ శుక్రవారం గుంటూరు జిల్లా సంగంజాగర్లమూడిలో ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌ లో మాట్లాడారు.

1. ఫ్లానింగ్‌​ కమిషన్‌కు లేఖ ఎందుకు రాయలేదు? ... మార్చి 2, 2014న యూపీఏ ప్రభుత్వం కేబినెట్‌ తీర్మానాన్ని ఆమోదించింది. ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఫ్లానింగ్‌ కమిషన్‌ను అప్పటి ప్రభుత్వం ఆదేశించింది. చంద్రబాబు 2014, మేలో అధికారం చేపట్టారు. 2014 డిసెంబర్‌ దాకా ఫ్లానింగ్‌ కమిషన్‌ అమలులో ఉంది. అంటే ఆ ఏడు నెలలపాటు అధికారంలో ఉండి ప్లానింగ్‌ కమిషన్‌కు లేఖ రాయటం.. కలవటం లాంటివి చేయకుండా చంద్రబాబు జాప్యం చేశారు. ఇది మోసం కాదా? 

2. ప్యాకేజీని స్వాగతించింది నిజం కాదా?... సెప్టెంబర్‌ 8,  2016న అర్ధరాత్రి ప్రత్యేక హోదా బదులు సోకాల్డ్‌ ప్యాకేజీ అంటూ కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రకటన చేశారు. ప్యాకేజీ ప్రకటన సమయంలో టీడీపీ మంత్రులు జైట్లీ గారి పక్కనే ఉన్నారు. అంతకు ముందు నుంచే విపరీతమైన ప్యాకేజీ అంటూ టీడీపీ నేతలు లీకులు ఇచ్చారు. చంద్రబాబుగారి కోరిక మేరకే ఆ ప్యాకేజీ ప్రకటించారు. అన్ని రాష్ట్రాల విజ్ఞప్తి మేరకే తాము ప్యాకేజీని ప్రకటిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. చంద్రబాబుగారూ.. మీరు ఆ ప్యాకేజీ ప్రకటన బ్రహ్మండంగా ఉంది అని స్వాగతించలేదా? ఢిల్లీకి వెళ్లి జైట్లీకి శాలువా కప్పి కృతజ్ఞతలు చెప్పలేదా? సెప్టెంబర్‌9న అసెంబ్లీలో ధన్యవాద తీర్మానాలు పెట్టి కేంద్రాన్ని, జైట్లీని ప్రశంసించలేదా? పైగా ప్రత్యేక హోదాతో ఈశాన్య రాష్ట్రాలు ఏం బాగుపడ్డాయి.. కోడలు మగబిడ్డను కంటానంటే అత్త వద్దంటుందా? అంటూ చంద్రబాబు వెటకారంగా వ్యాఖ్యలు చేశారు. ఇది అన్యాయం కాదా?

3. వృద్ధిరేటుపై తప్పుడు సంకేతాలివ్వలేదా? ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న ఇదే పెద్ద మనిషి.. ఆ తర్వాత ఆ మాటకు కట్టుబడకుండా అసలు ఆ ఆలోచన వద్దంటూ సలహాలు ఇవ్వలేదా? ఆంధ్ర రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అంటూ ప్రపంచ దేశాలకు కలరింగ్ ఇచ్చారు‌. లక్షల కోట్ల పెట్టుబడులు.. లక్షల్లో ఉద్యోగాలు అంటూ తప్పుడు ప్రకటనలు ఇచ్చారు. దేశంలోనే అత్యధిక జీడీపీ సాధించిన రాష్ట్రమంటూ చెప్పుకున్నారు.  ఇది ధర్మమేనా?

4. నాలుగేళ్లలో మీరు చేసిందేంటి?  ప్రత్యేక హోదా మీద  చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్న ఒకే ఒక పార్టీ వైఎస్సార్‌ సీపీ మాత్రమే. ఈ నాలుగేళ్లుగా వైఎసార్‌సీపీ వివిధ కార్యక్రమాలకు పిలుపునిస్తే.. పోలీసులను పెట్టి అణిచివేయటం, ప్రతిపక్ష నేత నిరహార దీక్ష చేస్తే ప్రధాని వస్తున్నారంటూ బలవంతంగా భగ్నం చేయటం.. ఆందోళనలను నీరుగార్చిన యత్నం మీది కాదా? ప్రత్యేక హోదా వల్ల జరిగే లాభాలను చెబుతూ యువభేరీ కార్యక్రమాలను చేపడితే పిల్లలని కూడా చూడకుండా పీడీ యాక్ట్‌ కింద కేసులు పెడతామంటూ బెదిరించారు. అసలు ఈ నాలుగేళ్లలో హోదా అంశంలో మీద చంద్రబాబు చేసిందేంటి? అన్యాయం అధర్మం మోసం కాదా?

5. అవిశ్వాసం విషయంలో యూటర్న్‌ నిజం కాదా? అసలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ గనుక అవిశ్వాసం పెట్టకపోయి ఉంటే.. చంద్రబాబు అవిశ్వాసం పెట్టేవారా?. మార్చి 15 గురువారం సాయంత్రం మీకు సంఖ్యా బలం ఉంటేనే మద్ధతు ఇస్తానని చంద్రబాబు అన్నారు. మార్చి 16 పొద్దున యూటర్న్‌ తీసుకున్నారు. అందుకు కారణం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీలు తాను(వైఎస్‌జగన్‌) రాసిన లేఖతో ప్రతీ పార్టీని కలిసి అవిశ్వాసానికి వారి ఒప్పించటం.. మద్ధతు కూడగట్టడం. జాతీయ మీడియాలో ఆ విషయం ప్రముఖంగా వచ్చింది కాబట్టే తానే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతానంటూ ప్రకటన చేశారు. అంటే అప్పటిదాకా ఆయన మిగతా పార్టీలతో మాట్లాడలేదన్న విషయం స్పష్టమయ్యింది. ఇది మోసం కాదా? 

6. నల్లబ్యాడ్జీలతో హోదా వస్తుందా?  ఇప్పటికిప్పుడు అఖిలపక్షం పేరిట ఆహ్వానాలు పంపుతున్నారు. ఇదేలా ఉందంటే గజదొంగ ఒకడు దొంగతనాల నివారణ కోసం మీటింగ్‌​పెట్టినట్లు ఉంది. పైగా ఇందులో కార్యాచరణ ఎలా ఉందంటే... ఎవరు కూడా ఆందోళనలు., నిరసనలు తెలపకూడదంట. ఉద్యమం పెద్దదైతే రాష్ట్రాభివృద్ధి ఆగిపోతుందంట. ఉద్యమాన్ని ఉవ్వెత్తున్న చేయాల్సిన తరుణంలో ఉద్యమాన్ని నీరుగారుస్తూ ఇలాంటి కార్యచరణ నిర్ణయించటం న్యాయమేనా? ఇది మోసం కాదా?

7. ఎంపీలతో రాజీనామా చేయించకపోవటం మోసం కాదా? ఇవాళ​ పోరాటం చేస్తే ప్రత్యేక హోదా సాధ్యం అవుతుందని తెలిసి కూడా. ఇది ఆఖరి బడ్జెట్‌ సమావేశం అని తెలిసి కూడా. అన్నింటికి మించి  25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి ఆమరణ దీక్ష చేస్తే ఖచ్ఛితంగా దేశం మొత్తం మనవైపు చూస్తుంది. కేంద్రం దిగి వస్తుందని తెలిసి కూడా ఈరోజుకీ కూడా తన ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా డ్రామాలాడటం మోసం కాదా?

ప్రజలను నాలుగేళ్లుగా మోసం.. అన్యాయం చేస్తూ.. ఇప్పుడు సైకిల్‌​ ర్యాలీ, అఖిల పక్షం అంటూ ఇప్పటికీ ప్రజలను మభ్యపట్టే కార్యాక్రమాలకు చంద్రబాబు తెరలేపారు. సిగ్గుతో తల దించుకోవాలి. రాష్ట్ర రాజకీయాల్లో, ప్రజల దృష్టిలో చరిత్రహీనుడుగా చంద్రబాబు మిగిలిపోతారని చెబుతున్నా’ అని జగన్‌ పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement