పవన్ కల్యాణ్, సీఎం చంద్రబాబు నాయుడు(ఫైల్ ఫొటో)
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ నుంచి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధించాలంటే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పన ఒక్కటే మార్గమని అందరూ అంగీకరించే విషయమే. అంతటి కీలకమైన ప్రత్యేక హోదాపై జరుగుతున్న పోరాటం ఉధృతం చేయాల్సిన తరుణంలో రాజకీయ స్వలాభాల కోసం కొన్ని పార్టీలు అనుసరిస్తున్న వింత పోకడలపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం గడిచిన నాలుగేళ్లుగా పట్టువదలకుండా రాష్ట్రంలోని ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుండగా, మిగిలిన రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోలేదు. పైపెచ్చు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రత్యేక హోదా వల్ల ఒరిగేదేమీ లేదంటూ ఎప్పుడో చేతులెత్తేసింది. ప్రత్యేక హోదా కన్నా ప్యాకేజీ మిన్న అంటూ చంద్రబాబు నాయుడు ఊరూవాడా చాటారు. కేంద్రంలోని మిత్రపక్షమైన బీజేపీ ప్రభుత్వాన్ని పొగడుతూ తీర్మానం కూడా చేసింది చంద్రబాబు ప్రభుత్వం. గడిచిన నాలుగేళ్ల కాలం పాటు ప్రత్యేక హోదా కోసం అనేక రూపాల్లో ఉద్యమాన్ని కొనసాగిస్తూ ప్రజలను చైతన్యం చేయడంలో వైఎస్సార్ కాంగ్రెస్ ఒక్కటే ముందున్నది.
కీలకమైన ప్రత్యేక హోదా కోసం సాగుతున్న పోరాటాలు తీవ్రరూపం దాల్చుతున్న తరుణంలో ఆ పోరాటాలను పక్కదారి పట్టించే ప్రయత్నాలూ సాగుతుండటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టదాయకంగా మారుతున్నాయి. ఇంతకాలం నిశ్శబ్దంగా ఉన్న పార్టీలు కొన్ని ఒక్కసారిగా తెరమీదకొచ్చి ఒక పథకం ప్రకారం ప్రస్తుత ఉద్యమ రూపాన్ని మార్చడానికో లేదా నీరుగార్చడానికో ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు పరిణామాలు సూచిస్తున్నాయి. ప్రత్యేక హోదా సాధన కోసం ప్రస్తుత ప్రజా ఉద్యమ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ఒక వేదికపైకి వచ్చి మరింత తీవ్రతరం చేయాల్సింది పోయి అందుకు భిన్నంగా రాజకీయ ఎత్తుగడలతో ముందుకెళ్లడం ప్రజలను విస్మయపరుస్తోంది. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నంగా తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి.
గడిచిన కొద్ది రోజులుగా ప్రత్యేక హోదా అంశంపై పార్లమెంట్ వేదికగా నిరసన కార్యక్రమాలు తీవ్రమయ్యాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించే వరకు వెళ్లింది. ఆంధ్రప్రదేశ్ కు కల్పిస్తానన్న ప్రత్యేక హోదా లభించకుండా ఏవిధంగా వంచనకు గురైందన్నది యావత్తు జాతి దృష్టికి తేవడంతో పాటు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని సాధించుకోవడం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వరుస క్రమంలో ఆందోళనలు కొనసాగిస్తోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడిని పెంచి ఉద్యమాన్ని తీవ్రతరం చేసింది. ఈ దశలో ప్రజల నుంచి వెల్లువెత్తిన నిరసనల మధ్య అనివార్య పరిస్థితుల్లో ఒక్కో పార్టీలో కదలిక మొదలైంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసం ప్రతిపాదించింది. అందుకు కావలసిన మద్దతు కూడగట్టడం కోసం ఆ పార్టీ నేతలు అన్ని పార్టీల నేతలను కలిసి ఒప్పించాయి కూడా. కేంద్ర ప్రభుత్వం దిగిరాని పక్షంలో ఇక పార్లమెంట్ లో కొనసాగడం అనవసరమని, తమ సభ్యత్వాలకు రాజీనామా చేయడం ద్వారా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని ఆ పార్టీ ఎప్పుడో హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లోనే టీడీపీ యూటర్న్ తీసుకుని తామూ అవిశ్వాసం పెడతామంటూ ప్రకటించింది. నిజానికి మార్చి 8 మీడియా సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు అవిశ్వాస తీర్మానం వల్ల ప్రయోజనం లేదని అన్నారు. కానీ ప్రజల్లో వ్యక్తమవుతున్న ఆందోళన, ఉద్యమం తీవ్రరూపం దాల్చుతున్న పరిణామాల్లో ప్రత్యేక హోదా అంశాన్ని టీడీపీ కేవలం రాజకీయ అంశంగా మార్చుకోవాలని చూసిందే తప్ప ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వేసిన ఏ అడుగులోనూ చిత్తశుద్ధి కనిపించలేదు. మొత్తంమీద కావేరీ నదీ జలాల వివాదంలో అన్నాడీఎంకే ఎంపీలు వెల్ లో ఆందోళన దిగడం, సభ వాయిదా పడుతుండటం, అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా పోవడం తెలిసిందే.
పార్లమెంట్ సమావేశాలకు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో గడిచిన కొద్ది రోజులుగా సాగుతున్న ఈ ఆందోళన ఇప్పుడు చివరి దశకు చేరినట్టుగా భావించవచ్చు. శుక్రవారం ఈ అంశంపై పార్లమెంట్ లో చర్చకు రానిపక్షంలో తర్వాత ఏం చేయాలి? ప్రత్యేక హోదా పరిస్థితి ఏమతుంది? అన్న ఆందోళన ప్రజల్లో నెలకొనగా, యావత్తు దేశం దృష్టికి ఈ అంశం వచ్చేలా శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలు సమర్పించాలని ఇదివరకే సంకల్పించారు. తమ పదవులకు రాజీనామాలు సమర్పించడంతో పాటు వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ భవన్ లో ఆ ఎంపీలు ఆమరణ నిరాహాహ దీక్షకు దిగనున్నట్టు ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీలు దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో డిమాండ్ సాధన కోసం మిగిలిన రాజకీయ పక్షాలు, సంఘాలు వారికి మద్దతుగా నిలిచినపక్షంలో లక్ష్యం కొంతవరకైనా నెరవేరడానికి అవకాశం ఉండేదేమో. కానీ లక్ష్య సాధనకన్నా రాజకీయ ఎత్తుగడ కోసం పనిచేస్తున్న కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా అంశం పక్కదారిపట్టే అవకాశాలున్నాయని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
బీజేపీ ప్రభుత్వంపై పార్లమెంట్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే అందుకు సంపూర్ణ మద్దతు ఇస్తానని ప్రకటించడమే కాకుండా అందుకోసం మిగతా పార్టీల మద్దతు తీసుకొస్తానని జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ ఫిబ్రవరి 19 న హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు. పార్లమెంటరీ నిబంధనల ప్రకారం అవిశ్వాసం ప్రతిపాదించడానికి ఒక్క ఎంపీ చాలనీ, ఐదుగురు ఎంపీలున్న వైఎస్సార్ సీపీ అవిశ్వాసం ప్రతిపాదిస్తే మద్దతు సంపాదిస్తానని వ్యంగ్యంగా కూడా మాట్లాడారు. ఆ సందర్భంలో టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీల గురించి పవన్ మాట్లాడలేదు. వైఎస్సార్ సీపీ అవిశ్వాసం తీర్మానంపై మద్దతు కోసం కర్ణాటక, తమిళనాడు వెళతానని కూడా ప్రకటించారు. అంతకుముందు మార్చి 8 న మరో సందర్భంలో మాట్లాడుతూ, సమస్య ఢిల్లీలో ఉంటే అమరావతిలో పోరాటం చేస్తే లాభమేంటని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఇంతగా మాట్లాడిన పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ శుక్రవారం రోజున గుంటూరులో పాదయాత్ర చేపడుతానని ప్రకటించడం అందరినీ విస్మయపరిచింది.
సమస్య ఢిల్లీలో ఉందని, అమరావతిలో పోరాటం చేస్తే లాభమేంటని ప్రశ్నించిన పవన్, ప్రత్యేక హోదా కోసం ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేసి ఢిల్లీ వేదికగా ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్న తరుణంలో గుంటూరులో పాదయాత్ర చేయాలని సంకల్పించడంలో ఆంతర్యమేంటన్న ప్రశ్న ఉదయిస్తోంది. అవిశ్వాస తీర్మానం కోసం మిగతా పార్టీల మద్దతు కూడగట్టడానికి కర్నాటక, తమిళనాడు వెళతానన్న పవన్, పార్లమెంట్ లో అవిశ్వాస తీర్మానం చర్చకు రాకపోవడానికి అన్నాడీఎంకే కారణంగా చెబుతుండగా, ఆ విషయంలో పవన్ పెదవి విప్పలేదు. శుక్రవారంతో పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడుతాయి. ఇలాంటి సందర్భంలో కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి ఎంపీలు పదవులు వదులుకోవడానికి సిద్ధపడుతున్న తరుణంలో ఇస్తానన్న మద్దతు ఇవ్వకపోగా స్థానికంగా ప్రజలను పక్కదారి పట్టించడానికన్నట్టు పాదయాత్ర పేరుతో బయలుదేరడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయం నుంచి గడిచిన నాలుగేళ్లుగా టీడీపీకి మద్దతుగా నిలిచిన పవన్ ఇటీవలి కాలంలో ఆ పార్టీ నేతలపై విమర్శలు కురిపించారు. అలా విమర్శలకు దిగుతున్నప్పటికీ పవన్ టీడీపీకి ప్రయోజనకారిగానే వ్యవహరిస్తున్నారని ఆయన చర్యలను నిశితంగా గమనిస్తున్న నేతలు అంటున్నారు. ప్రత్యేక హోదా కోసం ఇంతకాలం పార్లమెంట్ కార్యకలాపాలను స్తంభింపజేయడమే కాకుండా ఢిల్లీ వేదికగా ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్న సందర్భంలో చెప్పినట్టుగా మద్దతునివ్వకపోయినా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పక్కదారి పట్టించే ప్రయత్నాలు ఎవరూ చేయకూడదు.
ఢిల్లీలో పోరాటం చేయాలని అందరినీ డిమాండ్ చేసిన పవన్ అందుకు భిన్నంగా గుంటూరులో పాదయాత్ర చేపడుతున్నట్టు ప్రకటించడం, అది కూడా ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్న రోజునే ఒక రోజు యాత్రకు శ్రీకారం చుట్టడం, ఢిల్లీ వెళ్లి పార్లమెంట్ ప్రాంగణంలో షో చేస్తూ హైడ్రామా నడిపించిన చంద్రబాబును పల్లెత్తు మాట అనకపోవడం, టీడీపీ ఎంపీలతో పాటు చంద్రబాబు కాంగ్రెస్ నేతలతో చెట్టాపట్టాలేసుకుని పార్లమెంట్ ప్రాంగణంలో నడిపిన హాడవిడిపై స్పందించకపోవడం, ఒకరోజు యాత్ర కూడా ఒకరోజు ముందు మాత్రమే ప్రకటించడం... వంటి అనేక అంశాలు ప్రత్యేక హోదా సాధన కోసం ఏమాత్రం ప్రయోజనకరంగా లేకపోగా ఆ ఉద్యమాన్ని నీరుగార్చే విధంగా, ప్రజలను పక్కదారి పట్టించే విధంగా ఉన్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. మరోవైపు చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నాలుగేళ్ల తర్వాత యూటర్న్ తీసుకున్న చంద్రబాబు ఉద్దేశ పూర్వకంగానే పార్లమెంట్ సమావేశాలు సమావేశాలు ముగిసే నాటి వరకు అసెంబ్లీ సమావేశాలను పొడగించడం, తద్వారా తానేదో చేశానని చెప్పుకోవడానికి అసెంబ్లీని వేదికగా చేసుకోవడానికి ఎత్తుగడలా మాత్రమే కనబడుతోందన్న అభిప్రాయం ఉంది. మొత్తంమీద ఇలాంటి నేతల రాజకీయ ఎత్తుగడలు, కుట్రలు, కుతంత్రాల మధ్య ప్రత్యేక హోదా సాధన ఉద్యమం నలిగిపోతోందన్నది నిజం.
Comments
Please login to add a commentAdd a comment