సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా సాధనకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్ నిరవధిక వాయిదా అనంతరం రాజీనామాలు చేసిన ఎంపీలు, ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా అంబేద్కర్ విగ్రహం సాక్షిగా రెండో రోజు దీక్షను కొనసాగిస్తున్నారు. వారిలో ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, మేకపాటిని దీక్ష విరమించాలని సూచించారు. అయితే అస్వస్థతను ఏమాత్రం లెక్క చేయకుండా మేకపాటి దీక్ష కొనసాగిస్తున్నారు.
కొత్త డ్రామాలకు తెరతీశారు
ఈ సందర్భంగా మేకపాటి రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొత్త డ్రామాలకు తెరతీశారని మండిపడ్డారు. నాలుగేళ్లుగా అన్యాయం జరుతున్నా ఏమాత్రం పట్టించుకోని బాబు, ఇప్పుడు అఖిలపక్షం సమావేశం అంటూ హడావిడి చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ వల్లే ప్రత్యేక హోదా డిమాండ్ ఇంకా సజీవంగా ఉందన్నారు.
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
రాష్ట్ర ప్రయోజనాలే వైఎస్సార్ సీపీ లక్ష్యమని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడంలో చంద్రబాబు దారుణంగా విఫలమయ్యారని విమర్శించారు. కేంద్రం దిగివచ్చే వరకూ దీక్ష కొనసాగిస్తామని వైవీ స్పష్టం చేశారు. గతంలో చెప్పిన విధంగానే రాజీనామాలు చేశామని చెప్పిన ఆయన, హోదా వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏం చేసేందుకైనా తాము సిద్ధమేనని తిరుపతి ఎంపీ వరప్రసాద్ తెలిపారు.
హోదా సాధించే వరకూ సైనికుల్లా పనిచేస్తాం
ఐదుకోట్ల మంది ఆంధ్రలు హక్కు ప్రత్యేక హోదా సాధించే వరకూ సైనికుల్లా పోరాడుతామని కడప ఎంపీ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుతున్న పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని, హోదాతో సహా విభజన హామీలన్నీ అమలు చేయాని అవినాష్ రెడ్డి డిమాండ్ చేశారు. అప్పటి వరకూ తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మరో ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ఎంపీలు దొంగ దీక్షలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమకు పదవుల కంటే ప్రజలే ముఖ్యమని అన్నారు.
ప్రజాకోర్టులో శిక్షతప్పదు
ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు ఆపార్టీ ఎమ్మెల్యేలు మద్ధతు తెలిపారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల ఆకాంక్ష అని, హోదా వస్తేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వారు అభిప్రాయపడ్డారు. హోదాకోసం తాము పోరాడుతుంటే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ఎమ్మల్యేలు విమర్శించారు. ఆమరణ దీక్షకు సంఘీభావం తెలిపిన వారిలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, నారాయణ స్వామి, సునీల్, ముస్తఫా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment