సాక్షి, విశాఖపట్నం : ఢిల్లీకి వెళ్లి హెరిటేజ్ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా నటించారని, ఉత్తమ నటుడిగా ఆయనకు నంది అవార్డు కచ్చితంగా వస్తుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ అన్నారు. అవినీతిపై విచారణ జరుపుతారేమోనన్న భయం పట్టుకున్నందునే చంద్రబాబు ఢిల్లీ వెళ్లి కొత్త డ్రామాలకు తెరలేపారంటూ మండిపడ్డారు. విశాఖపట్నంలో గుడివాడ అమర్‌నాథ్ ఇక్కడి మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాటకాలను బట్టబయలు చేశారు. 29సార్లు ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఒక్కసారైనా కేంద్రానికి లేఖ రాశారా లేక విజ్ఞప్తి చేశామని చూపించగలరా అని ఏపీ సీఎంను ప్రశ్నించారు. గతంలో హోదా పేరెత్తితే అదేమైనా సంజీవనా ఏంటి.. అన్న మాటలు చంద్రబాబు మరిచిపోయారని పేర్కొన్నారు.
హోదా కోసం రాష్ట్రంలో ఎక్కడ, ఎవరు పోరాడిన అణచివేయాలంటూ గతంలో చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారని గుర్తుచేశారు. హోదా కార్యక్రమాలకు విద్యార్థులొస్తే జైలుకు పంపించండి, పీడీ యాక్టులు పెట్టండని ఆదేశించింది ఏపీ సర్కార్ కాదా అని ప్రశ్నించారు. కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనేందుకు వస్తే విమానాశ్రయంలోనే వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని అడ్డుకున్న ఘటనను రాష్ట్ర ప్రజలు ఎన్నిటికీ మర్చిపోరన్నారు. నాలుగేళ్లుగా వైఎస్సార్ సీపీ హోదా కోసం పోరాడుతుంటే.. ఏడాదిలో ఎన్నికలొస్తాయని చెప్పుకునే చంద్రబాబు నేడు హోదా గురించి ముందడుగు వేసినట్లుగా నటిస్తున్నారని విమర్శించారు. ఫొటోలు, షూటింగ్‌లతో ఏపీకి న్యాయం జరగదని గుర్తించాలంటూ చంద్రబాబుకు హితవు పలికారు.
హెరిటేజ్ ప్రొడక్షన్స్.. నారావారి ఢిల్లీ యాత్ర
ఈ ఏడాది ఉత్తమ నటుడిగా సీఎం చంద్రబాబుకు నంది అవార్డు కచ్చితంగా ఇస్తారు. గతేడాది బాలయ్యకు ఇచ్చిన అవార్డును ఈ ఏడాది జ్యూరీ సభ్యులు చంద్రబాబుకు అవార్డు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటూ ఎద్దేవా చేశారు. కేవలం ఢిల్లీకి వెళ్లి ఫొటోలకు పోజులు ఇచ్చారే తప్ప, హోదా గురించి మాత్రం ఎలాంటి యత్నం చేయలేదన్నారు. గతంలో ఏరోజూ అసెంబ్లీకి మొక్కని చంద్రబాబు.. ఇప్పుడు పార్లమెంట్ మెట్లకు మొక్కడం వెనుక మతలబు ఏంటో చెప్పాలన్నారు. మా వద్దకు చంద్రబాబుగానీ, టీడీపీ నేతలుగానీ రాలేదని అన్నాడీఎంకే నేత తంబిదురై చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయన ఎంతమేరకు ప్రయత్నిస్తున్నారో ఐదు కోట్ల ప్రజలు తెలుసుకుంటున్నారని చెప్పారు. హేమాహేమీలను కలుస్తానంటూ ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు, కేవలం హేమమాలినిని కలిశారు తప్ప.. ఒక్క కీలక నేతని కూడా కలవ లేదంటూ మండిపడ్డారు. ఆయనతో భేటీ కావడానికి ఒక్కరు కూడా ఆసక్తి చూపించకపోవడం చంద్రబాబుపై నేతలకు ఎంత నమ్మకం ఉందో తేలిపోయిందని వైఎస్సార్ సీపీ నేత గుడివాడ అమర్‌నాథ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment