
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
సాక్షి, మచిలీపట్నం: ఏపీలో సంచలనం రేపుతున్న దాచేపల్లి ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ట్విటర్‌లో స్పందించారు. గుంటూరు జిల్లా దాచేపల్లిలో అభంశుభం తెలియని 9 ఏళ్ల బాలికపై లైంగిక దాడి జరగడం దారుణం అన్నారు. ఏపీలో గత కొంతకాలం నుంచి అత్యాచార ఘటనలు పెరుగుతున్నాయంటూ వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సంఘటనల్లో దోషులు ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే ఉన్నారని ట్వీట్‌లో పేర్కొన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోని కారణంగా ఇలాంటి దారుణాలు ఏపీలో అధికంగా జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు. అత్యాచార కేసుల్లో తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఇటువంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని, దీనికి సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యుడు కాదా అంటూ వైఎస్ జగన్ తన ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.
కాగా, మైనర్ బాలికపై అత్యాచార ఘటనతో దాచేపల్లి అట్టుడుకిపోతోంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికకు చాక్లెట్లు కొనిస్తానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి సుబ్బయ్య అనే నిందితుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు చెప్తే చంపేస్తానంటూ బాలికను ఆ మృగాడు బెదిరించాడు. అయితే ఇంటికి వచ్చిన బాలిక కడుపునొప్పి అనడంతో ఆరా తీయగా కీచకపర్వం వెలుగుచూసింది. చిన్నారిపై పైశాచికంగా ప్రవర్తించిన సుబ్బయ్యను వెంటనే అరెస్ట్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు చేపట్టారు. నిందితుడిని శిక్షించాలంటూ స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో దాచేపల్లిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రస్తుతం నిందితుడు సుబ్బయ్య పరారీలో ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment