ఆకాశంలో క‌ల‌ల సౌధం | Ys jagan navaratnalu house for poor people | Sakshi
Sakshi News home page

ఆకాశంలో క‌ల‌ల సౌధం

Published Wed, Jan 9 2019 5:02 AM | Last Updated on Wed, Jan 9 2019 5:02 AM

Ys jagan navaratnalu house for poor people - Sakshi

 సాక్షి, అమరావతి/ సాక్షి, నెట్‌వర్క్‌: వంట, స్నానాల గదితో కూడిన చిన్నపాటి రెండు గదుల ఇల్లు.. జీవిత చరమాంకంలోకి వచ్చే సరికి కనీసం ఎలాగైనాఈ కలను సాకారం చేసుకోవాలనేది సగటు పేదవాడి ఆశ. ఈ కలల సౌధం కోసం కళ్లలో వత్తులు వేసుకుని సామాన్యుడు ఎదురు చూస్తున్నాడు.. అదింకా ఆకాశంలోనే ఉంది. ఎప్పుడు కిందికి దిగివస్తుందో ఏమో! అదిగో.. ఇదిగో అంటూ నాలుగున్నరేళ్లుగా పాలకులు ఊరించి ఉసూరు మనిపించారే తప్ప  ఆ కలను సాకారం చేయలేదు. మళ్లీ రాజన్న రాజ్యమొస్తే తప్ప ఆ కల నెరవేరేలా లేదనేది సామాన్యుడి మాట.  

ఎండకు ఎండుతూ, చలికి వణుకుతూ..
నా భర్త మాదన్న 13 ఏళ్ల కిందట మృతి చెందాడు. మాకు ఎనిమిది మంది ఆడపిల్లలు, ఒకరి వివాహం చేయగా మిగిలిన ఏడుగురితో కలిసి ఓ చిన్న గుడిసెలో జీవనం సాగిస్తున్నాం. కూలి పనులు చేసు కుంటూ పొట్టపోసుకుంటున్నాం. ఇంటి కోసం పలుమార్లు అర్జీలు పెట్టుకున్నాం. జన్మభూమి, గ్రామదర్శిని తదితర కార్యక్రమాల్లో అధికారులకు పలు మార్లు దరఖాస్తులు ఇచ్చినా ఇల్లు మంజూరు కాలేదు.తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో కూడా వినతిపత్రాలిచ్చాం. అయినా ఫలితం లేదు. చేసేదేం లేక ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ గుడిసెలోనే బతుకులు వెళ్లదీస్తున్నాం.  
 – హరిజన దస్తగిరమ్మ, ఎల్‌.నగరం, కర్నూలు జిల్లా

కనిపించేది మొండి గోడలే..
ఆంధ్రప్రదేశ్‌ను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం.. ఐదేళ్లలో పేదలకు 19 లక్షల ఇళ్లు నిర్మిస్తాం.. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ. అధికారంలోకి వచ్చాక మూడేళ్ల పాటు ఒక్క ఇల్లు కూడా పూర్తిచేయని ప్రభుత్వం ఈ ఏడాదిన్నరగా హడావుడి చేస్తున్నా పేదల లక్ష్యం నెరవేరడం లేదు. నాలుగున్నరేళ్లలో 5.61 లక్షల ఇళ్లు నిర్మించామని ప్రభుత్వం లెక్కలు చెబుతోంది. యూనిట్‌ ధర రూ.1.50 లక్షలుగా నిర్ణయించినా లబ్ధిదారులకు బిల్లులు సరిగా మంజూరు చేయకపోవడంతో 5.61 లక్షల ఇళ్లలో సగం అసంపూర్తిగానే మిగిలిపోయాయి. ఇది గమనించి.. ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు యూనిట్‌ ధర మరో రూ.50 వేలు పెంచుతున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఇళ్లు లేని పేదలకు కొత్తగా ఇళ్లు నిర్మిస్తామంటూ ఆశ చూపి.. ఉన్న గుడిసెలు, మట్టి మిద్దెలను తొలగించారు. నాలుగేళ్లు దాటినా వారికి సొంతింటి కల నెరవేరడం లేదు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సింగపూర్, మలేషియా, చైనా, బీజింగ్‌ తదితర దేశాల్లో చేపడుతున్న టెక్నాలజీని ఉపయోగించి ఇళ్ల నిర్మాణం చేపట్టి పేదల కల సాకారం చేస్తామని సీఎం చంద్రబాబు పెద్ద పెద్ద మాటలు చెప్పినా.. ఆచరణలో అమలు కావడం లేదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఇందిరమ్మ పథకం కింద రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 44.80 లక్షల ఇళ్లు మంజూరు చేసి.. 31.24 లక్షల ఇళ్లను పూర్తిచేశారు. మిగిలిన 13.56 లక్షల ఇళ్లకు టీడీపీ ప్రభుత్వం బిల్లులు నిలిపి వేయడంతో ఇంటి నిర్మాణాలు పూర్తిగా ఆగిపోయి ప్రస్తుతం అవి మొండి గోడలుగా దర్శనమిస్తున్నాయి. ఈ ప్రభుత్వంలో ఇల్లు కావాలనుకునే వారు.. మొదట జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరిగి వారికి అంతో ఇంతో సమర్పించుకోవాల్సిన పరిస్థితి. గృహ నిర్మాణాల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తున్నా నిర్మాణాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఇటీవల నిర్వహించిన పల్స్‌ సర్వేలో రాష్ట్రంలో ఇంకా 30.31 లక్షల మంది పేదలు గుడిసెల్లోనే నివాసం ఉంటున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. 

ప్రభుత్వం చెబుతున్న లెక్క ఇదీ..
ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో 2015–16లో 62,584 ఇళ్లు, 2016–17లో 47,851, 2017–18లో 2,76,763, 2018–19లో 1,73,833 ఇళ్లు నిర్మిం చినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇం దులో సగం ఇళ్లు కూడా పూర్తి కాలేదు. బిల్లుల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యం చేస్తుండటంతో ప్రభుత్వ తీరుపై పేదలు మండిపడుతున్నారు. 

వైఎస్సార్‌ హయాంలో..   
వైఎస్సార్‌ హయాంలో రాజకీయాలకు అతీతంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి పేదవాడికీ ఇళ్లు మంజూరు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చేపట్టిన పాదయాత్ర ద్వారా పేదల ఇబ్బందులను కళ్లారా చూసి అడిగిన వారందరికీ ఇంటి పట్టాలు ఇవ్వడంతో పాటు ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు మంజూరు చేశారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు పేదల గురించి ఆలోచించకపోవడంతో రోజూ ఎక్కడో ఒక ప్రాంతంలో ఇంటి పట్టా, ఇళ్ల కోసం కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట నిత్యం ఆందోళనలు జరిగేవి. వైఎస్‌ అధికారంలోకొచ్చాక అడిగిన ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టాలు, గృహ నిర్మాణ శాఖ ద్వారా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు. ఆయన హయాంలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 44.80 లక్షల ఇళ్లు మంజూరు చేయగా.. 31.24 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేసిన ఘనత ఆయనకే దక్కుతుంది.

పేదలంటే కనికరం లేని ప్రభుత్వమిది
మా ఆయన హనుమంతు ఏడాది కిందట మృతి చెందాడు. ఆయన జీవించి ఉన్న సమయంలో ఇంటి కోసం పలుమార్లు దరఖాస్తుచేశాడు. ఆయన మృతి చెందినా ఇంత వరకు ఇల్లు మాత్రం మంజూరు కాలేదు. సొంత ఇల్లు లేకపోవడంతో పెద్దల నాటి నుంచి వచ్చిన ఈ పూరి గుడిసెలోనే నలుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులతో కాలం వెళ్లదీస్తున్నాం. ఇక్కడ కూలి పనులు దొరక్కపోతే కడప జిల్లాకు వలస వెళ్లి జీవనం సాగిస్తున్నాం. ఇంటి కోసం మేము కూడా అధికారులు, నాయకుల చుట్టూ తిరిగినా ఎవరూ కనికరించడం లేదు. చిన్న గుడిసెలోనే ఏడుగురం సర్దుకుపోతున్నాం. పేదలంటే ఈ ప్రభుత్వానికి  కనికరం లేదు. 
 – కులుమాల రంగమ్మ, కోతికొండ గ్రామం, తుగ్గలి మండలం, కర్నూలు జిల్లా

వైఎస్‌ జగన్‌ భరోసాతో పేదల్లో ఆనందం
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్లీనరీలో గూడు లేని పేదల కోసం 25 లక్షల ఇళ్లు నిర్మిస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడంతో పేద కుటుంబాల్లో ఆశలు రేకెత్తాయి. ‘గ్రామాలకు వెళ్లి అందరికీ చెప్పండి.. అన్నొస్తున్నాడని, ప్రతి పేదవాడికీ ఇల్లు కట్టిస్తామని చెప్పండి’.. అంటూ వైఎస్సార్‌సీపీ శ్రేణులను గ్రామాలకు పంపి భరోసా ఇచ్చేలా ఆదేశించారు. దీంతో ఇన్నాళ్లూ గుడిసెల్లో నివాసం ఉంటున్న పేదల ముఖాల్లో ఆనందం కనిపిస్తోంది. మంజూరుచేసే ఇళ్లు కూడా చంద్రబాబు పాలనలాగా జన్మభూమి కమిటీల ద్వారా ఇవ్వబోమని, వైఎస్సార్‌ మాదిరి.. కులం, మతం, పార్టీ చూడకుండా శాచురేషన్‌ పద్ధతిలో ఇస్తామని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించడాన్ని పేదలు స్వాగతిస్తున్నారు. గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు లేని ప్రతి కుటుంబానికి రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షల వరకూ ప్రయోజనం.. ఇల్లు ఇచ్చే రోజునే ఆయా ఇళ్లల్లోని అక్కచెల్లెమ్మల పేరుతో రిజిస్ట్రేషన్,  ఎప్పుడైనా డబ్బు అవసరమైతే ఆ ఇంటి మీద బ్యాంకుల్లో రుణం వచ్చేట్టుగా మాట్లాడుతాం.. అన్న ప్రతిపక్ష నేత భరోసాతో పేదలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. ‘పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణం పేరిట ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ పేదలపై లక్షలాది రూపాయల భారం మోపుతోంది. ఒక్కో లబ్ధిదారుడిపై రూ.3.50 లక్షల మేర అప్పు మోపుతోంది. పేదవాడు ప్రతి నెలా  రూ.3 వేలు, 4 వేల దాకా 20 ఏళ్లపాటు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇల్లు ఇస్తే తీసుకోండి. మన ప్రభుత్వం రాగానే ఈ ప్రభుత్వం మోపిన అప్పును రద్దు చేస్తాం’ అని వైఎస్‌ జగన్‌ పేదలకు భరోసా ఇచ్చారు. దీంతో పట్టణాల్లోని నిరుపేదల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement