68వ రోజు
22–01–2018, సోమవారం
రెడ్డిగుంటబాడవ, చిత్తూరు జిల్లా
యాత్ర ప్రారంభించి నేటికి 68 రోజులైంది. ప్రతి రోజూ కరెంటు చార్జీలు, పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయని, ఇంటి పన్నులు షాక్ కొడుతున్నాయని, మద్యం ఏరులై పారుతోందని, లంచం లేనిదే మరుగుదొడ్లు కూడా ఇవ్వడంలేదని, రేషన్ షాపుల్లో బియ్యం తప్ప.. మరేవీ దొరకడం లేదని, పింఛన్లు రాలేదని, రైతులకు, పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు రుణమాఫీ కాలేదని, ఇళ్లు ఇవ్వలేదని, ఉద్యోగం లేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేదని, ఆరోగ్యశ్రీ వర్తించలేదని.. ఇలా చంద్రబాబుగారిచ్చిన ఏ ఒక్క హామీ నెరవేరక, తాము మోసపోయామని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కానీ, నిన్న టీడీపీ వర్క్‌షాపులో ముఖ్యమంత్రిగారి మాటలు చూస్తే, నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు.. అన్నట్లుంది.
ఎన్నికల హామీల్లో ఇక రెండే రెండు మిగిలి ఉన్నాయట. అన్న క్యాంటీన్‌లు, నిరుద్యోగ భృతి ఇస్తే.. ఇచ్చిన హామీలకు మించి వంద రెట్లు చేసినట్లట. ఇంతకన్నా హాస్యాస్పదం, పచ్చి అబద్ధం ఏమైనా ఉంటుందా? పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగడమంటే ఇదేనేమో! ప్రజలు గమనించడం లేదనుకుంటున్నారా? లేదా.. మీ మీడియా బలంతో ప్రజలను తప్పుదోవ పట్టించొచ్చని భావిస్తున్నారా? ముఖ్యమంత్రి వంటి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? మీ మోసపూరిత మాటలు, అభూత కల్పనలు, ఉత్తర కుమార ప్రగల్భాలు చూసి.. గతంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర పర్యటనకు వచ్చిన స్విట్జర్లాండ్ ఆర్థిక మంత్రి పాస్కల్ వేదిక మీదనే, మీ సమక్షంలోనే ‘మా దేశంలో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడితే.. జైల్లో అయినా పెడతారు. లేదా మెంటల్ ఆస్పత్రికైనా పంపుతారు’ అన్న మాటలు మర్చిపోయారా? మీరు మాట్లాడుతున్న మాటల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని తెలిసీ మాట్లాడుతున్నారంటే.. మిమ్మల్ని ఏమనుకోవాలి? మీకు ప్రజలు ఎలా కనబడుతున్నారు?
సత్యవేడు నియోజకవర్గం అనగానే నాన్నగారి కలల ప్రాజెక్టు శ్రీసిటీ గుర్తుకొచ్చింది. ఈ ప్రాంత వెనకబాటుతనాన్ని పారదోలాలని, అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలను ఇక్కడికి తెచ్చి స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలనే మహోన్నత ఆశయంతో దీనిని ప్రారంభించారు. కానీ నేడు ఉద్యోగ, ఉపాధి అవకాశాలలో స్థానికులకు అన్యాయం జరుగుతోంది. వేకెన్సీలున్నప్పటికీ.. క్వాలిఫికేషన్స్ ఉన్న మన పిల్లలకు ఉద్యోగాలు రాని పరిస్థితి. మరి అలాంటప్పుడు పరిశ్రమలకు భూములు ఎందుకివ్వాలి? మన పిల్లలకు ఉద్యోగాలివ్వకుండా.. మంచి భవిష్యత్తు చూపకపోవడం ధర్మమేనా?
పల్లమాలలో దళితుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ముఖ్యమంత్రిగారూ.. ఎస్సీల సంక్షేమం పట్ల మీకేమైనా చిత్తశుద్ధి ఉందా? మీ పాలనలో దళితులపై జరుగుతున్న దాడులు, పరిహారం తక్కువ ఇచ్చి అత్తగారి సొత్తులా భూములను లాక్కుంటున్న పద్ధతిని, దళితులను ఉద్దేశించి మీరు, మీ మంత్రులు మాట్లాడిన మాటలు, వ్యవహరించిన తీరు చూస్తే తెలుస్తోంది.. వారి పట్ల మీ దృక్పథమేంటో.
ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ప్రజలకు హామీలిచ్చి, మేనిఫెస్టోలో పొందుపర్చి, మాట తప్పి మోసం చేయడమే కాకుండా, చేసేశానని నిస్సిగ్గుగా బొంకుతూ దబాయిస్తుంటే.. మీ లాంటి వ్యక్తిని ఏమనుకోవాలి? కొద్దిగానైనా అపరాధభావం అనిపించదా?
Comments
Please login to add a commentAdd a comment