65 వ రోజు
18–01–2018, గురువారం
సదాశివపురం క్రాస్,
చిత్తూరు జిల్లా
ఉదయం శిబిరం నుంచి వెలుపలికి రాగానే ఆరోగ్యశ్రీ సేవలు అందని మరో విషాద గాథ తెలిసింది. కురుకాల్వకు చెందిన నాలుగేళ్ల చిన్నారి శశిని ఎత్తుకుని వచ్చారు వాళ్ల అమ్మా, నాన్నలు. వారిది చాలా పెద్ద బాధ. కంటికి సంబంధించిన క్యాన్సర్‌తో ఆ పాప బాధపడుతోందట. ఒక కన్ను పోయిందట. ఇప్పుడు రెండో కంటికి సోకిందని, దానికి సంబంధించిన వైద్యం హైదరాబాద్‌లో మాత్రమే ఉందని చెబితే.. ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకుని హైదరాబాద్‌కు వెళితే ‘ఇప్పుడు ఇది చెల్లదు.. డబ్బు కడితేనే వైద్యం’ అన్నారట. కూలి పనులకు వెళ్లే ఆ దంపతులు లక్షల రూపాయలు ఖర్చు చేయడం సాధ్యమా? తమకంటి వెలుగులాంటి బిడ్డకు కనుచూపు కరువైతే.. ఆ అమ్మానాన్నలు ఎంతగా కుమిలిపోతారో కదా? కళ్ల ముందే ఆ వ్యాధి ముదు రుతూ, ప్రాణాంతక మవుతూ ఉంటే.. ఆ తల్లిదండ్రుల పరి స్థితి వర్ణనాతీతం. హైదరా బాద్‌తో పాటు పొరుగు రాష్ట్రాలలో ఆరోగ్యశ్రీ సేవల ఆవశ్యకతను ఇలాంటి సంఘటనలే తెలియజేస్తున్నాయి.
కాస్త ముందుకు నడవగానే మునగలపాలెం వద్ద రోడ్డు పక్కన ఒక ఎత్తయిన స్తూపం కనిపించింది. చంద్ర బాబు అరాచక పాలనకు, తెలుగుదేశం నాయకుల దాష్టీకాలకు సాక్షీభూతం అది. ఇసుక మాఫియాపై పోరాడుతూ, న్యాయం కోసం పోలీసు ఉన్నతాధికారులను అర్థించడానికి ఏర్పేడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి, లారీ దుర్ఘటనలో అమరులైన 16 మంది ప్రజల మృతికి స్మారకం అది. ఆ దుర్ఘటనలో ఎన్నో కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయాయి. ఎంతోమంది క్షతగాత్రులయ్యారు. ఏ పనీ చేయలేక, సంపాదనలేక వారి కుటుంబాలు ఛిన్నాభిన్న మయ్యాయి. ఆ విషాద ఘటన తర్వాత బాధిత కుటుంబాలను నేను పరామర్శించే వరకూ ప్రభుత్వం స్పందించలేదంటే, పరిహారం ప్రకటించ లేదంటే, నిందితులపై చర్యలు తీసుకోలేదంటే.. ప్రభుత్వ ఉద్దేశమేంటో ప్రజలందరికీ అవగతమైంది. ఇప్పటికీ ఆ ఇసుక మాఫియా నిందితులు యథేచ్ఛగా బయట తిరగగలుగుతున్నారంటే.. వారికి ప్రభుత్వ అండదండలు ఎంతగా ఉన్నాయో తెలుస్తోంది.
తమ జీవనాధారమైన భూములను విమానాశ్రయాల విస్తరణ, పరిశ్రమల ఏర్పాటు కోసం వదులుకున్న నిరుపేదలైన రైతులు గ్రామగ్రామానా కలిసి వినతిపత్రాలు ఇచ్చారు. వారి ఇష్టంతో పనిలేకుండా.. లక్షల రూపాయల విలువచేసే భూములను తీసుకుని, నామమాత్రపు పరిహారం చెల్లించి చేతులు దులుపుకొన్నారు. పరిహారం కోసం టీడీపీ నాయకులు అధికారుల సహకారంతో అమాయకులైన పేదల భూముల రికార్డులను తారుమారు చేశారు. పేదల భూములు, మరికొన్ని అసైన్డ్ భూములకు సంబంధించి బినామీల పేర్లతో టీడీపీ నాయకులు కోట్లాది రూపాయల పరిహారాన్ని తీసుకోగా, ఇష్టం లేకపోయినా.. బలవంతంగా భూములు లాక్కోవడంతో పేదలు, మరీ ముఖ్యంగా అసైన్డ్ భూముల పేదలు కోర్టును ఆశ్రయించారు.
చివరిగా, ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న.. ఇసుక మాఫియా దురాగతాలపై ఎన్నో ఫిర్యాదులొచ్చినా, ఎన్నో ఆందోళనలు జరిగినా.. ఎందుకు స్పందించలేదు? ఒక్కదానిపై కూడా ఎందుకు కఠిన చర్యలు తీసుకోలేదు? తీసుకుని ఉంటే.. ఏర్పేడు లాంటి ఘటనలు జరిగేవి కాదుకదా. ఇసుక మాఫియాను అడ్డుకున్న అధికారులపై దౌర్జన్యాలు జరిగినా.. వాటిని తీవ్రంగా పరిగణించా ల్సిందిపోయి.. నిందితులనే వెనకేసుకురావడం దేనికి సంకేతం? మీరే ఇసుక మాఫియాను పెంచి పోషిస్తున్నారనడం వాస్తవం కాదా?
శశి తల్లిదండ్రులను ఓదారుస్తున్న వైఎస్ జగన్
Comments
Please login to add a commentAdd a comment