ఇలాంటి మండలిని కొనసాగించాలా? | YS Jagan Speech In AP Assembly Over Council Issue | Sakshi
Sakshi News home page

మండలి పరిణామాలు బాధించాయి : సీఎం జగన్‌

Published Thu, Jan 23 2020 5:49 PM | Last Updated on Thu, Jan 23 2020 7:22 PM

YS Jagan Speech In AP Assembly Over Council Issue - Sakshi

సాక్షి, అమరావతి : రాజకీయ ఎజెండాతో నడుస్తూ.. ప్రజలకు మేలు చేసే విధంగా లేని శాసనమండలిని కొనసాగించాలా లేదా అన్నదానిపై సీరియస్‌గా ఆలోచన చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సలహాలు, సూచనలు ఇవ్వాడానికే శాసనమండలి ఏర్పడిందని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తే.. మండలిలోని సభ్యులు మాత్రం మేలు జరగకూడదని చూస్తున్నారని మండిపడ్డారు. మండలిలో నిన్న జరిగిన పరిణామాలు బాధించాయని ఆవేదన వ్యక్తం చేశారు. మండలి కోసం ఏడాదికి రూ. 60 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు చెప్పారు. రాజ్యాంగంలో క్యాపిటల్‌ అనే పదం లేదని.. రాష్ట్రంలో ఎక్కడ కూర్చొని అయినా పాలన సాగించవచ్చని తెలిపారు.  శాసనమండలిలో బుధవారం చోటుచేసుకున్న పరిణామాలపై నేడు అసెంబ్లీలో చర్చ జరిగింది. 

ఈ సందర్బంగా సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ..  2019 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 175 స్థానాలకు గాను 151 చోట్ల వైఎస్సార్‌సీపీ విజయం సాధించింది. ప్రజల మాటే వేదంగా తాము శాసనసభలో అడుగుపెట్టాం. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం తమ ప్రభుత్వం ఏర్పడింది. ఏడున్నర నెలలుగా ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తున్నాం. చట్టాలు చేయడానికే శాసనసభ ఉంది. అవినీతికి అడ్డుకట్ట వేయడానికి మా అధికారం ఉపయోగించాం. మేము పాలకులం కాదని సేవకులమని చెబుతున్నాం.. ఈ రోజుకు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నాం.

ప్రజాస్వామ్య విలువలు లేకుండా చేశారు.. 
చట్టసభల్లో భాగమైనా మండలి చట్టబద్ధంగా వ్యవహరిస్తోందని నమ్మాం.. కానీ నిన్న జరిగిన పరిణామాలు దానిని ఒమ్ము చేశాయి. నిష్పాక్షికంగా మండలి నిర్వహించే పరిస్థితి లేదు.. గ్యాలరీలో కూర్చొని చంద్రబాబు ఇచ్చిన ఆదేశాలు చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. శాసనసభ పంపిన వికేంద్రీకరణ బిల్లుపై మండలిలో చర్చించి ఆమోదించవచ్చు, లేకపోతే తిరస్కరించవచ్చు.. అదికాకపోతే సవరణలు కోరుతూ తిప్పి పంపవచ్చు . చట్టం కూడా ఇదే చెబుతోంది.. కానీ వాటిని లెక్కచేయకుండా విచక్షణ అధికారం అంటూ కౌన్సిల్‌ చైర్మన్‌ నిన్న బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపారు. నిబంధనలకు విరుద్ధంగా చైర్మన్‌ నిర్ణయం తీసుకుని.. ప్రజాస్వామ్యానికి విలువ కూడా లేకుండా చేశార’ని అన్నారు.

అలాగే మండలిలో చైర్మన్‌ మాట్లాడిన వీడియోను సభలో ప్రదర్శించారు. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘ నిబంధనల ప్రకారం బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపే అధికారం తనకు లేదని చైర్మన్‌ చెప్పారు. బిల్లు పెట్టిన 12 గంటల్లోపే సవరణలు ఇవ్వాలని కూడా తెలిపారు. సెలక్ట్‌ కమిటీకి పంపాలంటే .. బిల్లు పెట్టినప్పుడే ప్రతిపాదనలు చేయాలని కూడా చైర్మన్‌ చెప్పారు. మళ్లీ ఆయనే రూల్స్‌ను అతిక్రమించి బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపించారు. బిల్లును సెలక్ట్‌ కమిటీకి పంపకూడదనే మంత్రుల వాదనతో బీజేపీ, పీడీఎఫ్‌, వామపక్ష సభ్యులు ఏకీభవించారు. కానీ సెలక్ట్‌ కమిటీకి పంపే అధికారం లేకున్నా.. తనుకున్న విచక్షణ అధికారంతో నిర్ణయం తీసుకున్నాని చైర్మన్‌ అన్నారు. చట్టాన్ని ఉల్లఘించేందుకే విచక్షణ అధికారాన్ని వాడానని చైర్మన్‌ స్వయంగా అంగీకరించారు. చంద్రబాబు గ్యాలరీలో కూర్చొని ఇచ్చిన ఆదేశాలను చైర్మన్‌ పాటించారు. 

6 రాష్ట్రాలకు మాత్రమే మండలిలు ఉన్నాయి..
మండలి ప్రజల కోసం నడుస్తోందా.. రాజకీయ నిరుద్యోగల కోసం నడుస్తోందా అన్న ఆలోచన చేయాలి.  చైర్మన్‌ తీసుకున్న నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?. విడిపోయిన ఆర్థిక లోటులో ఉన్న రాష్ట్రానికి  శాసన మండలి అవసరమా అన్న ఆలోచన జరగాలి. మండలి కోసం ఏడాదికి రూ. 60 కోట్ల ఖర్చు పెడుతున్నాం.  దేశంలో 28 రాష్ట్రాలు ఉంటే.. కేవలం 6 రాష్ట్రాల్లో మాత్రమే మండలిలు ఉన్నాయి. 22 రాష్ట్రాల్లో మండలిలు లేనే లేవు. ఓవైపు చంద్రబాబు తప్పు జరిగిందని చెబతున్నారు.. మరోవైపు చంద్రబాబు పూల దండలు వేయించుకుంటున్నారు. దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేస్తోంది. 

రాజ్యాంగంలో క్యాపిటల్‌ అనే పదం లేదు. అభివృద్ది కోసం వికేంద్రీకరణ చేయొచ్చు. రాష్ట్రంలో ఎక్కడ కూర్చొని అయినా పాలన సాగించవచ్చు. దివంగత జయలలిత ఊటీ నుంచి పాలన సాగించారు. ఆర్టికల్‌ 174 ప్రకారం ఎక్కడి నుంచి అయినా చట్టాలు చేయొచ్చు.  మండలి అన్నది ప్రభుత్వానికి సూచనలు, సలహాలు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది. కానీ అక్కడ సలహాలు, సూచనలు పక్కనబెట్టి ప్రజలకు మేలు జరిగే బిల్లులను ఎలా ఆలస్యం చేయాలో ఆలోచిస్తున్నారు. ఇంగ్లిష్‌ మీడియం బిల్లును అడ్డుకుంటారు. ఇంగ్లిష్‌ మీడియం బిల్లును అడ్డుకున్నవాళ్ల పిల్లలందరు ఇంగ్లిష్‌లోనే చదువుతున్నాదు. ఇలాంటి మండలిని కొనసాంగించాలా? వద్దా? అనేదానిపై సీరియస్‌గా చర్చ జరగాలి’ అని అన్నారు. ఈ అంశంపై సోమవారం చర్చించుదామని స్పీకర్‌ను కోరారు. 

శాసనసభ సోమవారానికి వాయిదా.. 
సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం అనంతరం మాట్లాడిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. శాసనమండలికి సంబంధించి సోమవారం సభలో చర్చించడానికి అనుమతిచ్చారు. అలాగే శాసనసభను సోమవారానికి వాయిదా వేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement