రాయదుర్గం బహిరంగ సభలో వైఎస్ జగన్
సాక్షి, రాయదుర్గం : ‘చంద్రబాబు ఐదేళ్ల దుర్మార్గ పాలనలో మీరు పడ్డ కష్టాలను నా పాదయాత్రతో స్వయంగా చూశాను.. మీ బాధలను విన్నాను. ఇవన్నీ వినీ మీకు ఓ మాట ఇస్తున్నాను.. నేనున్నానని. ప్రతి పేదవాడికి నేను అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాను’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సమస్యల పరిష్కారానికి మనం నవరత్నాలను ప్రకటించుకున్నామని, ఈ నవరత్నాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని.. ‘చంద్రబాబు ఇచ్చే డబ్బులతో మోసపోవద్దు.. 20 రోజులు ఓపిక పట్టి అన్నకు ఒకసారి అవకాశం ఇద్దాం. అన్నను సీఎం చేసుకుందాం.. మన సమస్యలను పరిష్కరించుకుందాం’ అని ప్రతి అక్కకు.. ప్రతి అవ్వకు.. ప్రతి తాతాకు చెప్పండి’ అని వైఎస్ జగన్ కార్యకర్తలను కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సోమవారం అనంతపురం జిల్లా రాయదుర్గం బహిరంగ సభలో ప్రసంగించారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే..
మీ అందరి ఉత్సాహం చూస్తుంటే...
‘ఇక్కడికి వచ్చిన మీ అందరి ఉత్సాహం చూస్తుంటే నాకో సన్నివేశం గుర్తుకు వస్తుంది. బ్రిటీష్ సామ్రాజ్యం అంతరించిపోతుందని, రేపటి నుంచి మన సొంత పరిపాలన ప్రారంభమవుతుందని అప్పటి ప్రజల్లో ఉన్న ఉత్సాహం నాకు ఇప్పుడు మీలో కనిపిస్తోంది. రాయదుర్గంలోని మీ ఉత్సహం చూస్తుంటే మరో 20 రోజుల్లో మన పాలన ప్రారంభంకాబోతుందనే ధీమా కలుగుతోంది. ఐదేళ్ల చంద్రబాబు పాలన చూశారు.. ఈ ఐదేళ్లలో ఆయన చేసిన మోసాలు, అన్యాయాలు మనమంతా చూశాం. ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి మళ్లీ అబద్ధాలు చెప్పడం మొదలు పెట్టారు. ఈ రాష్ట్ర ప్రజలకు భద్రతకు తాను భరోసా ఇస్తాడట. చంద్రబాబు నాయుడిని నిలదీస్తు అడుగుతున్నా.. 2014 ఎన్నికల తర్వాత ప్రమాణం చేస్తూ ఆయన కొన్ని సంతకాలు చేశారు.
భవిష్యత్తుకు భరోసా అయితే ఇలా చేసేవాడా?
ఆ సంతకాలేంటంటే.. రైతుల రుణాలు మాఫీ చేస్తానన్నారు.. అయ్యాయా అని అడుగుతున్నా? డ్వాక్రా మహిళల రుణమాఫీ అని రెండో సంతకం చేశారు.. చేనేత కార్మీకుల రుణాలు.. ప్రతిగ్రామానికి మినరల్ వాటర్, బెల్ట్ షాపుల రద్దని ఇలా సంతకాలు చేశారు. ఐదేళ్ల పాలన తర్వాత నేను అడుగుతున్న వీటిలో ఏ ఒక్కటి అయినా చేశాడా?. ఇలాంటి చంద్రబాబు ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇస్తాడట. ప్రజల భవిష్యత్తు భరోసా ఇచ్చేవాడే అయితే ప్రత్యేక హోదా తాకట్టు పెట్టేవాడా? రూ. 20 కోట్లతో ఫిరాయింపులకు పాల్పడేవాడా? కమిషన్ల కోసం కక్కుర్తి పడి కేంద్ర ప్రభుత్వం పొలవరం ప్రాజెక్ట్ కడతానంటే.. నేనే కడుతానని లాక్కునేవాడా? ఇసుక దగ్గర నుంచి మట్టి, బొగ్గు, కరెంట్ కొనుగోలు దాకా, విశాఖ భూములు, దళితుల భూములు గుడి భూములు దోచేవాడా? అని అడుగుతున్నా. పేదల గురించే ఆలోచించేవాడైతే 108 పరిస్థితి ఇంత దారుణంగా ఉండేదా? 108 కొడితే కుయ్ కుయ్ అనే అంబులేన్స్ వస్తుందా? ఆరోగ్యశ్రీ నీరుగార్చేవాడా? పిల్లల చదువుల కోసం అప్పులు చేసే పరిస్థితి ఉండేదా? విద్యాలయాలు, ఆరోగ్య కేంద్రాలు బినామీల పరం చేసేవాడా? నారాయణ స్కూల్ మాత్రమే నడిచేలా ప్రభుత్వ స్కూళ్లను మూసివేసేవాడా? ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి వ్యక్తిగత వివరాలు, చివరకు మహిళల నెంబర్లు జన్మభూమి కమిటీలకు ఇచ్చేవాడా? అని అడుగుతున్నా.
నేను విన్నాను.. నేను చూశాను.. నేను ఉన్నాను..
ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం.. ఇవ్వలేకపోతే రెండువేల రూపాయలు ఇస్తానన్నాడు. ఇదా భరోసా ఇవ్వడం అంటే? మోసం చేయాలనే ఆరాటంతో ఓ మేనిఫెస్టో.. ఎన్నికల ప్రణాళికా అని విడుదల చేశారు. ఏయే కులాన్ని ఎలా మోసం చేయాలో అలా చేశాడు. ఇంతటి దారుణమైన పాలన మధ్య నా పాదయాత్ర సాగింది. అక్షరాల 3,648 కిలోమీటర్లు ఆ దేవుడి దయతో, మీ అందరి చల్లని దీవెనలతో పూర్తి చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రతి మూల, అంగుళం తిరుగుతూ మీ కష్టాలు చూశాను. ప్రతి కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యను విన్నాను. చంద్రబాబు చేతిలో మోసపోయి.. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న ప్రతి కుటుంబానికి ఓ మాట ఇవ్వదల్చుకున్నా. మీ సమస్యలను నేను విన్నాను. మీ సమస్యలను నేను చూశాను.. మీ అందరికి నేను ఉన్నాను. అని మాట ఇస్తున్నాను. ఎస్సీ, ఎస్టీలు, బీసీ పేదల ఆవేదన చూశాను. వారు పడుతున్న బాధలు విన్నాను. ఫీజు రీయింబర్స్‌మెంట్ రాకా.. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితిని నా పాదయాత్రలో చూశాను. 108 రాకా.. ఆరోగ్యశ్రీ సరిగ్గా అమలు కాకా బాధపడ్డ కుటుంబాల సమస్యల విన్నాను. దీర్ఘకాలికి వ్యాధులతో బాధపడుతున్నవారి గాధలు కూడా విన్నాను. మద్యం షాపులు రద్దు చేస్తానని మొదటి సంతకం పెట్టి.. ప్రతి గ్రామంలో మూడు, నాలుగు బెల్ట్ షాప్‌లు నడుపుతుంటే వాటి బారిన పడి బాధపడుతున్న అక్కాచెల్లేమ్మలు చెప్పిన మాటలు విన్నాను.
ప్రభుత్వ ఉద్యోగాలు ఖాలీగా ఉన్నా.. నోటీపికేషన్ ఇవ్వని ప్రభుత్వాన్ని నిరుద్యోగ యువకులు తిట్టిన మాటలు విన్నాను. చదువుకున్న ఉద్యోగాలు రాకా పక్క రాష్ట్రాలకు వెళ్తున్నా నిరుద్యోగులను చూశాను. ఇవన్నీ చూశాను.. ఇవన్నీ విన్నాను.. ఇవన్నీ వినీ మీకు మాట ఇస్తున్నాను.. నేనున్నానని. నవరత్నాలతో ప్రతి ఒక్కరి సమస్య తీరుతుందని మనం ప్రకటించాం. ఆ నవరత్నాలను ప్రతి ఒక్కరి ఇంటికి తీసుకెళ్లండి. అన్యాయంగా దోచుకున్న డబ్బును చంద్రబాబు మీ ఇంటికి పంపిస్తాడు. మీ ఊరిలో ప్రతి ఒక్కరి దగ్గరకు వెళ్లి.. చంద్రబాబు ఇచ్చే రూ.3వేలతో మోసపోవద్దు అక్కా.. 20 రోజులు ఓపిక పట్టండి.. అన్న ముఖ్యమంత్రి అవుతాడు.. అన్న సీఎం అయిన తర్వాత పిల్లలకు పాఠశాలకు పంపించే ప్రతి ఒక్కరికి రూ.15 వేలు ఇస్తాడని చెప్పండి. 20 రోజులు ఓపిక పట్టా అక్కా.. అన్నను సీఎం చేసుకుందాం. ఎన్ని లక్షలు ఖర్చైనా అన్న చదివిస్తాడని చెప్పండి. ఐదేళ్లు చంద్రబాబును నమ్మాం. అన్ని విషయాల్లో మోసం చేశాడు. ఒక్కసారి అన్నకు అవకాశం ఇద్దాం. అన్నను సీఎం చేద్దాం. ఆ తర్వాత ప్రతి రైతన్నకు రూ. 12500 చేతుల్లో పెడ్తాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల వద్దకు వెళ్లి చంద్రబాబు.. ఇచ్చే డబ్బులతో మోసపోకండి.. అన్న సీఎం అయిన తర్వాత చేయూత ద్వారా రూ.75 వేలు ఇస్తాడని చెప్పండి. పొదుపు సంఘాల రుణాలన్నీ మాఫీ చేస్తాడని చెప్పండి.
ధర్మానికి, అధర్మానికి యుద్దం..
ప్రతి అవ్వ, తాతా దగ్గరకు వెళ్లండి.. అవ్వా రెండు నెలల కింద మీ పెన్షన్ ఎంత వచ్చేదని అడగండి.. ఆ అవ్వతాతలు పెన్షన్ రాలేదని, లేకుంటే వెయ్యి అని చెబుతారు. అప్పుడు.. ఎన్నికలు రాకుంటే చంద్రబాబు నాయుడు ఇచ్చేవాడా? అని అడగండి. అన్న ముఖ్యమంత్రి అయినా తర్వాత పెన్షన్ రూ. 3 వేలిస్తాడని చెప్పండి. ఇవ్వాల యుద్దం చేస్తున్నది ఒక్క చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు.. ఆంధ్రజ్యోతిలతో కూడా చేస్తున్నాం. వీళ్లంతా ఇంకా 20 రోజుల్లో ఎన్నో డ్రామాలు చేస్తారు. ఇలాంటి ఎన్నో అన్యాయాల మధ్య.. ధర్మానికి, అధర్మానికి యుద్దం జరుగుతోందని మరిచిపోవద్దు. రాయదుర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాపు రాంచంద్రారెడ్డి, అనంతపురం ఎంపీ అభ్యర్థి తలారి రంగయ్యకు మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు కావాలి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే మీ ఓటు వేయండి. వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించండి’ అని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment