
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఖరారు అయింది. ఈ నెల 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నట్లు రాజభవన్ వర్గాలు అధికారికంగా ప్రకటన చేశాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు గవర్నర్ కార్యదర్శి సురేంద్ర మోహన్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. కాగా అంతకు ముందు వైఎస్ జగన్ రాజభవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. గవర్నర్ ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించినందుకు ఆయనకు అభినందనలు తెలిపారు. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా వైఎస్ జగన్ బృందం...గవర్నర్‌కు వినతిపత్రం అందించారు.
మరోవైపు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకార వేదికను అధికారులు పరిశీలించారు. కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ గౌతమ్ సవాంగ్, విజయవాడ సీపీ ద్వారక తిరుమలరావు, జీఏడీ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, మున్సిపల్ కమిషనర్ రామారావు తదితరులు స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ.. ప్రమాణ స్వీకారానికి వచ్చేవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. స్టేడియంతో పాటు నగరంలోని వివిధ కూడళ్లలో ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేస్తున్నామని, అన్ని శాఖలను సమన్వయం చేసుకుంటూ ప్రమాణ స్వీకార ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.