వైఎస్‌ జగన్‌ చెప్పిన ‘ఎమ్మెల్యే’ కథ | YS Jagan Tells MLA Story In PrajaSankalpaYatra | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ చెప్పిన ‘ఎమ్మెల్యే’ కథ

Published Fri, Jun 1 2018 6:54 PM | Last Updated on Thu, Jul 26 2018 7:14 PM

YS Jagan Tells MLA Story In PrajaSankalpaYatra - Sakshi

సాక్షి, పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : రాష్ట్రంలో ఎన్నికలు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రోజకో కొత్త సినిమాలు, కథలు, నాటకాలు ప్రజలకు చూపిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మండిపడ్డారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శుక్రవారం ఆయన పాలకొల్లులో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు నాలుగేళ్లుగా చంద్రబాబు పాలనలో పడుతున్న అష్టకష్టాలను చిన్నపాటి కథ రూపంలో అద్భుతంగా వివరించారు. ఆ కథ మీకోసం..

‘చంద్రబాబు మోసాలకు, అబద్దాలకు ఓ పేదవాడి కుటుంబం ఎంతగా కుదేలైందో చెబుతాను. అనగనగనగా ఒక ఎమ్మెల్యే ఉండేవాడు. అతని ఇంట్లో అర్థరాత్రి పెద్ద చప్పుడైంది. దీంతో ఎమ్మెల్యే, మిగిలిన ఇంట్లో వారందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇల్లాంతా గాలించారు. చివరకు ఆ ఇంటి వంట గదిలో బిక్కబిక్కుమంటూ ఓ వ్యక్తి కనిపించాడు. ఆ ఎమ్మెల్యేకు ఆ వ్యక్తి బాగా తెలిసినవాడు. అతని పేరు నరసయ్య.

ఏంటి నరసయ్యా నువ్వు దొంగవా?. దొంగతనానికి వచ్చావా? అని ఎమ్మెల్యే ప్రశ్నించాడు. అందుకు నరసయ్యా నిజమే అయ్యా నేను దొంగనే. ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉంది. బియ్యం కోసం మీ ఇంటికి దొంగతనానికి వచ్చానయ్యా అని అన్నాడు. ఎమ్మెల్యే నరసయ్యను చూసి నీకు చదువుకున్న కొడుకు ఉన్నాడు కదా? అతను తిండి పెట్టడం లేదా? అని ప్రశ్నించాడు.

ఆ ఉన్నాడయ్యా నా కొడుకు ఇంజనీరింగ్‌ చదివాడయ్యా. ప్రస్తుతం పరిపాలన చేస్తున్నోళ్లు ఫీజులు సరిగా కట్టడం లేదయ్యా. దాంతో నాకు మూడేళ్లలో మూడు లక్షలు అప్పు అయింది. అది తీర్చేందుకు ఉన్న నాలుగు ఎకరాల్లో ఒక ఎకరం అమ్మాను అని చెప్పాడు. ఆ పొలాలపై చేస్తానన్న రుణమాఫీ కూడా జరగలేదయ్యా అని చెప్పాడు. బ్యాంకులో బంగారు రుణాలు కూడా మాఫీ చేస్తానని అన్నారు. అదీ చేయలేదయ్యా.  

దాంతో ఆ వడ్డీలు, అప్పు తీర్చడానికి మిగిలిన పొలం కూడా అమ్మాను. మిగిలిన ఒక ఎకరంలో పెట్టుబడి పెట్టడానికి ప్రైవేటు వ్యక్తులను నుంచి అప్పు తీసుకున్నాను. ఇక ఏం ఉందయ్యా పంటలు వేసుకున్నాం. పంట చేతికి రాలేదు. దీంతో చివరగా ఉన్న ఎకరా కూడా అప్పుల వాళ్లకు రాసి ఇచ్చాను అని అ‍న్నాడు. సరే చదివించిన కొడుకు ఉద్యోగం చేయడం లేదా? అని ఎమ్మెల్యే అడిగాడు.

ఉద్యోగమా సద్యోగమా ఏదీ రాలేదయ్యా అన్నాడు నరసయ్య. నిరుద్యోగులకు ప్రభుత్వం భృతి రెండు వేలు ఇస్తానని చెప్పిందయ్యా. ఆ రెండు వేల కోసం ఎదురుచూసి చూసి మా వాడి కళ్లు కాయలుకాచాయని చెప్పాడు. చివరకు మళ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చేసరికి వెయ్యి ఇస్తామని ఇప్పుడు అంటున్నారని అన్నాడు.

మరి నీ పెద్ద కొడుకు ఏమయ్యాడు అని ఎమ్మెల్యే అడిగాడు. గత ప్రభుత్వం ఇల్లు కట్టుకోవడానికి అనుమతి ఇచ్చింది. దాంతో గోడలు కట్టుకున్నాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం నిధులు ఇవ్వలేదు. వర్షాలకు కట్టుకున్న గోడలు కూడా పాడయ్యాయి. దాంతో పూరిగుడిసెకు వెళ్లాం. అక్కడ నా పెద్ద కొడుకు ఓ అలవాటు చేసుకున్నాడయ్యా. నా ఇంటి ముందు, ఊరి మధ్యలో, ఊరి చివర్లో మూడు మందు షాపులు పెట్టారు. దాంతో నా కొడుకు మందుకు బానిసయ్యాడు. రోజు తాగి వస్తాడయ్యా. వాడితో రోజూ గొడవ పడాల్సివస్తోంది.

సరే నరసయ్యా నీకు భార్య ఉంది కదా? ఆమె కూలీకి వెళ్లడం లేదా?. అయ్యా నా భార్య పోయి ఏడాది అయ్యిందయ్యా. అప్పుడు ఎమ్మెల్యే అన్నాడు. వయసు అయిపోయిన వారు చనిపోక ఉంటారా? అని అన్నాడు. అయ్యా అమ్మగారి కన్నా నా భార్యది చిన్నవయసే అయ్యా అన్నాడు నరసయ్య. ఇల్లు గడవకపోతుండటంతో కూలీ పనులు మొదలు పెట్టిందయ్యా. ఓ రోజు ఉన్నట్లుండి కుప్పకూలిపోయిందయ్యా. ఆస్పత్రికి తీసుకెళ్దామని చెప్పి 108కి ఫోన్‌ చేశాను అయ్యా. ఒకదానికి ఫోన్‌ చేస్తే డీజిల్‌ లేదు. మరొకటి డ్రైవర్లు స్ట్రైక్‌ అన్నారయ్యా అని చెప్పాడు. చివరకు ఆటోలో ఆసుపత్రికి తీసుకెళ్లాను.

క్యాన్సర్‌ అని తేలడంతో వైద్యం కోసం ఆరోగ్య శ్రీ కార్డు తీసుకుని తిరిగితే రెండుసార్లు కీమోథెరపీ చేశారయ్యా. ఆ తర్వాత చేయడం కుదరదన్నారయ్యా. ఎందుకని అడిగితే లిమిట్‌ అయిపోయిందయ్యా అని చెప్పారు. 8 సార్లు కనీసం కీమోథెరపీ చేయిస్తే తప్ప క్యాన్సర్‌ నయం కాదని చెప్పారు. దాంతో నా దగ్గర అమ్మడానికి ఏమీ లేదు. నా భార్య నా కళ్ల ముందే పోయిందయ్యా అని నరసయ్య కన్నీరు పెట్టుకున్నాడు.

ఎమ్మెల్యే అన్నాడు నీకు తెల్లకార్డు ఉంది కదా? తినడానికి బియ్యం వస్తాయి కదా? అని అడిగాడు నరసయ్యను. రేషన్‌ షాపులకు బియ్యం కోసం పోతే వేలిముద్రలు పడటం లేదని, కంప్యూటర్‌ పని చేయడం లేదని, వచ్చే నెల ఇస్తాం అని చెబుతున్నారయ్యా. ఇంతకు ముందైతే ఇదే రేషన్‌ షాపుకు పోతే కిరోసిన్‌, పప్పులు, ఉప్పులు ఇలా 9 రకాల వస్తువులు ఇచ్చేవారయ్యా.

దీంతో కోపం తెచ్చుకున్న ఎమ్మెల్యే నువ్వు రాజకీయాలు మాట్లాడుతున్నావ్‌ నరసయ్య అన్నాడు. పోలీసులను పిలిచి దొంగతనానికి వచ్చావని చెబుతా అని బెదిరించాడు. అవునయ్యా నా దురదృష్టం లోకంలో ఉన్న అన్ని కష్టాలు నాకే వచ్చాయి. అందుకే దొంగతనానికి వచ్చాను. మరి నీ వెనుక ఓ ఫోటో పెట్టుకుని ఉన్నావు. మరి ఆయన దొంగ కాదా? అని నరసయ్య అన్నాడు.

ఆ మాట అంటూ నాకు రుణమాఫీ కాలేదు. మా ఆవిడకు డ్వాక్రా రుణమాఫీ కాలేదయ్యా. నా కొడుక్కు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాలేదయ్యా. నెల నెలా రూ. 2 వేలు ఇవ్వలేదయ్యా. బెల్టు షాపులకు నా కొడుకు బానిసయ్యాడయ్యా. నా ఇల్లు మధ్యలోనే ఆగిపోయిందయ్యా. నా భార్యను ఆసుప్రతికి తీసుకెళ్దామంటే 108 పని చేయలేదయ్యా. ఆరోగ్యశ్రీ కాపాడలేదండయ్యా. ఒక పేదవాడికి ఇంత కన్నా మోసం, అన్యాయం చేసే వ్యక్తి ఎవరైనా ఉంటారయ్యా అన్నాడు నరసయ్య.

మాట ఇచ్చి మోసం చేసిన ఈ వ్యక్తి మీద కేసులు ఉండవా? అని అడిగాడు. ఆయ్యా మీ లాంటి వాళ్లను కొనడానికి కోట్లు ఇచ్చి కెమెరాలతో అడ్డంగా దొరికిపోయినా వాళ్లకు శిక్షలు ఉండవా? అని ప్రశ్నించాడు. లక్షల కోట్లు అవినీతి చేస్తే కేసులు ఉండవా? అన్నాడు. అయ్యా ఇదేమీ మాయదారి లోకం అయ్యా.. ఇన్ని మోసాలు చేసినా కేసులు ఉండవా అని నరసయ్య అంటే అప్పుడు ఆ కథను విన్న అక్కడికి చేరుకున్న గ్రామస్థులు అందరూ ఎమ్మెల్యేకు నాలుగు చివాట్లు పెట్టి పంపారు. గత నాలుగేళ్లుగా చంద్రబాబు హయాంలో పేదవాడు ఎంతటి దారుణంగా కూనరిల్లిపోతున్నాడో చెప్పడానికి ఈ నరసయ్యే కథే ఉదాహరణ.’ అని వైఎస్‌ జగన్‌ కథను ముగించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement