చేయగలిగిందే చెబుతా.. | Ys jagan's praja sankalpa yatra in east godavari district | Sakshi
Sakshi News home page

చేయగలిగిందే చెబుతా..

Published Sun, Jul 29 2018 3:25 AM | Last Updated on Mon, Jul 30 2018 2:16 PM

Ys jagan's praja sankalpa yatra in east godavari district - Sakshi

ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేటలో జరిగిన బహిరంగ సభకు హాజరైన అశేష జనవాహినిలో ఓ భాగం. (ఇన్‌సెట్‌లో) ప్రసంగిస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ఎన్నికలకు ముందు కొత్తగా ఈ ఏడాది 19 లక్షల ఇళ్లు కడుతున్నట్లు చెబుతున్నారు. ‘ఈనాడు’ పేపరులో కథనాలు కనిపిస్తున్నాయి. ప్రజలందరూ సంతోషంగా ఉండబోతున్నారని కథ. కనీసం ఊరికి 10 ఇళ్లు కూడా కట్టని ఈ మనిషి 19 లక్షల ఇళ్లు కడుతున్నారని చెబుతాడు. దానిని ‘ఈనాడు’లో పతాక శీర్షికలో పెడతారు.

చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను.. మోసాలు చేయలేను.. చేయగలిగిందే చెబుతాను.. చేయలేనిది చెప్పను.. నేను ఇచ్చిన మాట మీద నిలబడతా.. – ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌

ఈ పెద్దమనిషి చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ఒక్కటంటే ఒక్కటైనా మంచి పని జరిగిందా? అవినీతి, అక్రమాలు, అరాచకాలు, జన్మభూమి కమిటీల మాఫియా, రాజ్యాంగానికి తూట్లు పొడిచే పాలన సాగుతోంది. ఇసుక, మట్టి మొదలు దేన్నీ వదిలి పెట్టడం లేదు. అవినీతి సొమ్ముతో రూ.20 కోట్లు, రూ.30 కోట్లు పెట్టి వేరే పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తూ రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఇవన్నీ ఇదే నియోజకవర్గంలో చూస్తున్నాం.

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘చంద్రబాబులా అబద్ధాలు చెప్పలేను.. మోసాలు చేయలేను.. చేయగలిగిందే చెబుతాను.. చేయలేనిది చెప్పను..’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. రిజర్వేషన్‌ కల్పిస్తానని కాపులను చంద్రబాబు మోసం చేశారని, తాము అధికారంలోకి రాగానే కాపు కార్పొరేషన్‌కు చంద్రబాబు కన్నా రెట్టింపు నిధులు ఇస్తానని భరోసా ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం 222వ రోజు తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జరిగిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.

చంద్రబాబుది దద్దమ్మపాలన అని నిప్పులు చెరిగారు. బాబు నాలుగున్నర ఏళ్ల పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరన్నారు. చంద్రబాబు ఇటీవల కాలంలో కొత్త సినిమా మొదలు పెట్టారని, దానిపేరు.. ‘ఎన్నికలకు ఆరు నెలల ముందు.. నాలుగు నెలల కోసం’ అని ధ్వజమెత్తారు. జగ్గంపేట నియోజకవర్గాన్ని తాను మరువలేనని, యాదృచ్చికమే అయినా ఇది పాదయాత్ర సాగుతున్న 100వ నియోజకవర్గమన్నారు. ఈ నియోజకవర్గంలోనే తన పాదయాత్ర 2600 కిలోమీటర్ల మైలురాయిని అధిగమించిందని, ఈ నియోజకవర్గంలోనే తమ పార్టీ ఆవిర్భవించిందని గుర్తు చేశారు. ఈ సభలో జగన్‌ ఇంకా ఏమన్నారంటే..

కాపు సోదరులకు నా వినతి   
‘‘ఇదే నియోజకవర్గంలో కాపు సోదరులు ఉన్నారు. నా ఎదుట ప్లకార్డులు పట్టుకుని నిల్చొని ఉన్నారు. పక్కనే కిర్లంపూడి కనిపిస్తోంది. అక్కడే ముద్రగడ పద్మనాభం గారు కనిపిస్తారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేయాలని అడిగితే జరిగిందేమిటి? పలానాది చేస్తాను.. అని చెప్పిన మాటను ఎందుకు చేయడం లేదని ముద్రగడ పద్మనాభం చంద్రబాబును నిలదీసినందుకు ఇదే ముద్రగడ గారికి జరిగిందేమిటి? ఇదే ముద్రగడ పద్మనాభం గారిని నిర్బంధించారు. నేరుగా పోలీసులను ఇంటికి పంపించారు.

ఇంట్లో ఆడవాళ్లని కూడా చూడకుండా దౌర్జన్యం చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు పాలనలో చూశాం. నువ్వు చెప్పిందే కదా మేము అడుగుతున్నానని చెప్పినా చంద్రబాబు ముద్రగడ పద్మనాభం గారిని అవమానించారు. ఎన్నికలకు ముందు ప్రతి కులానికి ఒక పేజీని కేటాయిస్తూ ఎన్నికల ప్రణాళికను విడుదల చేశాడు. తాను చెయ్యలేనని, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనిది కాదని తెలిసి కూడా ప్రతి కులానికీ ఒక హామీ ఇచ్చాడు చంద్రబాబు.

బోయలను ఎస్టీలుగా చేస్తానన్నారు, మత్స్యకారులను ఎస్టీలుగా చేస్తానన్నాడు, రజకులను ఎస్సీలుగా చేస్తానన్నాడు. ఇదే పెద్దమనిషి కాపులను బీసీలుగా చేస్తానని ఎన్నికల ప్రణాళికలో హామీ ఇచ్చారు. ఈ నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలలో ఏం చేశారో మీరు చూశారు.. మీకు ఎలాంటి నాయకుడు కావాలో గుండెల మీద చెయ్యి వేసుకుని ఆలోచించమని కోరుతున్నాను. అబద్ధాలు చెప్పే వాళ్లు.. మోసం చేసే వాళ్లు నాయకుడిగా కావాలా? ఇక్కడ ప్లకార్డులు పట్టుకుని ఉన్న కాపు సోదరులకు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నా.  

పోలవరంను అవినీతిమయం చేసిన చంద్రబాబును ఏమనాలి?  
జగ్గంపేట నియోజకవర్గంలో 2,600 కిలోమీటర్ల మైలు రాయిని చేరుకున్నాం. ఇందుకు గుర్తుగా మొక్కను కూడా నాటాను. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గ ప్రజలు.. అన్నా మేమంతా నీకు తోడుగా ఉన్నామంటూ అండగా నిలిచారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇదే నియోజకవర్గంలోనే పుట్టింది. నాలుగేళ్ల చంద్రబాబు నాయుడి పాలనలో ఇక్కడ ప్రజలు పడుతున్న బాధలు చూస్తుంటే నిజంగా చాలా బాధనిపిస్తోంది. మీలో ఎవరైనా సంతోషంగా ఉన్నారా? ఈ నియోజకవర్గంలో రైతులు నన్ను కలిసి ఏమి చెప్పారంటే.. ఈ ప్రాంతంలోని జగ్గంపేట, కిర్లంపూడి, గొల్లప్రోలు, పిఠాపురం, ఏలేశ్వరం, ప్రత్తిపాడు మండలాల్లో రైతులకు ఏలేరు రిజర్వాయర్‌ ఆధారం. ఏలేశ్వరం రిజర్వాయర్‌ కింద 67 వేల ఎకరాలు సాగు కావాల్సి ఉండగా 50 వేల ఎకరాలకు కూడా నీరందని పరిస్థితి.

నాన్నగారి హయాంలో 2009 ఫిబ్రవరిలో రూ.138 కోట్లతో ఆధునికీకరణ పనులు పనులు ప్రారంభిస్తే ఆయన వెళ్లిపోయాక ఈ నాలుగేళ్లలో 40 శాతం పనులు కూడా పూర్తి కాలేదని రైతులు చెబుతున్నారు. సకాలంలో పోలవరం పనులు పూర్తి చేయకపోవడం వల్ల విశాఖపట్నంలో పారిశ్రామిక అవసరాలకు భారీగా ఏలేరు నీటిని తరలిస్తున్నారు. అదే పోలవరం పనులు పూర్తి చేసి ఉంటే ఈ నీటిని తరలించాల్సిన అవసరం ఉండేది కాదు. దాంతోపాటు ఈ ప్రాంత సాగునీటి అవసరాలు తీరి ఉండేవి. బాబు పాలనలో పోలవరం ప్రాజెక్టు పనులు పునాదుల స్థాయిని కూడా దాటలేదు. పోలవరం ప్రాజెక్టు ఎంతో అవసరం అని తెలిసి కూడా పూర్తి చేయకపోగా పూర్తిగా అవినీతి మయం చేసి నత్తనడకన పనులు చేస్తున్న ఈ చంద్రబాబును ఏమనాలి? నాన్నగారు ఇక్కడి రైతుల మేలు కోసం పుష్కర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి 13 ఎత్తిపోతల పథకాల ద్వారా జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించారు.

రాజానగరం, రాజమహేంద్రవరం , అనపర్తి, జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం, పెద్దాపురం, తుని నియోజకవర్గాలలో రైతులు ఆనందంగా ఉన్నారంటే అది వైఎస్‌ రాజశేఖరరెడ్డి కృషి ఫలితమేనని చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. ఇదే నియోజకవర్గంలోని ముసురుమిల్లి ప్రాజెక్టు ద్వారా గోకవరం మండలంలో సుమారు 5 వేల ఎకరాలకు వైఎస్సార్‌ పెట్టిన 13 లిఫ్టులే కాకుండా మరొక లిఫ్ట్‌ పెట్టాలని దానివల్ల గుండేపల్లి, రామయపాలెం, కే గోపాలపురం తదితర గ్రామాలకు సాగు నీరు అందుతుందని చెప్పినా చంద్రబాబు గత నాలుగున్నర ఏళ్లలో పట్టించుకోవట్లేదు. కనీసం ఒక్క లిఫ్ట్‌ కూడా ఏర్పాటు చేయలేని దద్దమ్మ పరిపాలన ఇది.

చంద్రబాబునాయుడు ఎక్కడ? ఆ దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎక్కడ? గోకవరం మండలంలోని మల్లవరం, తిరుమలాయపాలెం తదితర గ్రామాలకు ఏలేరు నుంచి పంపుల ద్వారా నీటిని అందిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారన్నా.. ఇవ్వాల్టికీ పట్టించుకోవడం లేదన్నా.. అని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు. చంద్రబాబు ఎక్కడ? వైఎస్‌ ఎక్కడ? వీరిని పోల్చిచూసినప్పుడు నక్కకు నాగ లోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుందని చెబుతున్నారు. చంద్రబాబు.. వ్యవసాయానికి పగలు 9 గంటల విద్యుత్‌ ఇస్తామని ఎన్నికలకు ముందు చెప్పి ఆ తర్వాత ఇవ్వకపోవడంతో గత ఏడాది గండేపల్లి రైతులు విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ ముందు ధర్నా చేశారు.  

ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా?
రైతన్నలు అష్టకష్టాలు పడి పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదు. ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.1550 ఉంటే రైతులకు రూ.1130 కూడా రావడం లేదు. ఇదే నియోజకవర్గంలో చెరకు రైతులదీ ఇదే పరిస్థితి. కర్రపెండలం సాగు చేస్తున్న రైతులకు గతేడాది పుట్టికి అంటే 225 కిలోలకు రూ.1600 ధర వస్తే ఈ ఏడాది మాత్రం రూ.1000, రూ.1100కు కూడా అమ్ముకోలేని పరిస్థితి. చంద్రబాబు పాలనలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాదు. ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి హెరిటేజ్‌ ఫ్రెష్‌ అని షాపులున్నాయి. రైతుల నుంచి తక్కువ ధరలకు పంటలను కొనుగోలు చేసి నాలుగైదు రెట్లు ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు.

దళారులను కట్టడి చేయాల్సిన ముఖ్యమంత్రే దళారిగా మారిపోయి లాభాలను పిండుకుంటుంటే రైతులకు గిట్టుబాటు ధరలు ఎలా వస్తాయి? ఈ నియోజకవర్గంలో దాదాపు 90 చెరువుల నుంచి మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారన్నా అని ఇక్కడ ప్రజలు చెబుతున్నారు. చెరువుల్లో మట్టిని తవ్వి ప్రభుత్వం నుంచి రూ.9 కోట్లు బిల్లులు తీసుకున్నారు. మరోపక్క ఆ మట్టిని అమ్ముకుంటున్నారు. చెరువులను తాటిచెట్టు లోతున ఎవరైనా తవ్వుతారా? అని రైతులు అడుగుతున్నారు.

ఈ నియోజకవర్గంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి గారి హయంలో 18,600 ఇళ్లు కట్టిస్తే చంద్రబాబు.. ఊరికి కనీసం పది ఇళ్లను కూడా నిర్మించని అధ్వానపు పాలన. జగ్గంపేటలో కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాన్ని ఏరియా ఆస్పత్రిగా మారుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి పట్టించుకోలేదు. ఇక్కడి ఆస్పత్రిలో ఇప్పుడు 30 పడకలు ఉండాల్సి ఉంటే కేవలం 15 మాత్రమే ఉన్నాయి. నాన్నగారి హయాంలో జగ్గంపేట డిగ్రీ కళాశాల ఇస్తే నాలుగున్నరేళ్లుగా భవనాలు కూడా నిర్మించలేకపోయారు. మరి అభివృద్ధి ఎక్కడ?  

అంతటా అన్యాయమే..

ఈ నాలుగేళ్ల పాలనలో అబద్ధాలు, మోసం, అన్యాయం, అవినీతి, రాజ్యాంగానికి తూట్లు, అధిక ధరలతో ప్రజల్ని బాద డం. అందుకే ఈ రాజకీయ వ్యవస్థ బాగుపడాలని చెబుతున్నా. మోసం చేసే వారిని, అబద్ధాలు చెప్పే వారిని ఈ వ్యవస్థ నుంచి బయటకు పంపించాలి. అది ఒక్క జగన్‌ వల్లే సాధ్యం కాదు. జగన్‌కు మీ అందరి తోడు, ఆశీస్సులు కావాలి.  పొరపాటున చంద్రబాబును క్షమిస్తే.. రేపు మీ వద్దకు వచ్చి మైకు పట్టుకుని.. ఎన్నికల ప్రణాళికలో తాను చెప్పినవన్నీ 98 శాతం పూర్తి చేశానని మీ చెవ్వుల్లో క్యాలీఫ్లవర్‌ పెడతారు. కేజీ బంగారం, బోనస్‌గా బెంజి కారు ఇస్తానంటాడు.

దాన్నీ మీరు నమ్మరని.. ప్రతి ఇంటికి సాధికార మిత్రలను పంపించి ప్రతి చేతిలో రూ.3 వేలు పెడతారు. వద్దు అనకండి. రూ.5 వేలు కావాలని అడగండి. ఆ డబ్బంతా మనదే. మనజేబుల్లో నుంచి దోచేసిన సొమ్మే. కానీ మీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేయండి. అబద్ధాలు చెప్పేవారిని, మోసం చేసేవారిని బంగాళాఖాతంలో కలిపే పరిస్థితి రావాలి. రేపు మనందరి ప్రభుత్వం రాగానే నవరత్నాలతో పేదలందరినీ ఆదుకుంటాం.   మన ప్రభుత్వంలో అవ్వాతాతల పింఛన్‌ వయసును 65 నుంచి 60 ఏళ్లకే తగ్గించడమే కాక పింఛన్‌ నెలకు రూ.2 వేలకు పెంచుతా. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పింఛన్‌ ఇచ్చి ఆదుకుంటాం’’ అని జగన్‌ అన్నారు.  

నేను మాట ఇస్తే అదే మాట మీద నిలబడతా. చేయగలిగింది మాత్రమే చెబుతా. చేయలేనిది చేస్తానని చెప్పే అలవాటు నాకు లేదని ఇక్కడ కాపు సోదరులు అందరికీ చెబుతున్నా. కొన్ని అంశాలు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంటాయి. మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలు ఉంటాయి. అటువంటిదే ఈ రిజర్వేషన్ల అంశం. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న సుప్రీంకోర్టు జడ్జిమెంట్‌ ఉన్న పరిస్థితుల్లో ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేని అంశాలు.

ఇది నేను చేయగలిగిన అంశం కాదు కాబట్టి నేను ఇది చేయలేకపోతున్నానని మీ అందరికీ కూడా ఏమాత్రం మొహమాటం లేకుండా చెబుతున్నాను. మొట్టమొదటిగా కాపులకు అన్యాయం జరిగిందని స్వరం వినిపించిందీ, చెప్పిందీ ఎవరైనా ఉంటే అది జగన్‌ అని చెప్పడానికి వెనుకాడను. ఇదే కాపు సోదరులకు నేను మాట ఇస్తున్నా.. చంద్రబాబు నాయుడు కాపు సోదరులకు కాపు కార్పొరేషన్‌కు ఏడాదికి రూ.వెయ్యి కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.5000 కోట్లు ఇస్తానని చెప్పి మోసం చేశారు. నేను ఆ నిధుల్ని రెట్టింపు చేసి ఇస్తా.. అని మాట ఇస్తున్నా. ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నది కాబట్టి ప్రతి కాపు సోదరుడికి తోడుగా ఉంటానని చెబుతున్నా.

చంద్రబాబు కొత్త సినిమా..
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు మరో కొత్త సినిమాకు తెరతీశారు. ఆ సినిమా పేరు ‘ఎన్నికలకు 6 నెలల ముందు 4 నెలల కోసం’. ఈ కొత్త సినిమాలో ఆయన డ్రామాలు ఎలా ఉన్నాయంటే.. ఎన్నికలకు ముందు రూ.87,612 కోట్ల రైతుల రుణాలను బేషరతుగా మాఫీ చేస్తానని హామీ ఇచ్చాడు. బ్యాంకుల్లో కుదువ పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నాడు. చంద్రబాబు సీఎం అయ్యి నాలుగున్నరేళ్లు అయింది. చివరికి ఆయన చేసిన రుణమాఫీ పథకం రైతుల రుణంపై వడ్డీలకు కూడా సరిపోని విధంగా మారింది. ఇలా మోసం చేసిన చంద్రబాబుకు వంతపాడే ఎల్లోమీడియా సిగ్గు లేకుండా మొత్తం రుణమాఫీ అయ్యిందని, ఇది దేశంలో కనీవినీ ఎరుగనిదని, ఇతర రాష్ట్రాల వారు కూడా ఇక్కడకు అధ్యయనం చేయడానికి వస్తున్నారని చెబుతోంది.

పొదుపు సంఘాల మహిళలకు ఒక్క రూపాయి కూడా రుణం మాఫీ కాలేదు. కానీ ఎన్నికలకు ఆరు నెలల ముందు.. నాలుగు నెలలకోసం పొదుపు సంఘాల రుణాలు మాఫీ చేశామని చెబుతున్నారు. అందుకు పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబుకు సన్మానాలు కూడా చేశారని ఎల్లో మీడియా రాయడం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. ఇంటింటికీ ఉద్యోగం లేదా ఉపాధి అన్నాడు. ఈ రెండూ లేదంటే రూ.2 వేలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నాడు.

ఇప్పుడు ఎన్నికల వేళ.. రాష్ట్రంలో 1.70 కోట్ల కుటుంబాలు ఉండగా కేవలం 10 లక్షల మందికి మాత్రమే అదీ రూ.2 వేలు కాకుండా కేవలం రూ.వెయ్యి మాత్రమే భృతి ఇస్తామని చెబుతున్నారు. ఈ లెక్కన 50 నెలల కాలానికి నెలకు రూ.2 వేలు చొప్పున ప్రతి ఇంటికి చంద్రబాబు రూ.లక్ష చొప్పున బాకీ ఉన్నాడు. ఇవాళ గ్రామాల్లో మినరల్‌ వాటర్‌  ప్లాంట్లు ఉన్నాయో లేదో కానీ మద్యం షాపులు మాత్రం అడగడుగునా కనిపిస్తాయి. ఇప్పుడు నాలుగు నెలల కోసం చంద్రబాబు మద్యం షాపులపై ఉక్కుపాదం మోపుతాడని, మద్యం లేకుండా చేయాలని ఆలోచిస్తున్నాడని ఈనాడులో రాస్తారు.

ఎన్నికలొస్తున్నాయని..
మరో ఆరు నెలల్లో తనను పదవి నుంచి తప్పించి పంపిస్తారని తెలుసుకొని హోంగార్డులకు, వీఆర్‌ఏలకు, అంగన్వాడీలకు, ఆశావర్కర్లకు జీతాలు పెంచామని చెబుతున్నారు. ఆ పెంచేది కూడా మానవత్వం లేదు. కనీసం తెలంగాణ ప్రభుత్వం పెంచేలా కూడా లేదు. అదీ ఈ నాలుగు నెలల కోసమే చేస్తాడట. తర్వాత ఎలాగూ జగన్‌ అంతకన్నా ఎక్కువ చేస్తానన్నారని చేస్తున్నాడు. నాలుగేళ్లుగా బీజేపీతో సంసారం చేసినప్పుడు ఈ పెద్దమనిషికి ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదు. ఎన్నికల కోసం బీజేపీ నుంచి విడిపోయాక ప్రత్యేక హోదా కోసం తానే పోరాటం చేస్తున్నానని ఫోజులిస్తున్నాడు. ఉద్యోగులకు పదో పీఆర్సీ ఇవ్వలేదు. ఉద్యోగులకు మూడు డీఏ బకాయిలు, సీపీఎస్‌ రద్దు చేయాలన్నా పట్టించుకోడు. ఉద్యోగ సంఘాలను పిలిపించుకొని సన్మానాలు చేయించుకొని ఏదో చేస్తున్నట్లు ప్రచారం చేసుకుంటున్నాడు.

నాలుగేళ్లుగా అమరావతి.. అమరావతి.. అని మనకు భ్రమరావతిని చూపిస్తున్నాడు. శాశ్వత నిర్మాణం పేరిట ఒక్క ఇటుక కూడా వేయలేదు. అలాంటి సీఎం ఎన్నికలకు ముందు ఈనాడు దినపత్రికలో మనకు అమరావతి గురించి బాహుబలి సెట్టింగులు, సింగపూర్, జపాన్‌లోని బిల్డింగ్‌లు కనిపిస్తాయి. అదిగో బుల్లెట్‌ ట్రైన్, ఇదిగో మెట్రో రైలు, ఇదిగో మైక్రోసాఫ్టŠట్‌ హైపర్‌లూప్‌ అంటాడు. కానీ ఏదీ లేదు. ఈ నాలుగేళ్లలో అమరావతి రాజసం ఏ స్థాయిలో ఉందంటే.. ఉద్యోగులు వారు పనిచేసే స్థలానికి 15 నిమిషాల్లో నడచుకుంటూ వెళ్లిపోతారట. అంతటితో సీన్‌ కట్‌చేస్తే ఇంటర్వెల్‌. తర్వాత ఈనాడులో వార్తలు చూస్తే ఆశ్చర్యం వేసింది. ఆస్పత్రులను అత్యుత్తమ ఆస్పత్రులుగా మారుస్తారట. పక్కనే జగ్గంపేట ఆస్పత్రి కనిపిస్తుంది. కనీసం ఎక్స్‌రే యంత్రం కూడా లేదు. అంబులెన్సులు 2 కూడా లేవు.

ఆస్పత్రిలోకి పోతే చంటిపిల్లలను ఎలుకలు కొరుకుతూ కనిపిస్తాయి. జనరేటర్లు లేక సెల్‌ ఫోన్ల వెలుతురులో ఆపరేషన్లు చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చారు. కేన్సర్‌ చికిత్స కోసం  రోగి హైదరాబాద్‌కు వెళ్తే అక్కడ ఆరోగ్య శ్రీ ఇవ్వరట. ఏదైనా పెద్దరోగమొస్తే ఆరోగ్య శ్రీ కింద వైద్యం దొరకని పరిస్థితి. ఇవన్నీ పట్టించుకోని ఈ పెద్దమనిషి.. ఎన్నికలకు ఆరు నెలల  ముందు నాలుగు నెలల కోసం ఆస్పత్రులను బాగా బాగుపరుస్తారట. పెట్రోలు, డీజిల్, ఆర్టీసీ బస్సు చార్జీలు, నీటిపన్నులు, కరెంటు చార్జీలు బాదుడే బాదుడు. పిల్లలను బడికి పంపిస్తే ఫీజుల బాదుడు. ప్రభుత్వ పాఠశాలలకు ఏప్రిల్‌లో రావలసిన పాఠ్యపుస్తకాలు జూలై వచ్చినా 20 శాతం కూడా ఇవ్వలేదు. యూనిఫాంలు కూడా లేవు. ఇలా చేసి పిల్లలను నారాయణ, చైతన్య స్కూళ్లకు పంపించేలా చేస్తాడు. ఆ స్కూళ్లన్నీ చంద్రబాబు బినామీయే. ఆ స్కూళ్లలో ఫీజులు బాదుడే బాదుడు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement