బాబు ప్రోద్బలంతోనే జగన్‌ హత్యకు కుట్ర | YSR Congress Leaders Fires On Chandrababu about Murder Attempt On YS Jagan | Sakshi
Sakshi News home page

బాబు ప్రోద్బలంతోనే జగన్‌ హత్యకు కుట్ర

Published Wed, Oct 31 2018 4:04 AM | Last Updated on Wed, Oct 31 2018 7:51 AM

YSR Congress Leaders Fires On Chandrababu about Murder Attempt On YS Jagan - Sakshi

మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ విజయసాయిరెడ్డి. చిత్రంలో ఎంపీ వేమిరెడ్డి, మాజీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి, వరప్రసాద్, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి, సీనియర్‌ నేతలు బొత్స, బాలశౌరి

సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం పూర్తిగా సీఎం చంద్రబాబు ప్రోద్భలంతోనే జరిగిందని వైఎస్సార్‌ సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ఓ పథకం ప్రకారం క్రిమినల్‌ కేసులున్న వ్యక్తికి ‘ఎన్‌వోసీ’ ఇప్పించి విశాఖ విమానాశ్రయంలో టీడీపీ నేత హర్షవర్ధన్‌ నిర్వహిస్తున్న క్యాంటీన్‌లో నియమించారన్నారు. ఆర్నెళ్లపాటు పథక రచన చేసి జగన్‌ రాకపోకలపై పూర్తి నిఘా వేసి విశాఖ విమానాశ్రయంలో హత్యకు కుట్ర చేశారని ఆరోపించారు. దీని వెనుక సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్, డీజీపీ, టీడీపీ నేత హర్షవర్ధన్, గతంలో చంద్రబాబుతో పని చేసిన రిటైర్డ్‌ పోలీస్‌ అధికారి, విదేశాలకు పారిపోయిన సినీబ్రోకర్‌ శివాజీ ఉన్నారని చెప్పారు. హత్యాయత్నం ఘటన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు డీజీపీ మీడియాతో మాట్లాడుతూ ఇదంతా పబ్లిసిటీ కోసమే చేశారంటూ మునుపెన్నడూ లేనివిధంగా నిందితుడి సామాజిక వర్గాన్ని ప్రస్తావించడం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. జగన్‌పై హత్యాయత్నం వెనుక కుట్ర, టీడీపీ పాత్రపై మంగళవారం ఢిల్లీలో ‘చార్జిషీట్‌’ విడుదల చేసిన అనంతరం వైఎస్సార్‌ సీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, బాలశౌరి ఈ సమావేశంలో పాల్గొన్నారు. 

ఆర్నెళ్లుగా కుట్ర చేశారు
‘పాదయాత్రలో ప్రతిపక్ష నేత జగన్‌కు భద్రత ఉంటుంది. కానీ విమానాశ్రయంలో ఎవరూ ఉండరన్న విషయాన్ని గమనించి ఆర్నెళ్లుగా పక్కా పథకం ప్రకారం ఈ కుట్ర చేశారు. సీఎం చంద్రబాబు ప్రోద్బలంతోనే ఈ కుట్ర జరిగింది. చంద్రబాబు, నారా లోకేష్, డీజీపీ, టీడీపీ నేత హర్షవర్ధన్, చంద్రబాబుతో గతంలో పనిచేసిన రిటైర్డ్‌ పోలీసు అధికారి, విదేశాలకు పారిపోయిన సినిమా బ్రోకర్‌ శివాజీ కనుసన్నల్లోనే ఈ కుట్ర జరిగింది. ఈ కుట్ర నుంచి జగన్‌ క్షేమంగా బయటపడడంతో చంద్రబాబు కేసును నీరుగార్చే ప్రయత్నం ప్రారంభించారు. జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే అని రిమాండ్‌ రిపోర్టులో తేలినా దీని వెనక ఉన్న అసలు సూత్రధారుల గురించి  ప్రస్తావించకపోవడం ఏమిటి? టీడీపీ సర్కారుపై మాకు నమ్మకం లేదు. అయితే రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని మేం చెప్పలేదు. పోలీసు వ్యవస్థను నడిస్తున్న డీజేపీ చంద్రబాబుకు అనుకూలంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం విచారిస్తే నిజాలు బయటకురావు. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ చేయించాలని కోరుతున్నాం.

అలిపిరి దాడి భువనేశ్వరి చేయించారంటే ఒప్పుకుంటారా?
చంద్రబాబు తన ఎమ్మెల్సీతో అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడిస్తున్నారు. వైఎస్‌ జగన్‌పై ఆయన కుటుంబ సభ్యులే హత్యాయత్నం చేశారని ఆరోపణలు చేయిస్తున్నారు. అలా అయితే అలిపిరిలో చంద్రబాబుపై దాడి చేసింది మావోయిస్టులు కాదు.. ఆయన సతీమణి భువనేశ్వరి చేయించారని ఎవరైనా అంటే ఒప్పుకుంటారా? అలాంటి నీచమైన వ్యాఖ్యలు చేయాల్సిన ఖర్మ మాకు లేదు. మేం ఆ స్థాయికి దిగజారి మాట్లాడలేం. చంద్రబాబు కుటుంబ సభ్యులపై ఆరోపణలు చేయాల్సిన అవసరం మాకు లేదు. చంద్రబాబు తన నోరు, తన మనుషులను అదుపులో పెట్టుకోవాలని హెచ్చరిస్తున్నా.’ 
– విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి

అన్నమే తింటున్నారా?
‘టీడీపీ నేతలు వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నంపై నీచమైన ఆరోపణలు చేస్తున్నారు. జగన్‌ కుటుంబ సభ్యులే ఈ దాడి చేయించారని అంటున్నారు. ఇలా మాట్లాడుతున్న వారంతా అన్నమే తింటున్నారా? జగన్‌పై ఆరోపణలు చేసినవారంతా పదవుల కోసం అలాగే చేస్తారేమో? చంద్రబాబు చరిత్ర ఏమిటో ప్రజలకు తెలుసు. నిందితుడు కేవలం పబ్లిసిటీ కోసమే జగన్‌పై హత్యాయత్నం చేశాడని డీజీపీ అనడం దారుణం. ఆయన ప్రకటన విచారణను నీరుగార్చేలా ఉంది.  చంద్రబాబు ఇదంతా డ్రామా అని మాట్లాడారు. కత్తి కేవలం 0.5 సెం.మీ. దిగిందని చెబుతున్నారు. విమానాశ్రయంలో ఆపరేషన్‌ థియేటర్లు ఉంటాయా? కత్తి ఎంత లోతు దిగిందో స్పష్టంగా చెప్పడానికి? కేసును పక్కదారి పట్టించేందుకే ఇలా మాట్లాడుతున్నారు. జగన్‌పై జరిగింది హత్యాయత్నమే అని రిమాండ్‌ రిపోర్టులో తేలింది. నిందితుడు శ్రీనివాసరావుపై గతంలోనే క్రిమినల్‌ కేసు నమోదైంది. క్రిమినల్‌ కేసు ఉన్న వ్యక్తికి విమానాశ్రయంలో పనిచేసేందుకు ఎలా ఎన్‌వోసీ ఇచ్చారు? ప్రభుత్వ పెద్దల అండతోనే టీడీపీ నేత హర్షవర్ధన్‌కు చెందిన క్యాంటీన్‌లో నిందితుడికి ఉద్యోగం ఇప్పించారు.’
– వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ

సంస్కారం లేని వ్యక్తి చంద్రబాబు
ప్రతిపక్ష నేతపై దాడి జరిగితే పరామర్శించి ఘటనను ఖండించాల్సింది పోయి దుష్ప్రచారం చేస్తున్న సీఎం చంద్రబాబుకు అసలు రాజకీయ సంస్కారం ఉందా? టీడీపీ నేతలు రౌడీల్లా జగన్‌ను హత్య చేయించాలనుకుంటే భారీ స్థాయిలో ప్లాన్‌ చేస్తామని అనడం, జగన్‌ను ఖైమా కొట్టిస్తామని మాట్లాడడం దిగజారుడుతనానికి నిదర్శనం. జగన్‌పై ఆయన కుటుంబ సభ్యులే హత్యాయత్నం చేయించారని అనడానికి టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌కు మనసెలా వచ్చింది? అధికారం కోసం ఎంత నీచ స్థాయికైనా దిగజారే మనస్తత్వం చంద్రబాబుది. దేశంలోనే ధనిక ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు పాలన, ఆయన తీరు చూస్తే అది అర్థమవుతుంది.’ 
– వరప్రసాదరావు, వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ

కేంద్ర సంస్థల దర్యాప్తుతోనే వెలుగులోకి సూత్రధారులు 
జగన్‌పై హత్యాయత్నం ఘటనపై ఏర్పాటైన ‘సిట్‌’ కేవలం పాత్రధారులను మాత్రమే విచారిస్తోంది. అసలు సూత్రధారులను పట్టించుకోవడం లేదు. ఈ కుట్రకు పాల్పడిందెవరు? దీని వెనుక ఎవరున్నారో బయటకు రావాలి. అది సిట్‌తో సాధ్యం కాదు. కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణతోనే నిజాలు బయటకు వస్తాయి. టీడీపీ నేతలు మాపై నిందలు వేస్తున్నారు. ఎవరి పాత్ర ఏమిటో వెలుగులోకి రావాలంటే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలి.’ 
– మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ మాజీ ఎంపీ

అక్కడే చికిత్స చేస్తే ఏదైనా జరగొచ్చు..!
ప్రతిపక్ష నేత జగన్‌పై హత్యాయత్నం అనంతరం చికిత్స కోసం హైదరాబాద్‌ ఎందుకు వెళ్లారని ఈ సందర్భంగా వైఎస్సార్‌ సీపీ నేతలను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. విమానాశ్రయంలో ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖలోనే వైద్యం కోసం వెళితే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చికిత్స జరుగతుంది కాబట్టి జగన్‌కు ఏదైనా జరగవచ్చని విజయసాయిరెడ్డి బదులిచ్చారు. నిందితుడు ఉపయోగించిన కత్తికి విషం లేదని తేలిందని, అదే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జగన్‌కు చికిత్స చేస్తే నిజంగా విషం ఎక్కిస్తారనే అనుమానంతో హైదరాబాద్‌  వెళ్లాల్సి వచ్చిందన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం విమానాశ్రయంలోని వైద్యులు కూడా సర్జరీ చేస్తే సరిపోతుందని చెప్పారని, హైదరాబాద్‌లో మెరుగైన వైద్యం అందుతుంది కాబట్టి వెళ్లినట్టు వైవీ సుబ్బారెడ్డి వివరించారు. జగన్‌పై హత్యాయత్నం జరిగింది కాబట్టి పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆందోళనలో ఉంటారని, తదుపరి ఎలాంటి తీవ్ర ఘటనలకు తావివ్వకూడదనే ఉద్దేశంతోనే జగన్‌ హైదరాబాద్‌ వెళ్లినట్టు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. జగన్‌ చికిత్స కోసం హైదరాబాద్‌ వెళ్లడాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదని బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement