సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రసంగాలను వింటున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తదితరులు
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో జరిగిన చర్చలో పలువురు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు గత ఐదేళ్ల ప్రభుత్వ పాలనపై నిప్పులు చెరిగారు. గత ఐదేళ్లలో అవినీతి, అరాచకం మినహా చెప్పుకోదగిందేదీ లేదని మండిపడ్డారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ఐదు కోట్ల మంది ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలంటూ టీడీపీ నేతలకు హితవు పలికారు. లేదంటే ఇప్పుడున్న 23 స్థానాలు 13కు పడిపోవడం ఖాయమని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడి నెల తిరక్కుండానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వరుసగా హామీల అమలుకు శ్రీకారం చుట్టి రికార్డు సృష్టిస్తున్నారన్నారు.
– సాక్షి, అమరావతి
రాస్కో, చూస్కో అన్నవాళ్లు కనుమరుగు
పోలవరం ప్రాజెక్టును 2019 నాటికి పూర్తి చేసి నీళ్లిస్తాం.. రాస్కో, చూస్కో అని దూషించిన వారిలో ఒక్క అచ్చెన్నాయుడు మినహా మిగతా వారంతా కనుమరుగయ్యారు. ఈయన సంగతి కూడా వచ్చే ఎన్నికల్లో చూస్తాం. బెల్ట్‌షాపుల రద్దంటూ చంద్రబాబు తొలి సంతకం చేస్తే దాన్ని అమలు చేసే బాధ్యతను మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెత్తికెత్తుకున్నారు. ప్రజలు ఈ ఎన్నికల్లో 40 ఏళ్ల ఇండస్ట్రీ, దేశ రాజకీయాల్లోనే సీనియర్, చక్రాలు గిరగిరా తిప్పాననే చంద్రబాబు లాంటి వ్యక్తి ఊహకు అందని తీర్పునిచ్చారు. టీడీపీ మనుగడ ప్రమాదంలో పడిన ఈ దశలోనైనా సద్విమర్శలు చేయండి. చీమలు పెట్టిన పుట్టలో తాచుపాము చేరినట్టు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో బాబు చేరి ఆక్రమించుకున్నారు. గుర్రానికి ముందు పచ్చగడ్డి కట్టి పరిగెత్తించినట్టుగా చంద్రబాబు ఐదేళ్ల పాలన సాగింది. అందుకే 23 సీట్లు వచ్చాయి. మీ తీరు మారకపోతే అవి కాస్తా 13 అవుతాయి. జగన్ చెప్పింది చేస్తారు. పిన్న వయస్కుడైన జగన్ 151 మందితో ముఖ్యమంత్రి అయితే 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి 23 మందితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. జగన్ తన మంత్రివర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 60 శాతం మందికి చోటు కల్పించి రికార్డు సృష్టించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేశానని, తమ రికార్డును బద్దలు కొట్టలేరని కొందరు టీడీపీ సభ్యులు చెబుతున్నారు. దాన్ని బద్దలు చేయడానికి జగన్ సిద్ధంగా ఉన్నారు. ఐదేళ్లలో చంద్రబాబు పోలవరం సహా ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా? 15 రోజుల ప్రభుత్వంపై కువిమర్శలు మాని సద్విమర్శలు చేయండి.
– అంబటి రాంబాబు, ఎమ్మెల్యే, సత్తెనపల్లి
ఇంతకంటే మాకేం కావాలి?
ముఖ్యమంత్రి జగనన్నను చూసి గర్వపడుతున్నా. ఎంతో మంది బలహీన వర్గాలకు చెందిన వారిని శాసనసభ్యులను చేసి ఈ సభలో కూర్చోబెట్టారు. ఉప ముఖ్యమంత్రులను చేశారు. స్పీకర్‌ను చేశారు. ఇంతకంటే ఏం కావాలి? జగనన్న కేబినెట్‌ను జాతి మొత్తం చూస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ.. ఇలా అందరికీ ప్రాధాన్యత నిచ్చి సామాజిక న్యాయమంటే ఏంటో అందరికీ చూపించారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ అని చెప్పిన ముఖ్యమంత్రి జగనన్నే. ఈ రోజు ఇంతమంది ఎమ్మెల్యేలం ఈ సభలో కూర్చున్నామంటే అది జగన్‌మోహన్‌రెడ్డి చలవే. ఆయన పాలనలో మేమందరం భాగస్వాములైనందుకు గర్వపడుతున్నాం. రైతుల నుంచి, మహిళల వరకూ అన్ని వర్గాలకు భరోసా ఇచ్చిన ఘనత ఆయనదే.
– ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్యే, కళ్యాణదుర్గం
టీడీపీ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి
ఆరంభింపరు నీచమానవులు.. అంటూ భర్తృహరి సుభాషితంతో మొదలు పెట్టిన వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశల కోసం కాకుండా ఆశయాల కోసం నిలబడే నిజమైన నాయకుడని అన్నారు. ‘ఆవేశం, భావుకత, పదును, నిష్కపటత్వం, అంతఃశుద్ధి జగన్ సొంతం. తొమ్మిదేళ్ల రాజకీయ జీవితంలో ఆయన పడిన కష్టాలు, కన్నీళ్లు, స్వేదాన్ని ఆశయాల కోసం అర్పించిన నాయకుడు. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్ యుద్ధవీరుడు. తండ్రి ఆశయ సాధన కోసం నడుం బిగించిన జగన్ ప్రజల్ని తనవైపు తిప్పుకోవడమే కాకుండా వారి తలలో నాలుకలా నిలిచి నేతగా ఎదిగారు. చంద్రబాబు ప్రకటించిన 670 హామీలను ఆనాడు ఇదే గవర్నర్ తడబడుతూ చదివితే.. ఇవాళ జగన్ అనే యువకుడు ప్రకటించిన ప్రణాళికను అమలు చేస్తారనే నమ్మకంతో ధాటిగా చదివారు. జగన్‌పై జరిగినంత దాడి ప్రపంచంలో ఎవ్వరిపై జరగలేదు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవడం మాని పరనిందను పాటిస్తున్నారు. ప్రచారానికి, ప్రసారానికి మాత్రమే గత ప్రభుత్వం తన ఐదేళ్లను వెచ్చించింది. 1930లో చైనాలో మావో లాంగ్ మార్చ్ చేస్తే, జగన్ ఇప్పుడు ప్రపంచంలో ఏ నాయకుడూ చేయనంతగా ప్రజా సంకల్ప యాత్ర చేసి ప్రతి గుండెనూ కదిలించారు. ఆశా వర్కర్లు సైతం ఊహించనంతగా వేతనాన్ని రూ.3 వేల నుంచి రూ.10 వేలకు పెంచడం మొదలు ఐదు లక్షల మందికి ఉద్యోగాల కల్పన వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రకటించి జగన్మోహనుడుగా నిలిచారు. టీడీపీ చేసే విమర్శల వెనుక కుట్ర ఉండకూడదు. సభ ఇంద్ర సభలాగా జరగాలే తప్ప పాంచాలిని అవమానించిన మాదిరిగా జరగరాదు. 10 జనపథ్ ముందు అందరూ తలవంచుకుని నిలబడే పరిస్థితుల్లో జగన్ గుండె నిబ్బరంతో, ధైర్యసాహసానికి ప్రతీకగా నిలిచారు.
– భూమన కరుణాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే, తిరుపతి
ఐదు కోట్ల మందికి సీఎం జగన్ ‘టార్చ్ బేరర్’
ఐదు కోట్ల ఆంధ్రులను ముందుండి నడుపుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రానికి ఒక టార్చ్ బేరర్. రాబోయే 30 ఏళ్లు ఈ రాష్ట్రానికి జగనే టార్చ్ బేరర్. గడిచిన ఐదేళ్లు నరకాసుర పాలన చూశాం. టార్చర్ అంటే ఏంటో బాబు అందరికీ చూపించారు. ఆడవారిపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా బాబు స్పందించలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆడపిల్లలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారు. బెల్టుషాపులు ఎత్తేస్తానని, వాటి తాట తీస్తానని చెప్పి అవి ఎత్తేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ మహిళలు చంద్రబాబు తాట, తోలు రెండూ వలిచి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ఇటీవల పేపర్లో చూశా.. రుణమాఫీ చెయ్యకపోతే పోరాటం చేద్దామని నిర్ణయించినట్టు తెలుగుదేశం పార్టీ నిర్ణయించిందట. నిస్సిగ్గుగా ఎలా మాట్లాడతారిలా? ఐదేళ్లలో రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పి, ఇప్పుడు మేము చెయ్యాలని పోరాటం చేస్తారా? ఒకాయన కోడలు మగబిడ్డ కంటే అత్త వద్దంటుందా అంటారు, మరొకాయన కారు షెడ్డులో ఉండాలి, ఆడది వంటింట్లో ఉండాలి అంటారు. అప్పటి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇసుక మాఫియాను అడ్డుకున్న పాపానికి ఆడదని కూడా చూడకుండా వనజాక్షిని జుట్టుపట్టుకుని ఈడ్చి తీసుకెళ్లాడు. అదే చింతమనేనిని ఇప్పుడు దెందులూరు మహిళలు ఈడ్చి కొట్టారు. నారాయణ కళాశాలల్లో అమ్మాయిలు చనిపోతూంటే విచారణ కూడా చెయ్యలేదు. అందుకే ఇప్పుడు మహిళలు ఆ నారాయణ అడ్రస్ గల్లంతయ్యేలా చేశారు. ఎమ్మెల్యేకు ప్రిన్సిపాల్ బంధువని రిషితేశ్వరి కేసు నీరుగార్చారు. బుద్దా వెంకన్న, బోడె ప్రసాద్‌లు పేదరికంలో ఉన్న అమాయకపు మహిళలను కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లోకి దించి వారి మాన ప్రాణాలతో ఆడుకున్నారు. ఇప్పుడా బోడెప్రసాద్‌ను ప్రజలే శాసనసభలోకి రాకుండా చేశారు. ఇన్ని ఆగడాలు చేసినందుకు ఇప్పుడున్న టీడీపీ ఎమ్మెల్యేలు 23 మంది పొర్లుదండాలు పెట్టి, గుంజీలు తీసి ఆంధ్ర ప్రజలను క్షమాపణలు కోరాలి. ప్రజల నాడి తెలిసిన వైద్యుడు జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన గెలవడమే కాదు, ఐదుకోట్ల మంది ప్రజలనూ గెలిపిస్తాడు.
– ఆర్‌కే రోజా, ఎమ్మెల్యే, నగరి
పాలనను జగన్ గాడిలో పెడుతున్నారు
టీడీపీ పాపాలు పండాయి కాబట్టే ఇవాళ ఆ పార్టీ 23 సీట్లతో సరిపెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. గాడి తప్పిన పాలనను గాడిలో పెట్టే పనిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారు. విలువలు, విశ్వసనీయత, మంచి మనసుతో సుపరిపాలన అందించేందుకు తొలి అడుగులు వేసిన మా నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారు. నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి బడుగు, బలహీన వర్గాల పాలిట దేవుడైతే నేడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు కనబడే మంచి మనిషి. చంద్రబాబు తప్పుడు విధానాలతో గత ఐదేళ్లలో రాష్ట్రం అధోగతి పాలైంది. వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన ప్రాజెక్టులు తప్ప ఏమి కొత్తవి తెచ్చారో చెప్పాలి. ప్రజా సంకల్పయాత్రతో వైఎస్ జగన్ ప్రతి పేదవాడిని కలిశారు. వారి గుండెల్లో కొలువై ఉన్నారు. జగన్‌లో ఓ భగత్‌సింగ్‌ను, ఓ అల్లూరి సీతారామరాజును ప్రజలు చూసుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే బెల్ట్‌షాపులు లేకుండా చేశారు.
– జోగి రమేష్, ఎమ్మెల్యే, పెడన
పారదర్శకత, జవాబుదారీతనం మా సొంతం
అభివృద్ధి, సంక్షేమం, పారదర్శకత, జవాబుదారీతనం మా ప్రభుత్వ సొంతం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందంటే అది వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఒక్కటే. బీఎస్పీ అధినేత్రి మాయావతి లాంటి నాయకురాలే తన మంత్రివర్గంలో గతంలో 17 శాతం మంది ఎస్సీలకే అవకాశం ఇస్తే జగన్‌మోహన్‌రెడ్డి 25 శాతం మందికి అవకాశం కల్పించి చరిత్ర సృష్టించారు. జగన్ అమలు చేస్తున్న పథకాలను స్వాగతించాల్సింది పోయి అప్పుడే విమర్శలు చేస్తారా? నాలుగేళ్లపాటు బీజేపీతో కాపురం చేసినప్పుడు ప్రత్యేక హోదాను ప్రస్తావించడానికి సైతం టీడీపీ సాహసించలేదు. ఇవాళ జగన్ మోహన్‌రెడ్డి అదే ప్రధాని ఎదుట ప్రత్యేక హోదా మా హక్కు అని నినదించారు.
– కొరుముట్ల శ్రీనివాసులు, రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్
ఓటుకు కోట్లు కేసులో దొరికి రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు
రాష్ట్రంలో గత సర్కారు పెద్దలు అధికారాన్ని, నిధులను దుర్వినియోగం చేసి జగన్ ప్రభుత్వానికి ఖాళీ ఖజానా అప్పగించారు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ప్రజా తీర్పును హుందాగా స్వీకరించకుండా అపహాస్యం చేసేలా మాట్లాడటం దురదృష్టకరం. ఈవీఎంలలో మోసాలున్నాయని మీరు (చంద్రబాబు) అంటున్నారు. బ్యాలెట్ ఓటింగ్ కావాలన్నారు. మరి పోస్టల్ బ్యాలెట్లలో మీకు మెజార్టీ వచ్చిందా? మీ నిర్వాకాల వల్ల ఓడిపోతే ఆ విషయాన్ని అంగీకరించలేక ఏదేదో మాట్లాడతారా? మీరు తొలుత చేసిన ఐదు సంతకాలు అయినా నెరవేర్చారా? పోలవరం మీ (బాబు) పాలిట వరంగా మారిందా? లేదా? రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఎన్నిసార్లు పిల్లి మొగ్గలు వేశారో వెనక్కు తిరిగి చూసుకోండి. ఓటుకు కోట్లు కేసులో దొరకడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టి మీ స్వార్థం కోసం సాగిలపడ్డారు. మీలాగా నిధులు మింగాలి.. టెండర్లు నొక్కాలి.. అని మాకు లేదు. అందుకే టెండర్లు పెట్టే ముందే జ్యుడీషియల్ కమిషన్‌కు పంపాలని మా నాయకుడు చారిత్రాత్మక, సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పి ఎగవేసిన మీరు.. ఆ బాధ్యత మాపైకి నెట్టాలని చూస్తున్నారు. కంపెనీల వారు రైతులకు ట్రాక్టర్ రూ.4,61,000కు ఇస్తే మీరు రూ.5,64,000కు అంటగట్టి కమీషన్లు మెక్కారు. ఇందుకు పక్కా ఆధారాలున్నాయి. వైఎస్సార్ కుటుంబం మాట తప్పదు.. మడమ తిప్పదని ప్రజలకు తెలుసు. ఇచ్చిన ప్రతి మాటా జగన్ నిలబెట్టుకుంటారు.
– కాకాని గోవర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే, సర్వేపల్లి
Comments
Please login to add a commentAdd a comment