కుప్పం: రాష్ట్రంలో నెలకొన్న దుర్మార్గపు పాలనతో విసిగిపోయి కుప్పం ప్రజలు సైతం మార్పును కోరుతున్నారని.. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చంద్రమౌళి అన్నారు. బుధవారం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ భారీఎత్తున ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె మండల కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ శ్రేణులు ర్యాలీగా బయల్దేరి కుప్పానికి చేరుకున్నారు. బైపాస్ రోడ్డులోని పార్టీ కార్యాలయం నుంచి బయల్దేరిన ర్యాలీ పట్టణ పురవీధుల్లో సాగింది. అనంతరం వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించి నియోజకవర్గ సమన్వయకర్త చంద్రమౌళి ప్రసంగించారు.
చరిత్రలో ఊహించని విధంగా కుప్పంలో జరిగిన ర్యాలీకి వైఎస్సార్‌సీపీ శ్రేణులు తరలిరావడం హర్షణీయమన్నారు. పట్టణంలో బయల్దేరిన ర్యాలీ వంద పడకల ఆస్పత్రి నుంచి కుప్పం బస్టాండు వరకు వాహనచోదకులతో నిండిపోయిందని ఆయ న తెలిపారు. స్థానికులు మార్పును ఎంత బలంగా ఆకాంక్షిస్తున్నారో.. ఈ ర్యాలీ ద్వారా స్పష్టంగా తెలుస్తోందన్నారు. కుప్పంలో ఈ సారి వైఎస్సార్‌సీపీ జెండా ఎగురుతుందన్నారు. మండల కేంద్రంలో జరిగే పార్టీ సమావేశాల్లో ప్రతి ఒక్కరికీ తన మనసులో మాటను తెలియజేస్తానని, ప్రస్తుతం ర్యాలీకి తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కుప్పం నుంచే మరో చరిత్రను సృష్టించేందుకు వైఎస్సార్‌సీపీ బలంగా సిద్ధం అవుతోందని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment