వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : శ్రీవిళంబి నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ విళంబి నామ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారి ఇంటింటా సంతోషాలు నిండాలని ఆయన ఆకాక్షించారు. ఈ ఉగాది అందరి జీవితాల్లో అంతులేని ఆనందం తీసుకురావాలని, రైతులు, నిరుపేదలు, సామాన్యులు, కార్మికులు, సమాజంలో ప్రతి ఒక్కరూ ఈ ఏడాదంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకున్నారు.
ఈ తెలుగు సంవత్సరంలో సకాలంలో వర్షాలు కురిసి.. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, పాడి పంటలతో రైతులు వర్ధిల్లాలన్నారు. పల్లెలు కళకళలాడాలని, సకల వృత్తులూ పరిఢవిల్లాలని తెలుగు రాష్ట్రాల ప్రజలంతా అభివృద్ధి ఫలాలను మెండుగా అందుకోవాలని ఆక్షాంక్షించారు. షడ్రుచుల ఉగాది తెలుగు వారి జీవితాల్లో ఎనలేని ఆనందం, ఐశ్వర్యం తీసుకురావాలని వైఎస్ జగన్ అభిలషించారు.
ప్రజాక్షేత్రంలోనే వైఎస్ జగన్ ఉగాది వేడుకలు
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లాలో పాదయాత్రను కొనసాగిస్తున్న వైఎస్ జగన్ ఉగాది వేడుకలను ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో జరుపుకోనున్నారు. ఆదివారం ఉదయం 9.30 గంటలకు పండితుల ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ పర్వదిన సందర్భంగా రేపటి పాదయాత్రకు విరామం ఇచ్చారు. తిరిగి పాదయాత్ర సోమవారం యథాప్రకారం కొనసాగుతుందని వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటనలో తెలిపారు.
ముగిసిన 114వ రోజు ప్రజాసంకల్పయాత్ర
వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర 114వ రోజు ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమానులో ముగించారు. ఇవాళ 13.2 కిలోమీటర్లు నడిచిన జననేత వైఎస్ జగన్ ఇప్పటి వరకు 1,528 కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. నేటి పాదయాత్ర పెద్ద పాలెం, తెలగాయపాలెం, బండ్లవారిపాలెం, గరికపాడు, బీకేపాలెం మీదుగా కాకుమాను వరకు కొనసాగింది.
Comments
Please login to add a commentAdd a comment