దొరికిపోయిన దొంగ చంద్రబాబు | Ysrcp leader ambati rambabu fire on tdp govt | Sakshi
Sakshi News home page

దొరికిపోయిన దొంగ చంద్రబాబు

Published Fri, Mar 8 2019 1:55 AM | Last Updated on Fri, Mar 8 2019 1:55 AM

Ysrcp leader ambati rambabu fire on tdp govt - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐటీ గ్రిడ్స్‌ డేటా చోరీ వ్యవహారంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దొరికిపోయిన దొంగ అని.. ఆయనకు నిజంగా దమ్మూ, ధైర్యం ఉంటే ఈ వ్యవహారంలో జరుగుతున్న విచారణకు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించగలరా? అని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు సవాల్‌ విసిరారు. గురువారం హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో అంబటి విలేకరులతో మాట్లాడారు. టీడీపీకి ప్రజాబలం లేదనేది స్పష్టంగా అర్థం అవుతోందని, అందుకే ఎన్నికల యుద్ధం ప్రారంభం కానున్న ప్రస్తుత నేపథ్యంలో అధికార పార్టీలోని యోధాను యోధులైన నేతలు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బాట పడుతున్నారని అన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగితే గెలిచే పరిస్థితుల్లో టీడీపీ లేదని, దాంతో ఆ పార్టీ వక్రమార్గాలు పట్టిందని విమర్శించారు. అడ్డదారుల్లో గెలవాలనే తపనతో టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, మోసం, దగా, మ్యానిపులేషన్‌ చేసి ప్రజలకు వెన్నుపోటు పొడిచి, వ్యవస్థలను ప్రభావితం చేసి గెలవాలని భావిస్తోందన్నారు.

ఈ అడ్డదార్లు తొక్కే క్రమంలోనుంచి పుట్టిందే ‘డేటా చోరీ ఆలోచన’అని ఆయన అన్నారు. చంద్రబాబుకు ఓటు వేయాలనుకున్న వారికి ఆయన రెండేసి ఓట్లు ఇస్తారా? ఆయనకు ఓటు వేయరని భావించిన వారికి అసలు ఓట్లే లేకుండా చేస్తారా? ఈ అన్యాయం ఏమిటని ప్రశ్నిస్తే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై ఆరోపణలకు దిగుతారా? అని అంబటి సూటిగా ప్రశ్నించారు. తాము ఎప్పుడైనా ఎమ్మెల్యేలను కొనుగోలు చేశామా? 23 మంది వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొన్నది ఎవరు? వారిలో నలుగురిని మంత్రులను చేసింది ఎవరు? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ దొరికిపోయి.. పారిపోయి వచ్చింది చంద్రబాబు కాదా అని అంబటి ప్రశ్నించారు. ఓ ప్రైవేటు సంస్థ డేటాను చోరీ చేస్తే దానిపై కేసు నమోదు అయితే దానిని రెండు రాష్ట్రాల మధ్య సమస్యగా మారుస్తున్నారని మండిపడ్డారు. 

వారి బ్యాంక్‌ అకౌంట్లు బయట పెడతారా.. 
చంద్రబాబు తన బ్యాంకు అకౌంట్‌ను, తన కుమారుడు లోకేశ్‌ బ్యాంక్‌ అకౌంట్‌ను బహిరంగంగా పెట్టగలరా? ప్రజలందరికీ మీలాంటి భద్రత అవసరం లేదా? అని ప్రశ్నించారు. ఫారమ్‌–7 అనేది ఓటర్ల జాబితాలో అక్రమాలు ఉన్నా, డబుల్‌ ఎంట్రీలు ఉన్నా సరిచేయమని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేస్తూ ఇచ్చే దరఖాస్తు అని ఆయన అన్నారు. ఐటీ గ్రిడ్స్‌పై తెలంగాణ పోలీసులు దాడి చేస్తే లోకేశ్‌కు సన్నిహితుడైన అశోక్‌ను దాచేశారని చెప్పారు. అతనిని ఎక్కడ దాచారో చెప్పాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement