వైఎస్ఆర్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పై జరిగిన హత్యాయత్నం తీరును తెలుగు ప్రజలతో పాటు భారత దేశంలోని ప్రజలందరూ గమనిస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ కార్యాలయంలో బుగ్గన విలేకరులతో మాట్లాడుతూ..‘వైఎస్ జగన్ ధైర్యంగా, హుందాగా, ఆత్మ విశ్వాసంతో, ఎవరికీ ఇబ్బంది కలగకుండా హైదరాబాద్ వచ్చి సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్సం కోసం చేరారు. హత్యాయత్నం ఘటనపై ప్రభుత్వ స్పందన బాధాకరం. ప్రతిపక్ష నేత మీద హత్యాయత్నం జరిగితే ఇలానే మాట్లాడుతారా?. జగన్‌లో గొప్పతనం ఏముందని సీఎం చంద్రబాబు అడగటం ఏమిటి?. ప్రజలు గమనిస్తున్నారు. డీజీపీతో గవర్నర్ ఎలా మాట్లాడుతారని సీఎం ప్రశ్నించారు..అసెంబ్లీలో గవర్నర్.. మై గవర్నమెంట్ అని సంభోదించరా?. ఎందుకు ఇతర పార్టీల నాయకులు పరామర్శలు చేస్తారని సీఎం అనడం ఏమిటి?. సీఎం పదవిలో ఉండి మీ భావాలు అదుపు తప్పి మాట్లాడార’ని చంద్రబాబును తీరును ప‍్రశ్నించారు.
ఇంకా మాట్లాడుతూ..‘డీజీపీ ఇలాంటి ఘటన మీద వెంటనే ప్రెస్ మీట్ పెట్టి జగన్ అభిమాని దాడి చేశారు అన్నారు.. ఆయనకు ఎందుకు ఆత్రుత. చిన్న ప్రమాదం జరిగినా విచారణ చేశాకే చెబుతాం అని ఎస్‌ఐ స్థాయి వ్యక్తి చెబుతారు కానీ డీజీపీకి ఆ మాత్రం కూడా తెలవదా. టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా ఏదన్నా నిజం వస్తుందా..ప్రజలు నమ్ముతారా?. ఇప్పటి వరకు ప్రతిపక్ష నేతను ప్రభుత్వం తరపున ఒక్కరైనా పరామర్శించారా? వీఐపీ సెక్యూరిటీ బాధ్యత మాది కాదని సీఐఎస్‌ఎఫ్ డీజీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు..ఎయిర్‌పోర్టులో రాష్ట్ర పోలీసుల బాధ్యత లేకపోతే ఎందుకు స్టేషన్ ఏర్పాటు చేశారు. పర్సల్ సెక్యూరిటీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కాదా? జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏమైంది. సీఎస్‌ఓ ఏమయ్యార’ని పలు ప్రశ్నలు సంధించారు.
‘టీడీపీ నేత మూర్తి చనిపోయినపుడు ఎయిర్‌పోర్టు లాబీ నిండా పోలీసులతో సెక్యూరిటీ ఎలా ఇచ్చారు?. జగన్‌ను ఎవరన్నా పరామర్శిస్తే కూడా దాన్ని ప్రశ్నించడం ఏమిటి? హత్యాయత్నం జరిగిన వెంటనే 9 నెలల క్రితం నాటిదని చెబుతున్న ఫ్లెక్సీ గంట లోపలే ఎలా చెక్కు చెదరకుండా దొరుకుతుంది. ఫ్లెక్సీలో గరుడ ఏంటి? ఏం జరుగుతోంది. ఎంత లోతు కత్తి దిగబడిందని మంత్రులు మాట్లాడటమా? ఇంతగా దిగజారడమా? ఎవరికీ ఇబ్బంది రావొద్దని జగన్ ప్రయత్నం చేస్తే దానిపై కూడా విమర్శలా. మాకు రాష్ట్ర పోలీసు సిట్ మీద నమ్మకం లేదు. థర్డ్ పార్టీతో ఘటన మీద విచారణ చేయాలి. స్టోరీ స్క్ట్రిప్ట్ రాసి..ముందుకు పోతున్నారు. సినిమాలు టీడీపీకి, చంద్రబాబుకు బాగా వంటబట్టాయి. సీఎం ప్రవర్తన నాలుగు సంవత్సరాలుగా అనుమానాస్పదంగా ఉంద’ని బుగ్గన సందేహం వ్యక్తం చేశారు.
‘ ఎర్రచందనం, తుని రైలు దహనం, ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్య, ఇలా అన్నింటిలోనూ టీడీపీ హస్తం ఉంది. అరటి తోటలు కాల్చినపుడు కూడా ఎవరున్నారో తెలిసింది. శివాజీ ఎవరు? ఆయన చెప్పేదేంది? సీఎం సెక్యూరిటీ ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. అతను కత్తితో ఎలా వచ్చారు. ఎందుకు చెక్ చెయ్యలేదు. గాజువాక నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేయాలనుకున్న వ్యక్తి దగ్గర పనిచేసే వ్యక్తి దాడి చేశారు. సీఎం వ్యవహారం కక్షతో కూడినట్లుగా ఉంద’ని బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment