
రాష్ట్ర పరిస్థితి మెరుగుపడాలంటే రూ. 65వేల కోట్లు కావాలని 15వ ఆర్థిక సంఘాన్ని..
సాక్షి, హైదరాబాద్ : సీఎం చంద్రబాబు నాయుడు దుబార ఖర్చుతోనే రాష్ట్రంలో ఆర్థికలోటు ఏర్పడిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు డీఎన్ కృష్ణ తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర పరిస్థితి మెరుగుపడాలంటే రూ. 65వేల కోట్లు కావాలని 15వ ఆర్థిక సంఘాన్ని కోరినట్లు చెప్పారు. 15వ ఆర్థిక సంఘానికి తమ పార్టీ తరపున పలు అంశాలను తీసుకెళ్లామన్నారు. హైదరాబాద్‌ను కోల్పోయిన నవ్యాంధ్రప్రదేశ్‌కు అధిక నిధులు కేటాయించాలని కోరామన్నారు. రాష్ట్రం ఆర్థికపరంగా చాలా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుదని, రెవిన్యూలోటు భర్తీ చేయాలంటే కేంద్ర సహాయం అవసరమని చెప్పామన్నారు. విభజన హామీలు నెరవేర్చకపోవడం దురదృష్టకరమని, 2011 జనాభా లెక్కల ప్రకారం కేంద్రం నిధులు కేటాయిస్తే ఏపీకి అన్యాయం జరుగుతుందని వివరించినట్లు పేర్కొన్నారు.
ప్రత్యేక హోదా రద్దు చేయాలని 14వ ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మొదట్నుంచీ చెబుతున్నారని గుర్తు చేశారు. అప్పుడు కేంద్రం మాటలకు రాష్ట్ర ప్రభుత్వం వత్తాసు పలికిందన్నారు. ఏపీ కేంద్రానికి చెల్లించాల్సిన అప్పును పూర్తిగా రద్దు చేయాలని తమ పార్టీ తరపున విజ్ఞప్తి చేశామన్నారు, లోటును భర్తీ చేసేందుకు రూ. 22,113 కోట్ల 14 వ ఫైనాన్స్ కమీషన్ ఇచ్చిందని, కానీ ఈ మొత్తం రెవిన్యూ లోటును భర్తి చేయలేకపోయిందన్నారు. రాష్ర్టంలో పునరుత్పాదకత విద్యుత్ ఉత్పత్తి అధికంగా జరుగుతోందని, రాష్ర్టానికి రాయితీలు ఇవ్వాలని కోరినట్లు పేర్కొన్నారు.