సాక్షి, విజయవాడ : దళిత క్రైస్తవుల ఆస్తులను దోచుకున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులదని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున విమర్శించారు. తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి దళితులు, గిరిజనుల కోసం అధ్యయన కమిటీ వేసి వారి సమస్యలు తీర్చబోతున్నారని తెలిపారు. బుధవారం విజయవాడలోని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. టీడీపీ హయాంలో దళిత సంక్షేమం టీడీపీ దొంగల సంక్షేమంగా మారిందని మండిపడ్డారు. సబ్‌ప్లాన్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయగలిగే దమ్ముందా అంటూ సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నక్కా ఆనంద్ బాబు దళిత సంక్షేమం కోసం ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు.
ఏపీలో సీఎం, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రికి అంబేద్కర్.. జయంతి, వర్థంతి రోజులలో మాత్రమే గుర్తుకు వస్తారని దుయ్యబట్టారు. దళితులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 32 లక్షల ఎకరాలు పంచితే టీడీపీ ఎంత పంచిందని ప్రశ్నించారు. టీడీపీలో ఉన్న దళిత నేతలు పునరాలోచించుకోవాలని, చంద్రబాబు కరివేపాకులా వాడుకుని వదిలేస్తారని హెచ్చరించారు. దళితులకు టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఒక్క హామీ అయినా అమలు చేశారా అని ప్రశ్నించారు. అంబేద్కర్ స్మృతివనం, 125 అడుగుల విగ్రహం ఇప్పటివరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని, దీనిపై ప్రజాభిప్రాయం సేకరిస్తామంటూ డ్రామాలు ఆడతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment