సాక్షి, అమరావతి: సీఎం చంద్రబాబు, ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సాయి‘రా హాష్‌టాగ్‌తో సెటైర్లు వేశారు. గతేడాది తిత్లీ తుపాన్ వచ్చినప్పుడు సహాక చర్యలు పూర్తి కాకుండానే ‘థాంక్యూ సీఎం సార్’ అని ఫ్లెక్సీలు పెట్టి ప్రచారం చేసుకున్నారని విమర్శలు గుప్పించారు. ఫొని తుపాన్ నేపథ్యంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తాజగా సమీక్షలు నిర్వహిస్తున్నారని, అయితే, థాంక్యూ సీఎం సార్ అనే బదులు థాంక్యూ సీఎస్ సార్ అని ప్రజలు అంటారేమోనని బాబుకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
బాబు గంతులేస్తున్నారు..
‘అధికారులను బెదిరించడానికి, ఓట్ల లెక్కింపు రోజు అక్రమాలకు పాల్పడేందుకే చంద్రబాబు తనదే ఘన విజయం అని గంతులేస్తున్నారు. టీడీపీకి ప్రతిపక్ష హోదా దక్కితే గొప్ప. ఓడిపోతాడు కాబట్టే లోకేశ్ ను ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా పోటీకి దింపారు. ఈవీఎంలపై పోరాటం ఎంత వరకొచ్చిందో?’ అంటూ ట్విటర్ వేదికగా విజయసాయిరెడ్డి వ్యంగాస్త్రాలు సంధించారు.
రాష్ట్ర గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ దాసరి రాజా మాస్టర్ జీత భత్యాలను అయాచితంగా పెంచడం పట్ల ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్ర గ్రంథాలయ ఛైర్మన్ జీతభత్యాలను రూ.50 వేల నుంచి రెండు లక్షలకు పెంచడం నీతి మాలిన చర్య కాదా చంద్రబాబూ?’ అని ప్రశ్నించారు. గతేడాది నుంచి రాజాకు 24 లక్షలు బకాయి పడ్డామని, వాటిని చెల్లించాలని ఏప్రిల్19న ఉత్తర్వులు ఇచ్చావ్. మీ హెరిటేజ్ కంపెనీలో అయితే ఉద్యోగుల జీతాలను ఇలా 200% పెంచుతారా?’ అని చురకలంటించారు.
(చదవండి : దాసరి రాజాకు చంద్రబాబు నజరానా)
Comments
Please login to add a commentAdd a comment