
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను వైఎస్సార్‌సీపీ నేతలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణా రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూములను పరిశీలించినట్లు తెలిపారు. ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్‌రూంలను సీఆర్‌పీఎఫ్ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారని చెప్పారు. అభ్యర్థులకు అనుమానం ఉంటే ఎప్పుడైనా పరిశీలించే అవకాశం కల్పించారని వెల్లడించారు. తమకు భారతదేశంలోని వ్యవస్థలపైన నమ్మకముందని వ్యాక్యానించారు.
బాబు ఘనుడు .. అందుకే పరిశీలించడానికి వచ్చాం: ఆళ్ల
ఐదేళ్ల చంద్రబాబు పాలనపై ప్రజలు ఇచ్చిన అంతిమతీర్పు ఈవీఎంల రూపంలో భద్రపరిచి ఉందని అన్నారు. ఎలక్షన్ కమిషన్ స్ట్రాంగ్‌రూంల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారని, తమకు భద్రతపై నమ్మకం ఉందని చెప్పారు. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు ఘనుడు అని ప్రజలు చెబుతున్నారు.. అందుకే ఒకసారి ఈవీఎంల భద్రతను పరిశీలించడానికి వచ్చామని పేర్కొన్నారు.