సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, పక్కన సురేష్‌బాబు, అంజద్‌బాషా
కడప సెవెన్‌రోడ్స్ : కడప నియోజకవర్గంలో భారీగా ఓటర్లను తొలగించడంపై వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో 2.7లక్షల ఓట్లు ఉంటే నేడు 1.64 లక్షలకు ఎలా తగ్గిపోయాయో అధికారులు సమాధానం ఇవ్వాలన్నారు. కడప, చిత్తూరు జిల్లాల రోల్స్ అబ్జర్వర్ బి.శ్రీధర్ సోమవారం కలెక్టరేట్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, వైఎస్సార్‌సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప అసెంబ్లీ పరిధిలో 261 పోలింగ్ కేంద్రాలు ఉండగా, అందులోని 90 పోలింగ్‌కేంద్రాల్లో ఓటర్లు 500 కంటే తక్కువగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు.
ప్రజలు నివసించే ప్రాంతాల్లో కాకుండా దూరంగా ఉండే పోలింగ్‌కేంద్రాల్లోకి వారి ఓట్లను మార్చారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఇదే ఓటర్ల జాబితా ఉంటే కడపలో 30 శాతం కూడా ఓట్లు పోల్ కావన్నారు. బూత్ లెవెల్ అధికారులు సక్రమంగా పనిచేయలేదని ఆరోపించారు. ఇంటింటి సర్వే ఎక్కడా జరగలేదన్నారు. ఒక అపార్టుమెంటులో 20ఇళ్లు ఉంటే ఒక డోర్ నెంబరు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. చిన్నచౌకు, చెమ్ముమియాపేటల్లో మాత్రమే డబుల్ ఎంట్రీలు ఉన్నాయని చెప్పారు. తాము బూత్ లెవెల్ ఏజెంట్లను నియమిస్తామని అధికారులు మళ్లీ ఇంటింటి సర్వే చేపడితే ఓటర్ల జాబితా సక్రమంగా తయారవుతుందని సూచించారు.
బోగస్ ఓట్లు తొలగించాలి:ఎమ్మెల్యే రవి
కమలాపురం నియోజకవర్గం దేవరాజుపల్లె పోలింగ్ కేంద్రం 46, మాచిరెడ్డిపల్లె పోలింగ్ కేంద్రం 93 పరిధిలో చాలామేరకు ఉన్న బోగస్ ఓట్లను తొలగించాలని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. ఆధార్ లింక్ చేసినపుడు బోగస్ ఓట్లు పోయాయని, సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఆధార్ లింక్ తొలగించడం వల్ల మళ్లీ ఓట్లు అక్కడ పెరిగాయన్నారు. తాము ఆ పోలింగ్ కేంద్రాల్లో ఏజెంట్లను నియమించుకునే పరిస్థితి లేదని, కనుక విచారణ చేపట్టి బోగస్ ఓట్లు తొలగించాలన్నారు. అలాగే 2, 3, 4 పోలింగ్ కేంద్రాలను కూడా పరిశీలించాలన్నారు. ఇక 138 పోలింగ్ కేంద్రానికి అనిమెల అని కాకుండా గంగిరెడ్డిపల్లె పోలింగ్ కేంద్రంగా మార్చాలన్నారు. జంగంపల్లె ఓటర్లకు 26వ పోలింగ్‌కేంద్రం చాలా దూరంలో ఉందన్నారు. కనుక జంగంపల్లెలోని కొత్తగా పోలింగ్‌కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని, లేదంటే రామచంద్రాపురంలో ఉన్న 23 పోలింగ్ కేంద్రంలో కలుపాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి నీలి శ్రీనివాసరావు, బీఎస్పీ నాయకుడు కానుగ దానం, సీపీఎం నాయకుడు టి.సునీల్ మట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment