చంద్రబాబు, లోకేశ్‌ పలకరేం!? | YSRCP Leaders Fires On Chandrababu Naidu And Lokesh | Sakshi
Sakshi News home page

చంద్రబాబు, లోకేశ్‌ పలకరేం!?

Published Sat, Feb 15 2020 3:12 AM | Last Updated on Sat, Feb 15 2020 3:12 AM

YSRCP Leaders Fires On Chandrababu Naidu And Lokesh - Sakshi

అదాయ పన్ను శాఖ దాడుల నేపథ్యంలో వెలుగు చూసిన చంద్రబాబు అవినీతిపై వైఎస్సార్‌సీపీ నిప్పులు చెరిగింది. ఆయన వ్యవహారాలపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్‌ చేసింది. పార్టీ ముఖ్య నేతలు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి అంతులేని అవినీతికి తెరలేపారని ధ్వజమెత్తారు. ఆయన వ్యక్తిగత కార్యదర్శిని తనిఖీ చేస్తేనే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయని.. చంద్రబాబును తనిఖీ చేస్తే ఎన్ని లక్షల కోట్లు బయటకు వస్తాయోనని అన్నారు.                                      
– సాక్షి, అమరావతి, విశాఖపట్నం, తిరుపతి

పెద్దఎత్తున అవినీతి 
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 
ప్రతిపక్ష నేత చంద్రబాబు తాజా అవినీతి గురించి.. ఆయనకు కొమ్ముకాస్తున్న మీడియానే ప్రజలకు జవాబు చెప్పాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులే అవినీతిలో భాగం పంచుకున్నారని చెప్పారు. దీన్ని పొలిటికల్‌గా తీసుకోలేమన్నారు. కానీ చాలా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందన్నారు. తమ నాయకుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై గతంలో సోనియాగాంధీ, చంద్రబాబు కుట్రపూరితంగా కేసులు పెట్టిస్తే.. టీడీపీ అధినేత అనుకూల మీడియా ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేసిందని పెద్దిరెడ్డి విమర్శించారు. ఇప్పుడు చంద్రబాబు అవినీతి కుంభకోణం విషయంలో ఆ మీడియా స్పందనేంటో తెలపాలన్నారు. ఒక పార్టీకి, ఒక వ్యక్తికి ఆ పత్రికలు, చానళ్లు కొమ్ముకాస్తున్నాయని ధ్వజమెత్తారు. కేవలం మూడు ఊర్లలో ధర్నాలు జరుగుతుంటే.. వాటిని ప్రధాన శీర్షికల్లో ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు. జనసేన నేత పవన్‌కల్యాణ్‌ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదని ఓ ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.  

పూర్తిస్థాయి విచారణ జరిపితే.. 
సజ్జల రామకృష్ణారెడ్డి 
చంద్రబాబు అధికారంలో ఉండగా రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసి రూ.లక్షల కోట్లు సంపాదించారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం పేరుచెప్పి చేసిన రూ.3 లక్షల కోట్ల అప్పుల్లో అధికంగా చంద్రబాబు జేబులోకి వెళ్లిందన్నారు. ఆయన పర్సనల్‌ సెక్రటరీని పట్టుకుంటేనే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయని, చంద్రబాబును పట్టుకుంటే.. ఎన్ని వేల కోట్లు బయట పడతాయోనని అన్నారు. ఇంత పెద్దఎత్తున ఐటీ దాడులు జరుగుతుంటే.. ఈనాడు పత్రిక దేశవ్యాప్త దాడులని రాస్తోందన్నారు. ఆదాయ పన్ను శాఖ టీడీపీ నేతల బట్టలు ఊడదీసి నడిరోడ్డుపై నిలబెడుతున్నా పచ్చ మీడియా రాయదని ఎద్దేవా చేశారు. తన అవినీతిపై సాక్ష్యాలు ఉంటే చూపండని సవాల్‌ చేసే చంద్రబాబు ఇప్పుడు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై పవన్‌ కల్యాణ్‌ , బాబు అనుచరులు ఎందుకు నోరు మెదపటం లేదని ప్రశ్నించారు.

చంద్రబాబు, లోకేశ్‌ నోరు మెదపరేం : మంత్రి బొత్స 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనకు ప్రైవేట్‌ కార్యదర్శిగా పనిచేసిన శ్రీనివాస్, మాజీమంత్రి లోకేశ్‌ బినామీలకు చెందిన ఇళ్లు.. వారి సంస్థల కార్యాలయాల్లో ఆదాయ న్ను శాఖ నిర్వహించిన సోదాల్లో లెక్కలేనంత అవినీతి వెలుగు సిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆ అవినీతితో తమకెలాంటి సంబంధమూ లేదని ఇప్పటివరకూ చంద్రబాబుగానీ, లోకేశ్‌గానీ ఎందుకు స్పందించట్లేదని ఆయన ప్రశ్నించారు. విశాఖ వైఎస్సార్‌సీపీ నగర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూణే, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ తదితర 45 చోట్ల జరిపిన తమ సోదాల్లో రూ.2 వేల కోట్ల మేర అక్రమ లావాదేవీలు జరిగినట్లు ఐటీ శాఖే అధికారికంగా వెల్లడించిందన్నారు. చంద్రబాబు వద్ద పీఎస్‌గా పనిచేసిన వ్యక్తి చేసిన అవినీతే రూ.2 వేల కోట్లు ఉన్నందున.. చంద్రబాబు, లోకేశ్‌ వ్యవహారాలపై కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందని బొత్స అభిప్రాయపడ్డారు. చంద్రబాబు పాలనలో అవినీతి రూ.రెండు లక్షల కోట్లకు చేరినా ఆశ్చర్యం లేదని చెప్పారు. ఐదేళ్ల పాలనలో రూ.1.90 లక్షల కోట్ల మేర రుణాలు తీసుకొచ్చారని, ఆ సొమ్మంతా ఏమైపోయిందని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.  

ఇప్పుడు తీగే లాగారు.. త్వరలో డొంక కదులుతుంది 
ఎమ్మెల్యే అంబటి రాంబాబు 
ఇటీవల ఐటీ శాఖ ఏపీలో నిర్వహించిన సోదాల్లో చంద్రబాబు బాగోతం బయటపడిందని, రూ.2 వేల కోట్లు చేతులు మారిన విషయం రుజువైనందున తక్షణమే చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్‌లను అరెస్టు చేయాలని ఎమ్మెల్యే అంబటి రాంబాబు డిమాండ్‌ చేశారు. వ్యవస్థలను మేనేజ్‌ చేయడంలో దిట్ట అయిన బాబు.. బయట ఉంటే తిరిగి వ్యవస్థలను మేనేజ్‌ చేసే అవకాశం ఉందన్నారు. అందుకోసమే ఉన్నపళంగా హైదరాబాద్‌ పారిపోయారని తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పుడే తీగ లాగారని.. త్వరలో డొంక కదులుతుందన్నారు. దేశంలో ఎన్నికల ఖర్చు పెరగడానికి ప్రధాన కారకుడు చంద్రబాబేనని అంబటి తెలిపారు. లెక్కలు సరిచేసుకునేందుకే ఆయన తరచూ దావోస్, సింగపూర్‌ వెళ్తారన్నారు. బాబు 100 తప్పులు చేశారని, ఇక శిరచ్ఛేదన తప్పదన్నారు. కాగా, ఎల్లో మీడియా ఎందుకు రూ.రెండు వేల కోట్ల గురించి రాయడం లేదని అంబటి ప్రశ్నించారు. తేలు కుట్టిన దొంగల్లా బాబు, లోకేశ్‌లు నోరు మెదపడంలేదని.. అలాగే, నీతులు చెప్పే పవన్‌ కల్యాణ్, సీపీఐ రామకృష్ణ కూడా ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు. 

తండ్రీ కొడుకులు ఎందుకు స్పందించడం లేదు  
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూటి ప్రశ్న
ఐటీ దాడులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు స్పందించకుండా టీడీపీ నేత యనమల రామకృష్ణుడు స్పందించడంపై శాసనమండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ఆయనేమైనా చంద్రబాబు ఆర్థిక లావాదేవీలు చూస్తున్నారా? అని నిలదీశారు. శాసనమండలిలోని తన చాంబర్‌లో శుక్రవారం మీడియాతో ఉమ్మారెడ్డి మాట్లాడారు. ఐదు రోజులపాటు చంద్రబాబు మాజీ సహాయకుడు శ్రీనివాస్‌ ఇంట్లో వరుసగా ఐటీ దాడులు జరిగితే ఆయన, ఆయన కుమారుడు లోకేశ్‌ స్పందించలేదన్నారు. దీన్నిబట్టి మౌనం అర్ధాంగీకారంగా భావించాల్సి ఉంటుందని అన్నారు. అంతేకాకుండా వారిపై అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. చంద్రబాబు తాను నిప్పులాంటి వాడినని చెప్పుకుంటుంటారని, ఇప్పుడు ఆ నిప్పుకు ఏమైనా తుప్పు పట్టిందా అని ప్రశ్నించారు. అందుకే నోరు మెదపడం లేదా? అని నిలదీశారు. వాస్తవానికి.. 26 డొల్ల కంపెనీల ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహించగలిగే సామర్థ్యం శ్రీనివాస్‌కు ఉందా? తన పీఏ డొల్ల కంపెనీలు పెట్టి లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటే చంద్రబాబు చూస్తూ కూర్చున్నారా అని ప్రశ్నించారు. చంద్రబాబు జైలుకు వెళ్లే రోజు త్వరలో వస్తుందని.. ఇప్పటికైనా ఆయన నోరు విప్పి నిజాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement