మోదీ చంద్రబాబును మోసం చేయలేదు.. కానీ! | YSRCP Leaders Says BJP And TDP Plays Dramas | Sakshi
Sakshi News home page

మోదీ చంద్రబాబును మోసం చేయలేదు..!

Published Sat, Jun 2 2018 1:52 PM | Last Updated on Tue, Jul 24 2018 1:16 PM

YSRCP Leaders Says BJP And TDP Plays Dramas - Sakshi

మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, అంబటి రాంబాబు, అవినాష్‌ రెడ్డి

సాక్షి, నెల్లూరు : ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబును మోసం చేయలేదని.. ఈ ఇద్దరు నేతలు కలిసి ఏపీ ప్రజలను మోసం చేశారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు అవినీతిపై బీజేపీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని, ఈ విషయంలో ఎందుకు వెనుకాడుతోందని అంబటి ప్రశ్నించారు. నవనిర్మాణ దీక్షల పేరుతో రాష్ట్ర ప్రజలను వంచిస్తున్న చంద్రబాబు మోసపూరిత వైఖరికి నిరసనగా శనివారం నెల్లూరులో వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్షకు విశేష స్పందన వస్తోంది. వంచనపై గర్జన దీక్షలో అంబటి మాట్లాడుతూ.. టీడీపీ-బీజేపీ లాలూచీ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీతో వైఎస్సార్‌సీపీ కలిసే ప్రసక్తే లేదని, ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అయితే ఏపీ సీఎం చంద్రబాబు కావాలనే వైఎస్సార్‌సీపీపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.

చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా ఉండటం మన ఖర్మ అని వైఎస్సార్‌సీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డి అన్నారు. చంద్రబాబు తెలుగుజాతికి చేసిన ద్రోహాన్ని అంత తేలికగా మర్చిపోలేమన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత నేత ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబు సొంతమని ఎద్దేవా చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదన్నారు. చంద్రబాబు 29సార్లు ఢిల్లీకి వెళ్లింది హోదా కోసం కాదని, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిన అక్రమకేసుల్లో ఇరికించేందుకని పేర్కొన్నారు. చంద్రబాబు ఏపీకి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. ఏపీ అభివృద్ధి, ప్రత్యేక హోదా సాధన జననేత వైఎస్‌ జగన్‌ వల్లే సాధ్యమని ఎంపీ మేకపాటి వివరించారు.

మొదటినుంచీ హోదా కోసం పోరాడుతున్నది వైఎస్సార్‌సీపీనేనని ఆ పార్టీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి అన్నారు. హోదా కోసం పార్లమెంట్లో 13సార్లు అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టామని, కానీ కొందరు కుట్రలు చేసి తీర్మానం చర్చకు రాకుండా చేశారని మండిపడ్డారు. చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఏపీకి ఎందుకూ పనికి రాలేదన్నారు. మా రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలు వస్తాయి. టీడీపీ-బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ఏపీ ప్రజలకు అవినాష్‌ రెడ్డి పిలుపునిచ్చారు. హోదా సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షలు కూడా చేసినట్లు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమతో పాటు టీడీపీ ఎంపీలను కూడా రాజీనామా చేయాలని కోరినా.. చంద్రబాబు మాత్రం ఆ విషయంలో ముందుకు రాలేదని స్పష్టం చేశారు. నియోజకవర్గాల పెంపు కోసమే చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరిగారని, కానీ ఇప్పుడు నవనిర్మాణ దీక్ష పేరుతో చంద్రబాబు కొత్త డ్రామాలకు తెరతీశారని ఏపీ సీఎంపై ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement