సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధికారం కోల్పోవడంతో వికృతంగా ప్రవర్తిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సొంత పుత్రుడు, దత్త పుత్తడు దీక్షల తర్వాత చంద్రబాబు దీక్ష మొదలు పెట్టారని ఎద్దేవా చేశారు. ఇసుకపై చంద్రబాబు దొంగ దీక్ష చేస్తున్నారని, నిన్నటి దీక్షలో చంద్రబాబు పవన్ కల్యాణ్, ఎన్టీఆర్‌లను మించి యాక్టింగ్ చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చంద్రబాబుకు విమర్శలు ఎలా చేయాలని అనిపిస్తుందన్నారు. ఇసుక కొరత వల్ల 50 మంది చనిపోయారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వెనుకబడిన వర్గాల వారు సీఎం జగన్ వెనుక ఉన్నారు కాబట్టే 151 సీట్లు వచ్చాయని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు రాజకీయాల్లోకి మత ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. పరిపాలనకు మతానికి ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు.
దీక్షలో నారా లోకేష్ సీఎం డౌన్ డౌన్ అనగానే ఇద్దరు టీడీపీ నేతలు పార్టీ నుంచి జారిపోయారని, చంద్రబాబు తానా అంటే పవన్ కల్యాణ్ తందానా అంటున్నారని అంబటి ఎద్దేవా చేశారు. సీఎం జగన్ గురించి వ్యక్తి గత విమర్శలు చేయడం పాలసీ మ్యాటర్ అవుతుందా అని అయన పశ్నించారు. పవన్ కల్యాణ్ ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని చురకలు అంటించారు. పవన్ కల్యాణ్ ప్యాకేజీ తీసుకుని విమర్శలు చేస్తున్నారని, అలాగే ఆయన తప్పు చేసి మిగతా వారికి కూడా తప్పు చేయండని సూచిస్తున్నారని అన్నారు. చంద్రబాబు హయాంలో ఇసుక కొరత ఉన్నట్లు ఈనాడు పేపర్‌లో వచ్చింది మరి అప్పుడు చనిపోయిన వారి గురించి ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబుకు, పవన్‌కు ఇసుక, ఇంగ్లీష్ తప్ప మరేమీ దొరకట్లేదని, పవన్ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదుకోవచ్చా అని ప్రశ్నలు సంధించారు.
ఇక చంద్రబాబు ధైర్యం అందరికి తెలిసిన విషయమే తెలంగాణ సీఎం కేసీఆర్ ఒక కేస్ పెడితే భయపడి పారిపోయి వచ్చారని అంబటి ఎద్దేవా చేశారు. అమరావతిలో చంద్రబాబు చేసిన నేరాలు బయటకు వస్తాయని, చంద్రబాబు ఢిల్లీకి వెళ్లే వీలు లేదు కాబట్టి పవన్ కల్యాణ్‌ను తన ధూతగా ఢిల్లీకి పంపి ఉంటారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. చంద్రబాబు దీక్షకు మెజార్టీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదని.. ఇందుకు ఆయన తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ప్రశ్నించారు. చంద్రబాబు దీక్ష చేసే రోజున ఇద్దరు టీడీపీ నేతలు సీఎం జగన్‌కు మద్దతు తెలిపారని అన్నారు. ఇక టీడీపీ మునిగిపోయే పార్టీ అని, ఆ పార్టీని పట్టుకుని పవన్ కల్యాణ్ వేలాడుతున్నాడని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment