
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
సాక్షి, న్యూఢిల్లీ : రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌యాదవ్ అన్నారు. వైఎస్సార్ సీపీ ఎంపీలు పార్లమెంటులో 12 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారని, తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంటులో ఏం పీకుతున్నారు? అని ప్రశ్నించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఒక స్పష్టతతో మొదటి నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాడుతోందని చెప్పారు. ‘హోదా కోసం పోరాటాలు చేస్తామని చెప్పాం. చేశాం. అవిశ్వాసం పెడతామన్నాం. పెట్టాం. 12 సార్లు అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్‌కు అందజేశాం. తీర్మానంపై చర్చ జరగడానికి ఏఐడీఎంకే సభ్యులు చేస్తున్న రచ్చ అడ్డుతగులుతుంటే కనీసం పొరుగు రాష్ట్రాల వారితో చర్చించి సానుకూల స్పందన కూడా తీసుకురాలేకపోయాడు చంద్రబాబు.
తమిళనాడు ముఖ్యమంత్రితో మాట్లాడి ఒక్కరోజు చర్చ జరగనివ్వాలని అడగని దిక్కుమాలిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పక్క రాష్ట్రంలోని పళని స్వామితో మాట్లాడలేని చంద్రబాబు ఢిల్లీ వచ్చి ఏం పీకుదామని అనుకున్నారు. ప్రత్యేక హోదా కోసం లోక్ సభకు ఎంపీలతో కచ్చితంగా రాజీనామాలు చేయించి తీరుతామని వైఎస్ జగన్ చెప్పారు. లోక్‌సభలో రాజీనామాలు చేయడం వల్ల ప్రజాక్షేత్రంలో ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. అంతేగాని రాజ్యసభలో రాజీనామాలు చేయడం వల్ల ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండదు.
ఢిల్లీ వచ్చి ఏదో చించేస్తానని చంద్రబాబు అన్నారు. కేంద్రానికి దడ పుట్టిస్తానని అన్నారు. ఢిల్లీకి వెళ్లి ఆంధ్ర రాష్ట్ర గౌరవాన్ని పార్లమెంటు వద్ద తగ్గించారు. ఫొటోల పోజుల కోసం మెట్ల ముందు వంగి.. లోపలికి వెళ్లి పెద్ద నేతలను, హేమాహేమిలను కలుస్తానని చెప్పి.. హేమమాలినిని వంటి సాదాసీదా ఎంపీలను కలిశారు.
ప్రత్యేక హోదా కోసం నేనే పోరాటం చేశాను అని అన్నారు. రెండు లడ్డులు, ఒక శాలువ తీసుకెళ్లి జస్టిస్ జాస్తి చలమేశ్వర్‌కు ఇచ్చారు. 30 సార్లు ఢిల్లీ వెళ్లి అక్కడి వారికి లడ్డులు ఇచ్చి, శాలువాలు కప్పి వచ్చారు చంద్రబాబు. రాష్ట్ర ప్రజలు చంద్రబాబును మహ్మద్ గజినీలా చూస్తున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నాడో ప్రజలకు అర్థం కావడం లేదు. చంద్రబాబుకు పిచ్చి పట్టింది అనుకుంటున్నారు.
చంద్రబాబు ఇప్పటికైనా దిక్కమాలిన డ్రామాలు ఆపి ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పోరాడాలి. దొంగలు చేసే మానవహారాల్లో వైఎస్సార్ సీపీ పాల్గొనదు. చిత్తశుద్దితో పోరాడుతున్న వామపక్షాలతో కలసి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాం. ప్రత్యేక హోదా సాధన సమితితో కూడా కలసి పోరాడుతున్నాం. రాజీనామాలు ఆమోదింపజేసుకుని ఎన్నికలకు వెళ్లి గెలిచి తీరుతాం. చంద్రబాబులా పూటకో మాట మాట్లాడం.
చంద్రబాబు తన చేతగాని తనాన్ని, అవినీతిని దాచుకునేందుకు కేంద్రం ముందు సాగిలపడుతున్నారు. సైకిల్ యాత్రలు వంటి డూప్డ్రామాలకూ తెర తీశారు. గతంలో కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి పడుతుంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ప్రజలు కచ్చితంగా టీడీపీకి బుద్ధి చెబుతారు. ఈ రాష్ట్రంలో శాశ్వతంగా టీడీపీ కనుమరుగు అయ్యే పరిస్థితి తొందరలోనే రానుంది.’
సీఎం చంద్రబాబు కాంగ్రెస్‌తో లాలూచీ పడ్డారని వైఎస్సార్ సీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీల ఎంపీలు అందరూ కలసి పార్లమెంటులో ఏ వ్యవహారం నడుపుతున్నారో అందరికీ తెలుసునని అన్నారు. హోదా కోసం నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎంపీలు రాష్ట్ర భవిష్యత్ కోసం రాజీనామా చేస్తున్నారని వైఎస్సార్ సీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నారు. రాజీనామాల అనంతరం ఎంపీలు ఆమరణ దీక్షకు దిగుతారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా రాజీనామాలు చేసి దీక్షకు దిగాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment