
సాక్షి, తాడేపల్లి : కరకట్టపై టీడీపీ నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని, కరోనా సమయంలో నిరసనలకు అనుమతి లేదని తెలిసి కూడా ఎల్లో మీడియాలో కనిపిండం కోసమే ప్రజావేదిక దగ్గరకి వెళ్లారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే జోగిరమేష్ విమర్శించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదిక నిర్మిస్తే కూల్చివేయయరా అని ప్రశ్నించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సమయంలో ఆందోళనపై నిషేదం ఉన్నా టీడీపీ నేతలు ప్రజావేదిక దగ్గరకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. (చదవండి : కరకట్టపై టీడీపీ నేతల ఓవర్‌యాక్షన్)
టీడీపీ అవినీతి పాలన అంతమై ఏడాది పూర్తయిన సందర్భంగా సంతాప సభ పెట్టడానికి వెళ్లారా అని నిలదీశారు. ఎల్లో మీడియాలో కనిపించాలనే తపన తప్ప టీడీపీ నేతలకు మరేపని లేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ఉంటున్న ఇంటికి నోటీసులు ఇచ్చిన సిగ్గు లేకుండా అక్రమ కట్టడంలో ఉంటున్నారని విమర్శించారు. చంద్రబాబు సిగ్గుంటే అక్రమ కట్టడం నుంచి బైటకు వెళ్లాలని సవాల్ చేశారు. విధ్వంసానికి ఏడాది అని చంద్రబాబు ట్వీట్ చేశారని, కానీ అది దోపిడీ అంతానికి ఏడాది పూర్తయ్యిందని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ప్రతిపక్షం పోరాడటానికి సమస్యల్లేవని, సీఎం జగన్ సుస్థిరమైన పాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. ఇళ్ల స్థలాలు వస్తున్నాయని పేదలు సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఫలించవని ఎమ్మెల్యే జోగి రమేష్ వ్యాఖ్యానించారు.