
సాక్షి, తిరుపతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు, కానీ బడుగు బలహీన వర్గాల పిల్లలు చదవకూడదని చెప్పటం దారుణమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా అన్నారు. నేడు (నవంబర్ 14) బాలల దినోత్సవం సందర్భంగా వడమాలపేట జిల్లా పరిషత్ పాఠశాలలోని బాలల దినోత్సవ కార్యక్రమానికి గురువారం రోజా హజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యారంగంలో గొప్ప సంస్కరణలు తీసుకొస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని, ఇందుకే దేశం మొత్తం ఏపీ వైపు చూస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తోందని, ఈ రోజే నిజమైన బాలల దినోత్సవమని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లాంటి నేతలు విమర్శిస్తూ మాట్లాడటం సిగ్గు చేటు అని ఆమె మండిపడ్డారు. అలాగే ఓ ఆడియో టేప్‌లో చంద్రబాబు ‘బ్రీఫ్డ్ మీ’ అంటూ తెలుగును చంపేశారని రోజా ఎద్దేవా చేశారు. సీఎం జగన్ అమలు చేస్తున్న నవరత్నాల తరహాలోనే ప్రభుత్వ పాఠశాలల్లో 9 రకాల వసతులు కల్పిస్తున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు.