సాక్షి, న్యూఢిల్లీ: ఎంపీ రఘురామకృష్ణంరాజు నైతిక విలువలు కోల్పోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలిపారు. ఎంపీ రఘురామకృష్ణంరాజుపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేసిన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం మీడియాతో మాట్లాడింది. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశామని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ... రఘురామకృష్ణంరాజుపై చర్యలు తీసుకుంటామని స్పీకర్ హామీ ఇచ్చారు. వైఎస్సార్‌సీపీలో ఉంటూనే ప్రతిపక్షాలతో మంతనాలు జరుపుతూ రఘురామకృష్ణంరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారు.
(చదవండి: పరారీలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర!)
పార్టీ నేతలను దూషిస్తూ ప్రతిపక్షాలతో లాలూచీపడినట్లుగా ప్రవర్తించారు. ఆయనకు ఏమైనా అనుమానాలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లో చర్చించి ఉండాల్సింది. ఇబ్బందులు ఏమైనా ఉంటే పార్టీ అధ్యక్షుడికి తెలియజేయాలి. పార్టీ నియమావళి, క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలున్నాయి. ఊహాజనితమైన విషయాలను ఊహించుకుని దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ తరఫున ఎంపీగా ఉన్నారో ఆ పార్టీపైనే ఆరోపణలు చేస్తున్నారు. ఏవో లాభాలను ఆశించే ఇతర పార్టీలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మనసా, వాచా అతను వైఎస్సార్‌సీపీతో లేరు. స్వపక్షంలో విపక్షంలా రఘురామకృష్ణంరాజు వ్యవహరించారు’అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలి
రఘురామకృష్ణంరాజుకు సీఎం వైఎస్ జగన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని ఎంపీ మిథున్‌రెడ్డి తెలిపారు. టీటీడీ వివాదంపై చైర్మన్‌తో గానీ, ఈఓతోగానీ రఘురామకృష్ణంరాజు చర్చించనిదే... టీటీడీ భూముల అమ్మకాలు జరిగిపోయినట్లుగా మాట్లాడటం దురదృష్టకరమని అన్నారు. ఆయన ఇచ్చిన వివరణలో నిజాయితీ లేదని ఎంపీ మిథున్‌రెడ్డి స్పష్టం చేశారు. రఘురామకృష్ణంరాజు కుంటిసాకులు మానుకోవాలని ఎంపీ నందిగం సురేష్ అన్నారు. ధైర్యం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలని సవాల్ చేశారు. రాబోయే ఉపఎన్నికల్లో ఎవరి ఫొటోకు వ్యాల్యూ ఉందో తెలుస్తుందని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. బడగు బలహీనవర్గాల ప్రజలు తెలుగు మీడియంలో చదవాలా?’అని ఎంపీ భరత్ రఘురామకృష్ణంరాజును ప్రశ్నించారు.
(రఘురామకృష్ణంరాజుపై లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు)
Comments
Please login to add a commentAdd a comment