పుష్పగుచ్ఛం అందజేస్తున్న గవర్నర్ దంపతులు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకార ముహూర్తం ఖరారైంది. ఈ నెల 30న మధ్యాహ్నం 12 గంటల 23 నిమిషాలకు ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు గవర్నర్ కార్యాలయం శనివారం సాయంత్రం అధికారిక బులెటిన్ విడుదల చేసింది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని గవర్నర్ కార్యాలయం తెలిపింది. శనివారం ఉదయం శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అనంతరం వై.ఎస్. జగన్ సతీసమేతంగా గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట కు చేరుకొని నేరుగా రాజ్‌భవన్ వెళ్లారు.
గవర్నర్‌తో వైఎస్ జగన్ దంపతులు, విజయసాయి రెడ్డి, ఇతర నేతలు
శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన జగన్‌కు గవర్నర్ నరసింహన్ అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను ఎన్నుకుంటూ ఎమ్మెల్యేలు చేసిన ఏకవాక్య తీర్మాన ప్రతిని సీనియర్ నేత బొత్స సత్యనారాయణ గవర్నర్‌కు అందజేశారు. తీర్మాన కాపీని పరిశీలించిన గవర్నర్... ప్రభుత్వం ఏర్పా టు చేయాలంటూ వై.ఎస్. జగన్‌ను ఆహ్వానించారు. జగన్ వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సీని యర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ధర్మాన ప్రసాదరావు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఆదిమూలపు సురేశ్ ఉన్నారు. దాదాపు గంటపాటు ఈ భేటీ జరిగింది.
ఉప్పొంగిన అభిమానం
ఏపీ శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సాధించిన ఘన విజయంపట్ల ఆనందోత్సవాల్లో ఉన్న పార్టీ అభిమానులు శనివారం సాయంత్రం హైదరాబాద్ చేరుకున్న వైఎస్ జగన్‌ను చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన తరువాత తొలిసారి హైదరాబాద్ వచ్చిన జగన్‌కు విమానాశ్రయంలోనే పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఆ తరువాత రాజ్‌భవన్ వస్తారని తెలుసుకొని వందలాది మంది పార్టీ జెండాలు, బ్యానర్లతో కదిలివచ్చారు.
రాజ్‌భవన్ వద్ద వైఎస్సార్‌సీపీ అభిమానుల కోలాహలం
జై జగన్.. సీఎం జగన్ జిందాబాద్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. జగన్ కాన్వాయ్ రాజ్‌భవన్‌కు రాగానే ఒక్కసారిగా అభిమానులు చొచ్చుకురావడం తో పోలీసులు వారిని నియంత్రించడానికి కష్టపడాల్సి వచ్చింది. ఆ తర్వాత ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లిన సమయంలోనూ వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలను అదుపు చేయడానికి భద్రతా సిబ్బంది ఇబ్బంది పడ్డారు. ఆ తరువాత జగన్ తన లోటస్‌పాండ్ నివాసానికి వెళ్లినప్పుడు కూడా అదే రీతిలో కార్యకర్తలు, అభిమానులు హర్షధ్వానాలు చేశారు.
గవర్నర్ దంపతులతో భేటీ...
గవర్నర్ నరసింహన్ దంపతులు జగన్, ఆయన సతీమణి భారతీరెడ్డితో కొద్దిసేపు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఈ నెల 30న జరిగే ప్రమాణస్వీకారానికి రావాలని గవర్నర్ సతీమణి విమలా నరసింహన్‌ను ఆహ్వానించగా ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment