బీజేపీ, జనసేన  ఓట్లు కాదనుకుంటే టీడీపీకి 50 సీట్లే | YSRCP Won By A Majority Of Votes In The Winning Areas On TDP | Sakshi
Sakshi News home page

బీజేపీ, జనసేన  ఓట్లు కాదనుకుంటే టీడీపీకి 50 సీట్లే

Published Wed, Mar 27 2019 9:52 AM | Last Updated on Wed, Mar 27 2019 9:52 AM

YSRCP Won By A Majority Of Votes In The Winning Areas On TDP - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో 2014 ఎన్నికల్లో గెలిచిన తెలుగుదేశం పార్టీకి ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మధ్య ఓట్ల తేడా కేవలం 5 లక్షలే. అనేక నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ చాలా స్వల్ప ఓట్ల తేడాతో అనేక స్థానాలను కోల్పోయింది. వైఎస్సార్‌సీపీ గెలిచిన చోట్ల టీడీపీ కన్నా ఎక్కువ ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. వాస్తవానికి టీడీపీ ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసి ఈ విజయాన్ని సాధించలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుని గెలుపొందింది.

ఈ పార్టీలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ ఎన్నికల్లో పోటీచేయకుండా మద్దతు ప్రకటించి ప్రచారం చేశారు. బీజేపీ ద్వారా టీడీపీకి పడిన ఓట్లను తీసేస్తే ఆ పార్టీకి పడిన ఓట్లు చాలా తక్కువే. వైఎస్సార్‌సీపీతో పోలిస్తే టీడీపీకి ఆధిక్యత లేనే లేదు. బీజేపీతో పాటు జనసేన ద్వారా కలసి వచ్చిన ఓట్లు కూడా టీడీపీ నుంచి తీసేస్తే ఆ పార్టీకి 50కి మించి సీట్లు వచ్చే అవకాశమే లేదని స్పష్టమవుతోంది. బీజేపీ, జనసేన పార్టీల మద్దతు లేకుంటే తెలుగుదేశం ఆ ఎన్నికల్లో ఘోర పరాభవాన్ని పొందేది. అప్పటి ఎన్నికల గణాంకాలు చూస్తే స్పష్టమవుతోంది. 2014 ఎన్నికలనే పరికిస్తే ఈ అంశాలు తేటతెల్లమవుతున్నాయి.  

ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 3,67,62,975 ఓట్లకు గాను 2,87,94,902 ఓట్లు పోలయ్యాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ–బీజేపీ కూటమికి 1,34,95,305 ఓట్లు రాగా ఒంటరిగా పోటీచేసిన వైఎస్సార్‌ సీపీకి 1,29,31,730 ఓట్లు లభించాయి. టీడీపీ–బీజేపీ కూటమి ఓట్ల శాతం 46.86 శాతం కాగా వైఎస్సార్‌సీపీకి 44.90 శాతం ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌ పార్టీకి కేవలం 8,10,481 ఓట్లు మాత్రమే వచ్చాయి. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏర్పాటుచేసిన జై సమైక్యాంధ్ర పార్టీకి లోక్‌సత్తా, సీపీఎం, సీపీఐ అన్నీ కలిపి 3,39,225 ఓట్లు వచ్చాయి. ఇతరులకు 10,83,675 ఓట్లు వచ్చాయి.

టీడీపీకి 102, బీజేపీకి 4, వైఎస్సార్‌సీపీకి 67 స్థానాలు దక్కగా ఇద్దరు ఇండిపెండెంట్లు గెలుపొందారు. టీడీపీ–బీజేపీ కూటమికి 46.86 శాతం ఓట్లు, వైఎస్సార్‌ కాంగ్రెస్‌కు 44.90 శాతం ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతం తేడా 1.96 శాతం మాత్రమే. బీజేపీకి వచ్చిన ఓట్లను అనుసరించి ఆమేరకు టీడీపీకి వచ్చిన ఓట్లలో వాటి శాతాన్ని మినహాయిస్తే తెలుగుదేశం ఓటమి బాటలోనే ఉండేదన్న అంశం తేటతెల్లమవుతోంది. అంతే కాకుండా పవన్‌కల్యాణ్‌ జనసేన పార్టీకి రాష్ట్రవ్యాప్తంగా 2 శాతం వరకు ఓట్లు ఉంటాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

2009 ఎన్నికల్లో ఉమ్మడ ఏపీలోని 271 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసిన బీజేపీకి మొత్తం ఓట్లలో 3.10 శాతం ఓట్లు లభించాయి. ఆ లెక్కన 2014 ఎన్నికల్లో బీజేపీ ద్వారా టీడీపీ లభించిన ఓట్లు 8,92,641 వరకు ఉంటాయని అంచనా. జనసేనకు 2 శాతం ఓట్లు లెక్క వేసుకుంటే 5,75,898 ఓట్లు టీడీపీకి లభించాయి. ఈ రెండు పార్టీల ద్వారా లభించిన ఓట్లును తీసివేస్తే టీడీపీకి వచ్చిన ఓట్లు 120,26,766 మాత్రమే. వైఎస్సార్‌సీపీకి వచ్చిన 1,29,31,730 ఓట్లతో పోలిస్తే ఆ పార్టీకన్నా టీడీపీకి 9,04,964 తక్కువే పడినట్లు భావించవచ్చు.

ఏతావాత 2014 ఎన్నికల్లో  టీడీపీకి 102 స్థానాల్లో సగం కూడా వచ్చేవి కావన్న విషయం స్పష్టమవుతోంది.  2014 ఎన్నికల్లో చంద్రబాబు తన సర్వశక్తులూ ఒడ్డారు. టీడీపీది 30 ఏళ్ల పైచిలుకు చరిత్ర. అంతకు ముందు మూడేళ్ల క్రితమే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఆవిర్భవించింది. టీడీపీకి అప్పటికే పటిష్ట యంత్రాంగం ఉంది. అప్పట్లో ఆ పార్టీలో హేమాహేమీలనదగ్గ నేతలున్నా, యంత్రాంగం ఉన్నా టీడీపీ ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి భయపడింది. ఎందుకంటే అంతకు ముందు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ చేతిలో డిపాజిట్లు కూడా దక్కని రీతిలో టీడీపీ ఘోరపరాజయాన్ని చవిచూసింది.  దీంతో అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో ఘోరంగా ఓటమి తప్పదన్న భయంతో చంద్రబాబు కలిసొచ్చే అన్ని పార్టీలను, నేతలను అక్కున చేర్చుకుని ఎన్నికలకు సిద్ధమయ్యారు. 600 మోసపూరిత హామీలు గుప్పించి గద్దెనెక్కారు.


మొత్తం పోలైన ఓట్లు2,87,94,902 

బొటాబొటీగా గట్టెక్కిన మంత్రులు

  • అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి కాల్వ శ్రీనివాసులుకు 92,344 ఓట్లు రాగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కె.రామచంద్రారెడ్డి 90,517 ఓట్లు సాధించి కేవలం 1,827 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. ఇక్కడ కూడా ఇతర నియోజకవర్గాలకు మాదిరిగానే ఇతరులకు పడిన 8,601 ఓట్లు వృధా అయ్యాయి.
  • దర్శిలో మంత్రి శిద్ధా రాఘవరావు మెజార్టీ కేవలం 1,374 ఓట్లే. ఈ నియోజకవర్గంలో శిద్ధాకు 88,821 ఓట్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శివప్రసాదరెడ్డికి 87,447 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఇతరులకు 5,033 ఓట్లు పడి వృధా అయ్యాయి. ఇలాగే 17,574 ఓట్లు పోలవ్వకపోవడం గమనార్హం.
  • ఆచంటలో మంత్రి పితానిపై వైఎస్సార్‌సీపీ  అభ్యర్థి ప్రసాదరాజు 3,920 ఓట్ల తేడాతో అపజయం పాలయ్యారు. ఇక్కడ కూడా ఇండిపెండెంట్లు, కాంగ్రెస్‌ పార్టీల మధ్య ఓట్లు చీలాయి.
  • కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, గుంటూరు జిల్లా వేమూరులోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మంత్రి ఆనందబాబు (టీడీపీ)కి 77,222 ఓట్లు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎం.నాగార్జునకు 75,095 ఓట్లు వచ్చాయి. ఓట్ల తేడా 2,127 మాత్రమే. ఇక్కడ 5,640 ఓట్లు ఇతరులకు పోలయ్యాయి. అలాగే మొత్తం ఓట్లు 1,85,485 ఉండగా ఇందులో 27,528 మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు.  
  •  నెల్లూరు జిల్లా ఉదయగిరిలో మొత్తం 2,26,246 ఓట్లుండగా 1,75,060 పోలయ్యాయి. ఇందులో టీడీపీ అభ్యర్థి బి.వి.రామారావుకు 85,873 ఓట్లు రాగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎం.చంద్రశేఖరరెడ్డి 82,251 ఓట్లు సాధించి 3,622 ఓట్లతో ఓటమి చెందారు. విచిత్రమేమంటే ఈ నియోజకవర్గంలో వీరిద్దరికి కాకుండా ఇండిపెండెంట్లు, ఇతర అభ్యర్థులకు పడిన 6,936 ఓట్లు బూడిదలో పోసిన పన్నీరుగా మారాయి. ఇక్కడ ఏకంగా 51,186 మంది పోలింగ్‌లో పాల్గొనకపోవడంతో ఎన్నికల జయాపజయాలపై ప్రభావం చూపింది. 
  • గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి పోటీచేసిన కోడెల శివప్రసాదరావు (85,247 ఓట్లు) సమీప ప్రత్యర్థి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అంబటి రాంబాబు (84,323 ఓట్లు)పై కేవలం 924 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇక్కడ కూడా 7,886 మంది ఇతర పార్టీలకు ఓటు వేశారు. ఇక ఇక్కడ కూడా 32,040 మంది పోలింగ్‌కు దూరంగా ఉండిపోవడం గమనార్హం. 

రెండుసార్లూ బీజేపీ చలవతోనే.. 
1995లో ఎన్టీ రామారావుకు వెన్నుపోటు పొడిచి పార్టీని, అధికారాన్ని చేజిక్కించుకున్న చంద్రబాబు.. 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకొని వాజ్‌పేయి గాలిలో గెలుపొందారు. ఆ తర్వాత మళ్లీ బీజేపీతో పొత్తుల్లో భాగంగా మోదీ ప్రభంజనంలో 2014 ఎన్నికల్లో గట్టెక్కిన విషయం తెలిసిందే.  

  • విశాఖ జిల్లా చోడవరంలో టీడీపీ అభ్యర్థి ఎన్‌ఎస్‌ రాజుపై వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ కేవలం 909 ఓట్ల తేడాతో ఓడారు. ఇక్కడ కూడా ఇండిపెండెంట్లు ఇతరులకు 6,041 ఓట్లు పోలయ్యాయి. అలాగే మొత్తం ఓట్లలో 30,808 మంది ఓటింగ్‌లో పాల్గొనలేదు.
  • పాయకరావుపేటలో కూడా గెలుపొందిన టీడీపీ అభ్యర్థి వి.వనితకు, వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మధ్య వ్యత్యాసం  2,828 ఓట్లే కాగా ఇక్కడ ఇతరులకు 8,728 ఓట్లు పడి అవన్నీ వృధాగా మారాయి. ఇవే కాకుండా ఇక్కడ కూడా 44,265 మంది ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు.
  • ఇదే జిల్లాలోని నర్సీపట్నంలో టీడీపీ అభ్యర్థి అయ్యన్నపాత్రుడికి సమీప వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓట్ల తేడా కేవలం 2,338 మాత్రమే. అయితే ఇక్కడ 5,370 ఓట్లు ఇండిపెండెంట్లు, కాంగ్రెస్‌ వంటి చిన్నాచితకా పార్టీలకు పోలయ్యాయి. అలాగే 36,092 మంది 

ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు.  

తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో కూడా ఇదే మాదిరిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ కేవలం 1,373 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ నియోజకవర్గంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎస్‌. సూర్యనారాయణరెడ్డికి 82,025 ఓట్లు రాగా టీడీపీ అభ్యర్థి ఎన్‌. రామకృష్ణారెడ్డికి 83,398 ఓట్లు పడ్డాయి. అయితే ఇక్కడ కూడా 68,270 ఓట్లు ఇండిపెండెంట్లు, ఇతరులకు పడ్డాయి. మొత్తం ఓట్లలో 29,596 మంది పోలింగ్‌కు రాకపోవడం గమనార్హం. ఇటువంటి వారంతా ఓటింగ్‌లో 
పాల్గొనాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.   

– సీహెచ్‌ శ్రీనివాసరావు, సాక్షి, అమరావతి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement