
మోస్రా జెడ్పీటీసీగా గెలుపొందిన విజయ భాస్కర్‌రెడ్డి
సాక్షిప్రతినిధి, నిజామాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే పరిషత్ ఎన్నికల్లోనూ పునరావృతమయ్యాయి. జిల్లాలో 27 జెడ్పీటీసీ స్థానాలకు గాను 23 స్థానాలను గెలుచుకుని జిల్లా పరిషత్‌లో తిరుగులేని మెజారిటీని సాధించింది. మరోమారు జిల్లా పరిషత్‌పై గులాబీ జెండాను ఎగురవేయనుంది. 27 మండల పరిషత్‌లుండగా 26 మండల పరిషత్‌లను కైవసం చేసుకునేందుకు స్పష్టమైన మెజారిటీæ సాధించింది. మొత్తం 299 ఎంపీటీసీ స్థానాలకు గాను 188 స్థానాలను కైవసం చేసుకుంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో కాస్త నిరుత్సాహానికి గురైన గులాబీ శ్రేణుల్లో పరిషత్ ఎన్నికల్లో ఘన విజయం నూతనోత్తేజాన్ని నింపినట్లయింది.
రెండు జెడ్పీటీసీ స్థానాలు, 45 ఎంపీటీసీ స్థానాలను దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ రెండో స్థానానికి పరిమితమైంది. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో ఊపు మీదున్న బీజేపీ కూడా రెండు జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. 34 ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. స్వతంత్రులు కూడా ఈ ఎన్నికల్లో సత్తా చాటారు. 32 ఎంపీటీసీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. జిల్లాలోని 27 జెడ్పీటీసీ స్థానాలకు గాను మాక్లూర్ జెడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమైన విషయం విధితమే. టీఆర్‌ఎస్ అభ్యర్థి దాదన్నగారి విఠల్‌రావు ఎన్నికయ్యారు. 26 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అలాగే 13 ఎంపీటీసీ స్థానాలు టీఆర్‌ఎస్ ఏకగ్రీవంగా దక్కించుకోగా 286 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మూడు విడతల్లో పోలింగ్ జరగగా, ఓట్ల లెక్కింపు మంగళవారం చేపట్టారు. నిజామాబాద్ నగరంలోని నిర్మల హృదయ పాఠశాల, బోధన్, ఆర్మూర్ సమీపంలోని మునిపల్లిలో కౌంటింగ్ జరిగింది.
పలు పరిషత్‌లు టీఆర్‌ఎస్ క్లీన్ స్వీప్..
పలు మండల పరిషత్‌లను టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేసింది. బాల్కొండ మండల పరిషత్ పరిధిలో తొమ్మిదింటికి తొమ్మిది ఎంపీటీసీ స్థానాలను దక్కించుకుంది. అలాగే కమ్మర్‌పల్లిలో పదింటికి పది ఎంపీటీసీ స్థానాల్లో విజయం సాధించి ఇతర పార్టీలకు ప్రాతినిధ్యం లేకుండా చేసింది. ఇందల్వాయిలోనూ 11 స్థానాలకు 10 స్థానాల్లో విజయం సాధించింది. ఆ ఒక్క స్థానం స్వతంత్ర అభ్యర్థికి దక్కింది.
‘స్థానికంలో కాంగ్రెస్ కుదేలు..
వరుస ఓటమితో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్ పార్టీకి ప్రాదేశిక ఎన్నికల ఫలితాలు కూడా నిరాశను మిగిల్చా యి. గతంలో జిల్లా పరిషత్‌లో మంచి ప్రాతినిధ్య వహించిన కాంగ్రెస్ పార్టీ ఈసారి కేవలం రెండు జెడ్పీటీసీ స్థానా లకే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చందూరు, ఏర్గట్ల జెడ్పీటీసీ స్థానాలు మాత్రమే కాంగ్రెస్‌కు దక్కాయి. చందూరు ఎంపీపీ పరిధిలో మూడు ఎంపీటీసీ స్థానాలుండగా రెండు చోట్ల కాంగ్రెస్ విజయం సాధించి మండల పరిషత్‌ను దక్కించుకోగలిగింది.
బీజేపీకి గతంలో కంటే కాస్త మెరుగైన ఫలితాలు..
పార్లమెంట్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కమలం పార్టీ గత స్థానిక సంస్థల ఎన్నికల కంటే ఈసారి మెరుగైన ఫలితాలను సాధించింది. రెంజల్, నందిపేట్ జెడ్పీటీసీ స్థానాలను కైవసం చేసుకుని జిల్లా పరిషత్‌లో తొలిసారిగా కాలు మోపుతోంది. పలు జెడ్పీటీసీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు రెండో స్థానంలో నిలిచారు. మరోవైపు గతంలో ఎన్నడూ లేనివిధంగా 34 ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. పలు మండల పరిషత్‌లతో కొంత మేరకు ప్రాతినిధ్యాన్ని దక్కించుకుంది.
సత్తా చాటిన స్వతంత్రులు..
స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు కూడా సత్తా చాటారు. 32 ఎంపీటీసీ స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందడం గమనార్హం. గ్రామాల్లో ఉన్న పలుకుబడి, పేరు ప్రఖ్యాతులు, ప్రజలకు అందుబాటులో ఉండటం వంటి అంశాలు స్వతంత్రుల విజయానికి కారణమ నే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ టిక్కెట్లు దక్కని వారు కొందరు స్వతంత్రులుగా బరిలోకి దిగి విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment