డాక్టర్ అనితారెడ్డి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాపరిషత్ పీఠం టీఆర్‌ఎస్ పార్టీకే దక్కనుంది. కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జరిగిన తొలి జెడ్పీటీసీ ఎన్నికల్లో తిరుగులేని ఆధిక్యాన్ని కనబర్చిన టీఆర్‌ఎస్ పార్టీ జెడ్పీ చైర్‌పర్సన్ సీటును కైవసం చేసుకోనుంది. జెడ్పీ చైర్‌పర్సన్ స్థానం జనరల్ మహిళకు రిజర్వ్ చేసిన విషయం తెలిసిందే. అధికార పార్టీ తరఫున ఈ స్థానానికి మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు డాక్టర్ అనితారెడ్డి పేరును ఇప్పటికే పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. మహేశ్వరం జెడ్పీటీసీగా ఈమె విజయం సాధించడంతో జెడ్పీ పీఠాన్ని అనితారెడ్డి అధిరోహించడం ఇక లాంఛనమే కానుంది. చివరి నిమిషంలో అనూహ్యంగా మార్పులు చోటుచేసుకుంటే తప్ప.. చైర్‌పర్సన్ కుర్చీలో ఆమె కూర్చోనున్నారు. జిల్లాలోని 21 జెడ్పీటీసీల్లో గులాబీ పార్టీ 16 స్థానాలను గెలుచుకుంది. చైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 11 జెడ్పీటీసీలు. ఇంతకుమించి అదనంగా ఐదు స్థానాలను టీఆర్‌ఎస్ సాధించింది. నాలుగు స్థానాలు మాత్రమే సాధించిన కాంగ్రెస్ జెడ్పీ పీఠంపై ఆశలు వదులుకుంది.
ఎంపీపీ సీట్లపైనా గులాబీ గురి
మండల పరిషత్ అధ్యక్ష స్థానాలపై టీఆర్‌ఎస్ దృష్టి సారించింది. జిల్లాలోని 21 ఎంపీపీ స్థానాల్లో తొమ్మిది గులాబీ చేతిలో ఉన్నాయి. ఇక్కడ ఎవరి అవసరం లేకుండా స్వతహాగా టీఆర్‌ఎస్ పార్టీ తరఫున ఎంపీటీసీలుగా గెలిచిన అభ్యర్థులను ఎంపీపీలుగా ఎన్నుకోనున్నారు. మిగిలిన స్థానాలను చేజిక్కించుకునేందుకు ఇప్పటికే పావులు కదుపుతోంది. స్వతంత్రులుగా గెలిచిన ఎంపీటీసీలకు గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది. కొందరు ఎంపీటీసీలు ఫోన్‌లో టచ్‌లోకి వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరో పది ఎంపీపీ స్థానాలను సంపాదించాలని టీఆర్‌ఎస్ పార్టీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు సమాచారం. అయితే, కాంగ్రెస్‌కు అబ్దుల్లాపూర్‌మెట్, మంచాల ఎంపీపీలు దక్కే అవకాశం ఉంది.
ఇక్కడ అధిక సంఖ్యలో గెలిచిన ఆ పార్టీ ఎంపీటీసీలను కాపాడుకుంటే ఇది సాధ్యమే. లేదంటే ఇవి కూడా చేజారిపోయే ప్రమాదం లేకపోలేదు. మిగిలిన మండలాల్లో కాంగ్రెస్‌కు పెద్దగా సానుకూల పరిస్థితులు కనిపించడం లేదు. అలాగే కందుకూరు ఎంపీపీని కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ 16 ఎంపీటీసీలకుగాను.. ఏడింటిలో కమలం వికసించింది. మరో ఇద్దరు అభ్యర్థులను తమవైపు తిప్పుకునేందుకు నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఇక తలకొండపల్లి ఎంపీపీ స్థానం ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) ఖాతాలో దాదాపుగా పడినట్లే. ఇక్కడ ఆ పార్టీ ఆరు ఎంపీటీసీలను కైవసం చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ, జనసేన నుంచి ఒకరు చొప్పున గెలుపొందారు. వారు కూడా ఏఐఎఫ్‌బీకే మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment