
బాలోత్సవం వేదికపై జానపద గీతాలు ఆలపిస్తూ ప్రేక్షకులను ఉత్సాహ పరుస్తున్న గోరటి వెంకన్న
చీమకుర్తి రూరల్: పల్లె సంప్రదాయాలకు పదాలను జతగూర్చి జనపదాలుగా మార్చి నృత్యరూపకంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ప్రముఖ జానపద కళాకారుడు గోరటి వెంకన్న. ఆశుకవిత్వంతో పద కవితలను గుక్కతిప్పుకోకుండా ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. శుక్రవారం చీమకుర్తిలో జరిగిన బాలోత్సవం కార్యక్రమాన్ని వెంకన్న జానపద గీతాలతో వేదికను దద్దరిల్లేలా చేశారు. రెండోరోజు జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పద్మక్క, వెంకటరెడ్డితో కలిసి గోరటి వెంకన్న పల్లెల్లోని వాతావరణ పరిస్థితులను తన జానపద గేయాలతో నృత్యరూపకంలో చూపరులను ఆకర్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యహరిశ్చంద్రుడిగా పేరుగాంచిన చీమకుర్తి నాగేశ్వరరావు పద్యాలు ఉమ్మడి రాష్ట్రాలలోనే పేరెన్నికగలవని అన్నారు.
అంతటి కళాకారుడుని ఆదరించిన చీమకుర్తి వాసులకు కళలంటే ఎంత మక్కువో చెప్పకనే చెప్తున్నాయని, స్థానికుల కళాభిమానాన్ని కొనియాడారు. ముందుగా బాల బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక, జానపద నృత్యాలు ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశాయి. వాటితో పాటు తిరువూరు బాలలు ప్రదర్శించిన ఆలోచించండి నాటిక ఆకట్టుకుంది. తొలుత రెండోరోజు బాలోత్సవం కార్యక్రమాన్ని రోటరీక్లబ్ అ«ధ్యక్షుడు శిద్దా వెంకట సురేష్, వ్యవస్థాపక అధ్యక్షుడు చెరుకూరి రఘుకిరణ్, ప్రధాన కార్యదర్శి ముప్పూరి చలమయ్య ప్రారంభించారు. రెండో రోజు కార్యక్రమాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు.